Print Page Options
Previous Prev Day Next DayNext

Read the New Testament in 24 Weeks

A reading plan that walks through the entire New Testament in 24 weeks of daily readings.
Duration: 168 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 కొరింథీయులకు 3-4

క్రొత్త నిబంధన యొక్క సేవకులు

ఇలా మాట్లాడటం మమ్మల్ని మేము పొగడుకొంటున్నట్లు అనిపిస్తోందా? మీ నుండి మాకు పరిచయపత్రాలు కావాలా? లేక మీ దగ్గరకు వచ్చినప్పుడు యితరులవలే పరిచయ పత్రాలు తీసుకురావాలా? మీరే మా పరిచయ పత్రం. మిమ్మల్ని గురించి మా హృదయాలపై వ్రాయబడి ఉంది. ఇది అందరికీ తెలుసు. దాన్ని అందరూ చదివారు. మీరు క్రీస్తును గురించి వ్రాసిన పత్రంలా స్పష్టంగా కనిపిస్తున్నారు. ఈ పత్రం సిరాతో కాక, సజీవమైన దేవుని ఆత్మతో వ్రాయబడింది. అది రాతి పలకపై కాక, మానవుల హృదయాలపై వ్రాయబడింది. మీరు మా సేవా ఫలితం.

మేము దేవుణ్ణి క్రీస్తు ద్వారా విశ్వసిస్తున్నాము. కనుక మాకానమ్మకం ఉంది. మేము చేస్తున్న కార్యాలు చేయగల సామర్థ్యం మాలో ఉందని చెప్పటం లేదు. ఆ శక్తి మాకు దేవుడు ప్రసాదించాడు. దేవుడు మేము క్రొత్త నిబంధనకు సేవకులుగా ఉండేటట్లు మాకు శక్తినిచ్చాడు. ఈ నిబంధన వ్రాత రూపంలో లేదు. అది దేవుని ఆత్మ రూపంలో ఉంది. వ్రాత రూపంలో ఉన్న నియమాలు మరణాన్ని కలిగిస్తాయి. కాని దేవుని ఆత్మ జీవాన్నిస్తాడు.

క్రొత్త నిబంధన యొక్క మహిమ

రాతిపలకపై అక్షరాలతో చెక్కబడిన నియమాలను దేవుడు యిచ్చినప్పుడు, మోషే ముఖం మీద మహిమాప్రకాశం కనిపించింది. తదుపరి ఆ మహిమ తగ్గుతూ పోయింది. అయినా ఇశ్రాయేలు ప్రజలు అతని ముఖం చూడలేక పోయారు. చావును కలిగించే పాలనలో మహిమ అంత గొప్పగా ఉంటే, దేవుని ఆత్మనిచ్చే పాలనలో యింకెంత మహిమ ఉంటుందో ఆలోచించండి. శిక్షను కలిగించే పాలనలో అంత మహిమ ఉంటే, నీతిని స్థాపించే పాలనలో యింకెంత మహిమ ఉంటుందో ఆలోచించండి. 10 ఇప్పుడు మనకు లభించిన గొప్ప మహిమతో పోలిస్తే, గతంలో ఉండిన ఆ మహిమకు ప్రకాశం లేదు. 11 నశించిపోతున్న ఆ మహిమకు అంత ప్రకాశం ఉంటే చిరకాలం ఉండే మహిమకు యింకెంత ప్రకాశం ఉంటుందో ఆలోచించండి.

12 మాకు అంత నిరీక్షణ ఉంది కనుకనే మాలో యింత ధైర్యముంది. 13 తగ్గిపోతున్న తన ప్రకాశాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడరాదని మోషే తన ముఖానికి ముసుగు వేసుకొన్నాడు. మేము మోషేలాంటివాళ్ళము కాదు. 14 వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఈ నాటికీ వాళ్ళు పాత నిబంధన గ్రంథం చదివినప్పుడు వాళ్ళకు ముసుగు కనిపిస్తూవుంటుంది. దాన్ని ఎవ్వరూ తీయలేరు. క్రీస్తు మాత్రమే ఆ ముసుగు తీసివేయగలడు. 15 ఈ నాటికీ మోషే గ్రంథాలు చదివినప్పుడు ఆ ముసుగు వాళ్ళ బుద్ధిని కప్పివేస్తుంది. 16 కాని ప్రభువు వైపుకు మళ్ళినవాళ్ళ “ముసుగు తీసివేయబడింది.”(A) 17 ప్రభువే “ఆత్మ”. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వేఛ్చ ఉంటుంది. 18 ముసుగు తీసివేయబడ్డ మా ముఖాల్లో ప్రభువు మహిమ ప్రకాశిస్తోంది. అది ఆత్మ అయినటువంటి ప్రభువు నుండి వచ్చింది. అనంతమైన ఆ మహిమ మమ్మల్ని ప్రభువులా మారుస్తోంది.

మట్టి కుండలో సంపద

దేవుని అనుగ్రహం వల్ల మేము ఈ సేవ చేస్తున్నాము. కనుక ధైర్యం కోల్పోము. నిజానికి అవమానం కలిగించే రహస్య మార్గాలను మేము వదిలివేసాము. మేము మోసాలు చెయ్యము. దైవసందేశాన్ని మార్చము. సత్యాన్ని అందరికీ స్పష్టంగా తెలియచేస్తాము. తద్వారా మేము ఎలాంటివాళ్ళమో మేము దేవుని సమక్షంలో ఏ విధంగా జీవిస్తున్నామో ప్రజలు తెలుసుకున్నారు. మేము చెప్పే దైవసందేశం మూయబడితే నశించేవాళ్ళకు మాత్రమే అది మూయబడింది. క్రీస్తు దేవుని ప్రతిరూపం. దైవసందేశం ఆయన మహిమను ప్రకాశింప చేస్తుంది. దాన్ని చూడనీయకుండా ఈ యుగపు పాలకుడు[a] నమ్మని ప్రజల హృదయాలను గ్రుడ్డి చేసాడు. మమ్మల్ని మేము ప్రకటించుకోము. యేసు క్రీస్తు ప్రభువని ప్రకటిస్తాము. యేసు కొరకు మేము మీ సేవకులమని ప్రకటిస్తాము. “చీకటి నుండి వెలుగు ప్రకాశించనీ!”[b] అని అన్న దేవుడు తన వెలుగు మా హృదయాల్లో వెలిగించాడు. క్రీస్తు ముఖంలో దేవుని మహిమ ప్రకాశిస్తోంది. ఆ మహిమలో ఉన్న జ్ఞానాన్ని మాలో ప్రకాశింప చేసాడు.

దేవుడు ఇచ్చిన ఈ ఐశ్వర్యం మాములు మట్టికుండల్లో దాగివుంది. మేమే ఆ కుండలము. దీనివల్ల ఈ శక్తి మాది కాదని, దేవునిదని స్పష్టంగా తెలుస్తోంది. మా చుట్టూ కష్టాలు ఉన్నాయి. కాని మేము ఆ కష్టాలకు నలిగిపోలేదు. మాకు అవమానాలు కలిగాయి. కాని మేము వాటివల్ల దిగులుపడలేదు. మేము హింసించబడుతున్నాము కాని, మేము దిక్కులేనివాళ్ళము కాము. మేము క్రింద పడ్డాము కాని నశించిపోలేదు. 10 మేము అన్ని వేళలా యేసు మరణాన్ని మోసుకొని తిరుగుతూ ఉంటాము. “ఆయన” జీవితం మా జీవితాల ద్వారా వ్యక్తం కావాలని మా ఉద్దేశ్యం. 11 బ్రతికి ఉన్న మేము యేసుకోసం మా జీవితాలను మరణానికి అప్పగిస్తూ ఉంటాము. ఆయన జీవితం మా భౌతిక దేహాల్లో వ్యక్తం కావాలని మా ఉద్దేశ్యం. 12 కనుక ఆయన మరణం మాలో పనిచేస్తోంది. ఆయన జీవితం మీలో పని చేస్తోంది.

13 లేఖనాల్లో, “నేను విశ్వసించాను. కనుక మాట్లాడుతున్నాను”(B) అని వ్రాయబడి ఉంది. మేము కూడా అదే విధంగా విశ్వసించాము. కనుక మాట్లాడుతున్నాము. 14 ఎందుకంటే, చనిపోయిన యేసు ప్రభువును బ్రతికించినవాడు, ఆయనతో సహా మమ్మల్ని కూడా బ్రతికిస్తాడని మాకు తెలుసు. ఆ విధంగా మమ్ములను కూడా లేపి, మీతో సహా మమ్మల్ని కూడా దేవుని సమక్షంలో నిలబెడతాడు. 15 ఇవన్నీ మీ కోసమే జరుగుతున్నాయి. దైవానుగ్రహం ప్రజల్లో వ్యాపిస్తూ పోవాలనీ, దేవుని మహిమ నిమిత్తమై ప్రజలు అర్పించే కృతజ్ఞతలు పెరుగుతూ పోవాలని యిందులోని ఉద్దేశ్యం.

విశ్వాసంద్వారా జీవించటం

16 కనుక మేము అధైర్యపడము. భౌతికంగా మేము క్షీణించిపోతున్నా, మా ఆంతర్యం ప్రతి రోజూ శక్తి పొందుతూ ఉంది. 17 క్షణికమైన మా మామూలు కష్టాలు మా కోసం శాశ్వతమైన మహిమను కలిగిస్తున్నవి. మనము పొందుతున్న మహిమతో, అనుభవింపనున్న కష్టాలను పోలిస్తే ఈ కష్టాలు లెక్కింపతగినవి కావు. 18 అందువల్ల కనిపించే వాటిపై మా దృష్టి ఉంచక కనిపించని వాటిపై మా దృష్టి కేంద్రీకరిస్తున్నాము. కనిపించేది క్షణికము. కనిపించనిది అనంతము.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International