Print Page Options
Previous Prev Day Next DayNext

Read the New Testament in 24 Weeks

A reading plan that walks through the entire New Testament in 24 weeks of daily readings.
Duration: 168 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
అపొస్తలుల కార్యములు 17-18

థెస్సలొనీకలో

17 వాళ్ళు “అంఫిపొలి”, “అపోల్లోనియ” పట్టణాల ద్వారా ప్రయాణం చేసి థెస్సలొనీక అనే పట్టణం చేరుకొన్నారు. అక్కడ ఒక యూదుల సమాజమందిరం ఉంది. అలవాటు ప్రకారం పౌలు ఆ సమాజమందిరానికి వెళ్ళాడు. అక్కడ మూడు శనివారాలు గడిపాడు. వాళ్ళతో యూదుల లేఖనాలు చెప్పి, విషయాలు తర్కించాడు. క్రీస్తు చనిపోవలసిన అవసరం, బ్రతికి రావలసిన అవసరం ఉందని వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఈ విషయాన్ని లేఖనాలుపయోగించి రుజువు చేసాడు. “నేను చెబుతున్న ఈ యేసే క్రీస్తు!” అని వాళ్ళకు నచ్చచెప్పాడు. తద్వారా కొందరు సమ్మతించి పౌలు, సీల పక్షము చేరిపోయారు. దైవభీతిగల చాలా మంది గ్రీకులు, ముఖ్యమైన స్త్రీలు వీళ్ళ పక్షం చేరిపోయారు.

ఇది గమనించి యూదులు అసూయ పడ్డారు. సంతలో ఉన్న పనిలేనివాళ్ళను కొందర్ని నమావేశపరచి పట్టణంలో అల్లర్లు మొదలు పెట్టారు. పౌలు, సీలలను ప్రజల ముందుకు లాగాలనుకొని అంతా కలిసి యాసోను యింటి మీద పడ్డారు. వాళ్ళు అక్కడ కనిపించక పోయేసరికి యాసోన్ను, మరి కొందరు సోదరుల్ని పట్టణపు అధికారుల ముందుకు తీసుకొని వచ్చి, “ప్రపంచాన్నే కలవరపరచిన ఈ మనుష్యులు ఇప్పుడిక్కడికి వచ్చారు. వీళ్ళకు యాసోను తన యింట్లో ఆతిథ్యమిచ్చాడు. వీళ్ళంతా చక్రవర్తి నియమాల్ని అతిక్రమిస్తూ యేసు అనే మరొక రాజున్నాడంటున్నారు” అని కేకలు వేసారు.

ఈ మాటలు విని అక్కడున్న ప్రజలు, అధికారులు రేకెత్తిపోయారు. ఆ తర్వాత యాసోనుతో, మిగతా వాళ్ళందరితో పత్రాన్ని వ్రాయించుకొని వాళ్ళను వదిలివేసారు.

బెరయలో

10 అర్థరాత్రి కాగానే సోదరులు పౌలును, సీలను బెరయ అనే పట్టణానికి పంపించారు. బెరయకు వచ్చినవాళ్ళు యూదుల సమాజమందిరానికి వెళ్ళారు. 11 థెస్సలోనీక వాళ్ళకన్నా బెరయవాళ్ళు మర్యాద కలవాళ్ళు. వాళ్ళు దైవసందేశాన్ని శ్రద్ధతో వినేవాళ్ళు. ప్రతిరోజు పవిత్ర గ్రంథం చదివి, ఆ సందేశంలోని నిజానిజాలు పరిశీలించేవాళ్ళు. 12 చాలా మంది యూదులు విశ్వాసులయ్యారు. వాళ్ళలాగే ముఖ్యమైన గ్రీకు స్త్రీలు, పురుషులు కూడా విశ్వాసులయ్యారు.

13 పౌలు దైవసందేశాన్ని బెరయలో కూడా ఉపదేశిస్తున్నాడని థెస్సలోనీకలోని యూదులకు తెలిసింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రజలను పురికొలిపి, వాళ్ళలో అల్లర్లు రేకెత్తించారు. 14 వెంటనే సోదరులు పౌలును సముద్ర తీరానికి పంపారు. సీల, తిమోతి బెరయలోనే ఉండిపోయారు. 15 పౌలుతో వెళ్ళినవాళ్ళు అతనితో కలిసి ఏథెన్సుదాకా వెళ్ళారు. సీలను, తిమోతిని అయినంత త్వరలో రమ్మనమని పౌలు వాళ్ళ ద్వారా కబురు పంపాడు. ఈ వార్తతో వాళ్ళు తిరిగి బెరయకు వెళ్ళిపోయారు.

ఏథెన్సులో

16 పౌలు ఏథెన్సులో వాళ్ళకోసం ఎదురు చూస్తూ కొద్ది రోజులు ఆగిపొయ్యాడు. ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉండటం గమనించి అతని ఆత్మ దుఃఖించింది. 17 అందువల్ల సమాజమందిరంలో సమావేశమయ్యే యూదులతో, దైవభీతిగల యూదులుకాని ప్రజలతో, సంతకు వచ్చి పోయే ప్రజలతో ప్రతి రోజు మాట్లాడే వాడు. 18 ఎపికూరీయులు అని అనబడే కొందరు తత్వజ్ఞులు, స్తోయికులు అనబడే కొందరు తత్వజ్ఞులు అతనితో తర్కించారు.

“ఆ వదరుబోతు ఏమంటున్నాడు?” అని కొందరు అన్నారు. “ఇతర దేవుళ్ళను గురించి ప్రబోధిస్తున్నట్లుంది” అని మరి కొందరు అన్నారు. పౌలు యేసును గురించి, ఆయన బ్రతికి రావటాన్ని గురించి ప్రకటించటం వల్ల అతణ్ణి వాళ్ళిలా విమర్శించారు.

19 వాళ్ళు అతనిని పట్టుకొని అరేయొపగు సభకు పిలుచుకు వచ్చారు. “నీవు చెబుతున్న ఈ క్రొత్త బోధ ఏమిటో మేము తెలుసుకోవచ్చా?” అని కొందరు అడిగారు. 20 “నీవు చిత్రమైన విషయాలు మా చెవుల్లో వేసావు. వాటి అర్థం మాకు చెప్పు” అని మరి కొందరడిగారు. 21 ఏథెన్సు ప్రజలు, ఆ పట్టణంలో నివసించే పరదేశీయులు, తమ కాలాన్నంతా కొన్ని సిద్ధాంతాలను చెప్పటంలోనో లేక వినటంలోనో గడిపేవాళ్ళు. మరే పని చేసేవాళ్ళు కాదు.

22 పౌలు అరేయొపగు సభలో నిల్చొని, “ఏథెన్సు ప్రజలారా! మీరు అన్ని విషయాల్లో చాలా నిష్ఠగా ఉన్నారు. ఇది నేను గమనించాను. 23 నేను మీ పట్టణమంతా పర్యటించాను. మీరు పూజించే వాటిని చూసాను. అంతేకాదు సాంబ్రాణి వేసే ఒక బలిపీఠం మీద, ‘తెలియని దేవునికి’ అని వ్రాయబడి ఉండటం చూసాను. అందువల్ల మీకు తెలియకున్నా మీరు పూజించే ఆ దేవుణ్ణి గురించి ప్రకటించబోతున్నాను.

24 “ఈ ప్రపంచాన్ని, దానిలో ఉన్న ప్రతి వస్తువును సృష్టించిన దేవుడు, ఆకాశానికి, భూమికి ప్రభువైనటువంటి దేవుడు మానవులు కట్టిన మందిరాల్లో నివసించడు. 25 మానవులు దేవుని కోసం చేయగలిగిందేదీ లేదు. జీవి పీల్చుకొనే గాలిని, కావలసిన ప్రతి వస్తువును యిచ్చిన దేవునికి మానవుని సేవలు కావాలా? 26 ఆయన ఒక్క మనుష్యునితో మానవులందర్ని సృష్టించి వాళ్ళు ఈ ప్రపంచమంతా నివసించేటట్లు చేసాడు. వాళ్ళ కోసం ఒక కాలాన్ని నియమించాడు. ఏ దేశపు ప్రజలు ఎక్కడ నివసించాలో ఆ స్థలాన్ని, కాలాన్ని సరిగ్గా నియమించాడు.

27 “మానవులు తనను వెతకాలనీ, గ్రుడ్డివాడు తడిమినట్టు తడిమి తనను కనుగొనే అవకాశం వాళ్ళకు కలిగించాలనీ యిలా చేసాడు. కాని నిజానికి ఆయన ఎవ్వరికీ దూరంగా లేడు. 28 ‘మనం ఆయనలో జీవిస్తున్నాం, ఆయనలో కదులుతున్నాం, ఆయన కారణంగా మనం ఉన్నాం.’ మీలోని కొందరు కవులు చెప్పినట్లు: ‘మనం ఆయన సంతానం.’

29 “మనం దేవుని సంతానం కదా! అలాంటప్పుడు, దేవుడు బంగారంతో కాని, లేక వెండితో కాని, లేక రాతితో కాని చేయబడిన విగ్రహంలాంటివాడని మనం ఎట్లా అనగలం? ఆయన మానవుడు తన కల్పనతో, కళతో సృష్టించిన విగ్రహంలాంటివాడు కాడు. 30 గతంలో మానవుని అజ్ఞానం పట్ల ఆయన చూసీ చూడనట్లు ఉండినాడు. కాని యిప్పుడు ప్రతి ఒక్కణ్ణీ మారుమనస్సు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు. 31 ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిపై న్యాయమైన తీర్పు చెప్పనున్న రోజును నిర్ణయించాడు. ఎవని ద్వారా తీర్పు చెప్పనున్నాడో ఆయన్ని నియమించాడు. ఆయన్ని బ్రతికించి, తాను చేయనున్నదాన్ని ప్రజలందరికీ రుజువు చేసాడు.”

32 చనిపోయిన వారు యేసువలె బ్రతికి వస్తారన్న విషయం విని కొందరు అతణ్ణి హేళన చేసారు. మరి కొందరు, “ఈ విషయాన్ని గురించి మాకింకా వినాలని ఉంది” అని అన్నారు. 33 పరిస్థితులు యిలా అవటం వల్ల పౌలు ఆ సభనుండి వెళ్ళిపొయ్యాడు. 34 కొందరు విశ్వాసులై పౌలును అనుసరించారు. వాళ్ళలో అరేయొపగు అను సభకు సభ్యత్వం ఉన్న దియొనూసి అనేవాడు, దమరి అనే స్త్రీ మొదలగువాళ్ళున్నారు.

కొరింథు

18 ఆ తరువాత పౌలు ఏథెన్సు వదిలి కొరింథుకు వెళ్ళాడు. అక్కడ అకుల అనే యూదుణ్ణి కలుసుకొన్నాడు. ఇతని స్వగ్రామం పొంతు. క్లౌదియ యూదులందర్ని రోమా నగరం వదిలి వెళ్ళమని ఆజ్ఞాపించటంవలన అకుల ఇటలీనుండి తన భార్య ప్రిస్కిల్లతో కలసి ఈ మధ్య యిక్కడికి వచ్చాడు. పౌలు వాళ్ళను చూడటానికి వెళ్ళాడు. తనలాగే వాళ్ళు కూడా గుడారాలు చేసి జీవించేవాళ్ళు కనుక వాళ్ళతో కలిసి ఉండి పని చేసాడు.

ప్రతి విశ్రాంతి రోజూ సమాజమందిరాల్లో తర్కించి యూదుల్ని, గ్రీకుల్ని ఒప్పించటానికి ప్రయత్నించేవాడు. మాసిదోనియనుండి సీల, తిమోతి వచ్చాక పౌలు తన కాలాన్నంతా బోధించటానికి వినియోగించాడు. యూదుల సమక్షంలో మాట్లాడి, యేసు ప్రభువే క్రీస్తు అని నిరూపించే వాడు. కాని యూదులు ఎదురు తిరిగి అతణ్ణి దూషించారు. పౌలు తన నిరసనను వ్యక్తపరుస్తూ తన దుస్తుల్ని దులిపి, “మీరు పొందనున్న శిక్షకు మీరే బాధ్యులు, నేను బాధ్యుణ్ణి కాదు. ఇక మీదట నేను యూదులు కానివాళ్ళ దగ్గరకు వెళ్తాను” అని అన్నాడు.

పౌలు సమాజమందిరాన్ని వదిలి ప్రక్కనున్న తీతియు యూస్తు అనే విశ్వాసి యింటికి వెళ్ళాడు. యూదుల సమాజమందిరంపై అధికారిగా పని చేస్తున్న క్రిస్పు అనే వ్యక్తి అతని యింట్లోనివాళ్ళు ప్రభువును విశ్వసించారు. చాలా మంది కొరింథు ప్రజలు పౌలు చెప్పిన వాటిని విని ప్రభువును విశ్వసించి బాప్తిస్మము పొందారు.

9-10 ఒకనాటి రాత్రి ప్రభువు పౌలుకు కలలో కనిపించి, “ఈ పట్టణంలో నా ప్రజలు చాలా మంది ఉన్నారు. కనుక మౌనం వహించక ధైర్యంగా బోధించు. నేను నీ వెంటే ఉన్నాను. ఎవ్వరూ నీకు ఎదురు తిరగలేరు. ఏ హానీ చెయ్యలేరు” అని అన్నాడు. 11 పౌలు ఒకటిన్నర సంవత్సరాలు అక్కడుండి దైవసందేశాన్ని వాళ్ళకు బోధించాడు.

పౌలు గల్లియో ఎదుటికి తీసుకురాబడ్డాడు

12 గల్లియో అనే పేరుగల ఒక వ్యక్తి అకయ ప్రాంతానికి సామంత రాజుగా ఉండేవాడు. అతని కాలంలో యూదులందరూ కలిసి పౌలుకు ఎదురు తిరిగారు. అతణ్ణి న్యాయస్థానం ముందుకు తెచ్చి, 13 “ఇతడు మన శాస్త్రానికి విరుద్ధమైన పద్ధతిలో దేవుణ్ణి పూజించమని ప్రజల్ని ఒత్తిడి చేస్తున్నాడు” అని అతణ్ణి నిందించారు.

14 పౌలు సమాధానం చెప్పటానికి సిద్ధం అయ్యాడు. ఇంతలో గల్లియో యూదులతో, “మీరు ఘోరమైన నేరాన్ని గురించి కాని, లేక చెడు నడతను గురించి కాని చెప్పదలిస్తే నేను మీ విన్నపం వినటం సమంజసంగా ఉంటుంది. 15 కాని మీ ఆరోపణ పదాలను గురించి, పేర్లను గురించి, మీ శాస్త్రాల్ని గురించి కాబట్టి మీలో మీరు తీర్మానం చేసుకోండి. 16 అలాంటి వాటిపై నేను తీర్పు చెప్పను” అని అంటూ వాళ్ళను న్యాయస్థానంనుండి తరిమివేసాడు.

17 వాళ్ళు యూదుల సమాజమందిరానికి పెద్ద అయినటువంటి సోస్తెనేసును పట్టుకొని అతణ్ణి న్యాయస్థానం ముందు కొట్టారు. అయినా గల్లియో తనకు సంబంధం లేనట్టు ఊరుకొన్నాడు.

అంతియొకయకు తిరిగి వెళ్ళటం

18 పౌలు కొరింథులో కొంతకాలం ఉన్నాడు. ఆ తర్వాత అక్కడున్న సోదరుల్ని వదిలి, ప్రిస్కిల్లను, అకులను తన వెంట పిలుచుకొని ఓడలో సిరియ దేశానికి ప్రయాణమయ్యాడు. ప్రయాణానికి ముందు తాను మ్రొక్కుబడి తీర్చుకోవటానికి కెంక్రేయలో తన వెంట్రుకలు కత్తిరించుకున్నాడు. 19 వాళ్ళు ఎఫెసుకు చేరుకున్నారు. అక్కడ పౌలు ప్రిస్కిల్లను, అకులను వదిలి తానొక్కడే సమాజమందిరానికి వెళ్ళి యూదులతో తర్కించాడు. 20 వాళ్ళు అతణ్ణి తమతో మరికొన్ని రోజులుండమని అడిగారు. అతడు వీల్లేదన్నాడు. 21 కాని వెళ్ళే ముందు, “దేవుని చిత్తమైతే మళ్ళీ వస్తాను” అని వాళ్ళతో చెప్పి అక్కడినుండి ఓడలో ప్రయాణం చేసాడు.

22 అతడు కైసరియ తీరాన్ని చేరుకొని అక్కడినుండి యెరూషలేము వెళ్ళాడు. అక్కడున్న సంఘానికి శుభాకాంక్షలు తెలిపి అక్కడినుండి అంతియొకయకు వెళ్ళాడు. 23 అంతియొకయలో కొద్ది రోజులు గడిపి అక్కడినుండి ప్రయాణమై గలతియ, ఫ్రుగియ ప్రాంతాల్లో పర్యటన చేసి, ఆయా ప్రాంతాల్లో ఉన్న విశ్వాసుల్లో విశ్వాసం అభివృద్ధి చెందేటట్లు చేసాడు.

ఎఫెసులో అపొల్లో

24 ఇది యిలా ఉండగా అపొల్లో అనే యూదుడు ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు. అపొల్లో స్వగ్రామం అలెక్సంద్రియ. ఇతడు గొప్ప పండితుడు. యూదుల శాస్త్రాల్లో ఆరితేరినవాడు. 25 ప్రభువు మార్గాన్ని గురించి ఉపదేశం పొందినవాడు. యేసును గురించి సక్రమంగా గొప్ప ఉత్సాహంతో బోధించాడు. కాని బాప్తిస్మము విషయంలో అతనికి యోహాను బోధించిన విషయాలు మాత్రమే తెలుసు. 26 అతడు యూదుల సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. ప్రిస్కిల్ల, అకుల యితని బోధ విని అతణ్ణి తమ యింటికి పిలిచి దైవ మార్గాన్ని గురించి అతనికి యింకా విశదంగా చెప్పారు.

27 అపొల్లో అకయ ప్రాంతానికి వెళ్ళాలనుకొన్నాడు. సోదరులు అతని ఉద్దేశాన్ని బలపరిచారు. అకయ ప్రాంతాల్లో ఉన్న శిష్యులకు ఉత్తరం వ్రాసి యితనికి స్వాగతం చెప్పమని అడిగారు. అతడు వెళ్ళి, దైవానుగ్రహంవల్ల యేసును విశ్వసించినవాళ్ళకు చాలా సహాయం చేసాడు. 28 ప్రజలందరి ముందు యూదులతో తీవ్రమైన వాద వివాదాలు చేసి, వాళ్ళను ఓడించి శాస్త్రాల ద్వారా యేసు ప్రభువే క్రీస్తు అని రుజువు చేసాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International