New Testament in a Year
విశ్వాసము
11 ఆశించినవి తప్పక లభిస్తాయని నమ్మటం, మనకు కనిపించనివాటిని ఉన్నాయని నమ్మటం. ఇదే విశ్వాసం. 2 మన పూర్వికుల్లో యిలాంటి విశ్వాసముంది కనుకనే దేవుడు వాళ్ళను మెచ్చుకొన్నాడు.
3 దేవుడు ఆజ్ఞాపించటం వల్ల ఈ ప్రపంచం సృష్టింపబడిందని మనము విశ్వసిస్తున్నాము. అంటే, కనిపించనివాటితో కనిపించేది సృష్టింపబడిందన్న మాట.
4 హేబెలుకు దేవుని పట్ల విశ్వాసముంది గనుకనే అతడు కయీను అర్పించిన బలికన్నా విలువైన బలిని దేవునికి అర్పించాడు. హేబెలు అర్పించిన బలిని దేవుడు మెచ్చుకొని అతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు. అందుకే హేబెలు మరణించినా అతనిలో ఉన్న విశ్వాసం ద్వారా యింకా మాట్లాడుతునే ఉన్నాడు.
5 హనోకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే దేవుడతణ్ణి సజీవంగా పరలోకానికి తీసుకు వెళ్ళాడు. ఆ కారణంగానే అతడు ఎవ్వరికీ కనపడలేదు. పరలోకానికి వెళ్ళకముందు అతడు దేవుణ్ణి సంతోషపరచినందుకు దేవుడు అతణ్ణి మెచ్చుకొన్నాడు. 6 విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఆనందపరచటం అసంభవం. దేవుని దగ్గరకు రావాలనుకొన్నవాడు ఆయనున్నాడని, అడిగినవాళ్ళకు ప్రతిఫలం యిస్తాడని విశ్వసించాలి.
7 నోవహు దేవుణ్ణి విశ్వసించినందువల్ల దేవుడతనికి, “ప్రళయం రాబోతున్నది” అని ముందే చెప్పాడు. అతనిలో భయభక్తులుండటం వల్ల అతడు దేవుని మాట విని, తన కుటుంబాన్ని రక్షించటానికి ఒక ఓడను నిర్మించాడు. అతనిలో ఉన్న విశ్వాసము ప్రపంచం తప్పు చేసిందని నిరూపించింది. ఆ విశ్వాసం మూలంగా అతడు నీతిమంతుడయ్యాడు.
8 అబ్రాహాములో విశ్వాసముంది కనుక అతడు దేవుడు చెప్పిన దేశానికి, తానెక్కడికి వెళ్తున్నది తనకు తెలియక పోయినా విధేయతతో వెళ్ళాడు. ఆ తర్వాత దేవుడతనికి ఆ దేశాన్ని అతని పేరిట యిచ్చాడు. 9 విశ్వాసముంది కనుకనే అతడు దేవుడు చూపిన దేశంలో ఒక పరదేశీయునిగా నివసించాడు. దేవుడు వాగ్దానం చేసినవాటిల్లో తనతో సహవారసులైన ఇస్సాకు మరియు యాకోబులతో కలిసి గుడారాల్లో నివసించాడు. 10 దేవుడు తన నమూన ప్రకారం శాశ్వతమైన పునాదులు వేసి నిర్మించిన పట్టణం కోసం అబ్రాహాము ఎదురు చూస్తూ ఉండేవాడు.
11 శారా వృద్ధురాలు, పైగా గొడ్రాలు. అబ్రాహాము వృద్ధుడయినా, దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించినందువల్ల అబ్రాహాము తండ్రి కాగలిగాడు. 12 చనిపోవటానికి సిద్ధంగా ఉన్న అబ్రాహాముకు ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లా, సముద్ర తీరానవుండే యిసుక రేణువల్లా లెక్కలేనంత మంది వారసులు కలిగారు.
13 వీళ్ళందరు దేవుణ్ణి విశ్వసిస్తూ జీవించి, మరణించారు. దేవుడు వాగ్దానం చేసినవి వాళ్ళకు లభించలేదు. వాళ్ళు అవి రావటం దూరం నుండి చూసి ఆహ్వానించారు. ఈ భూమ్మీద తాము పరదేశీయుల్లా జీవిస్తున్నట్లు వాళ్ళు అంగీకరించారు. 14 వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే వాళ్ళు తమ స్వదేశానికోసం వెతుకుతూండేవాళ్ళని అనిపిస్తుంది. 15 ఒక వేళ వాళ్ళు తాము వదిలివచ్చిన దేశాన్ని గురించి ఆలోచిస్తున్నట్లయితే తమ దేశానికి తిరిగి వెళ్ళే అవకాశం వాళ్ళకు ఉండింది. 16 కాని వాళ్ళు యింకా గొప్ప దేశానికి, అంటే పరలోకానికి వెళ్ళాలని ఆశించారు. అందువల్ల దేవుడు యితర్లు తనను “వాళ్ళ దేవుడు” అని పిలిచినందుకు సిగ్గుపడలేదు. పైగా తన వాళ్ళ కోసం ఒక పట్టణం నిర్మించాడు.
17-18 దేవుడు అబ్రాహామును పరీక్షించినప్పుడు అతనిలో విశ్వాసముండటంవల్ల ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధం అయ్యాడు. దేవుడు ఇస్సాకు ద్వారా నీ వంశం అభివృద్ధి చెందుతుంది(A) అని యింతకు పూర్వం వాగ్దానం చేశాడు. అయినా అబ్రాహాము తన ఏకైక పుత్రుణ్ణి బలిగా అర్పించబోయాడు. 19 దేవుడు చనిపోయినవాళ్ళను బ్రతికించగలడని అబ్రాహాముకు తెలుసు. ఒక విధంగా చూస్తే దేవుడు ఇస్సాకును బ్రతికించి అబ్రాహాముకు ఇచ్చాడనే చెప్పుకోవచ్చు.
© 1997 Bible League International