New Testament in a Year
యేసు క్రీస్తు—మనకవసరమైన ఏకైక బలి
10 ధర్మశాస్రం రాబోవు మంచి విషయాల నీడలాంటిది. అది అస్పష్టమైనది. అంటే, ఆ మంచి విషయాలు అప్పటికింకా రాలేదన్నమాట. ధర్మశాస్రం ఆదేశించిన విధంగా ప్రజలు దేవుని దగ్గరకు ప్రతి సంవత్సరం వచ్చి తప్పకుండా ఒకే రకమైన బలులు అర్పించేవాళ్ళు. కాని ధర్మశాస్త్రం వాళ్ళలో పరిపూర్ణత కలిగించలేదు. 2 అలా చేసినట్లైతే, వాళ్ళు ఆ బలులు యివ్వటం మాని ఉండేవాళ్ళు. పాపాలు శాశ్వతంగా పరిహారమై వాళ్ళు పశ్చాత్తాపం చెందవలసిన అవసరం ఉండేది కాదు. 3 కాని దానికి మారుగా ఆ బలులు వాళ్ళు చేసిన పాపాల్ని ప్రతి సంవత్సరం వాళ్ళకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. 4 ఎద్దుల రక్తంతో, మేకల రక్తంతో పాపపరిహారం కలగటమనేది అసంభవం.
5 ఆ కారణంగానే, క్రీస్తు ఈ ప్రపంచంలోకి వచ్చాక దేవునితో ఈ విధంగా అన్నాడు:
“బలుల్ని, అర్పణల్ని నీవు కోరలేదు
కాని, నేనుండటానికి ఈ శరీరాన్ని సృష్టించావు.
6 జంతువుల్ని కాల్చి అర్పించిన ఆహుతులు కాని,
పాపపరిహారం కోసం యిచ్చిన బలులు కాని,
నీకు అనందం కలిగించలేదు.
7 అప్పుడు నేను, ‘ఇదిగో దేవా! ఇక్కడ ఉన్నాను!
నన్ను గురించి గ్రంథాల్లో వ్రాశారు.
నేను నీ యిచ్ఛ నెరవేర్చటానికి వచ్చాను’ అని అన్నాను.”(A)
8 “బలుల్ని, అర్పణల్ని, జంతువుల్నికాల్చి యిచ్చిన ఆహుతుల్ని, పాప పరిహారం కోసం యిచ్చిన ఆహుతుల్ని నీవు కోరలేదు. అవి నీకు ఆనందం కలిగించలేదు” అని మొదట అన్నాడు. కాని, ధర్మశాస్త్రం ఈ ఆహుతుల్ని యివ్వమని ఆదేశించింది. 9 ఆ తర్వాత క్రీస్తు, “ఇదిగో దేవా! ఇక్కడ ఉన్నాను. నీ యిచ్ఛ నెరవేర్చటానికి వచ్చాను” అని అన్నాడు. ఆయన రెండవదాన్ని నెరవేర్చటానికి మొదటిదాన్ని రద్దుచేశాడు. 10 దైవేచ్ఛ నెరవేర్చటానికి క్రీస్తు తన శరీరాన్ని బలిగా అర్పించి మనల్ని శాశ్వతంగా పవిత్రం చేశాడు. ఆయన యిచ్చిన మొదటి బలి, చివరి బలి యిదే.
11 ప్రతి యాజకుడు మత సంబంధమైన కర్తవ్యాన్ని ప్రతిరోజు నెరవేరుస్తూ ఉంటాడు. ఇచ్చిన బలుల్నే మళ్ళీ మళ్ళీ యిస్తూ ఉంటాడు. ఈ బలులు పాపపరిహారం చెయ్యలేవు. 12 కాని క్రీస్తు మన పాపపరిహారార్థం ఒకే ఒక బలి యిచ్చి దేవుని కుడిచేతి వైపు శాశ్వతంగా కూర్చుండిపొయ్యాడు. 13 అప్పటినుండి, ఆయన శత్రువుల్ని దేవుడు ఆయన పాదపీఠంగా చెయ్యాలని కాచుకొని ఉన్నాడు. 14 ఆయన ఒకే ఒక అర్పణ చేసి పరిశుద్ధులలో శాశ్వతమైన పరిపూర్ణత కలిగించాడు.
15 ఈ విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ మనకు యిలా ప్రకటిస్తున్నాడు:
16 “ఆ తర్వాత నేను వాళ్ళతో ఈ ఒడంబడిక చేస్తాను.
నా నియమాల్ని వాళ్ళ హృదయాల్లో ఉంచుతాను.
వాటిని వాళ్ళ మనస్సులపై వ్రాస్తాను.”(B)
17 పరిశుద్ధాత్మ ఇంకా యిలా అన్నాడు:
“వాళ్ళ పాపాల్ని,
దుర్మార్గాల్ని నేను మరిచిపోతాను!”(C)
18 వాళ్ళ పాపాల్ని దేవుడు క్షమించాడు కాబట్టి, పాపం కోసం బలుల్ని అర్పించవలసిన అవసరం తీరిపోయింది.
© 1997 Bible League International