Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 కొరింథీయులకు 11:16-33

పౌలు తన కష్టాలలో అతిశయించుట

16 నన్నొక తెలివతక్కువవానిగా పరిగణించవద్దని మళ్ళీ చెపుతున్నాను. మీరు నేను తెలివతక్కువవాణ్ణని అనుకొంటే, తెలివిలేనివాణ్ణి అంగీకరించినట్లు నన్ను అంగీకరించండి. అప్పుడు దానికి నేను కొద్దిగా గర్వపడవచ్చు. 17 నాలో ఉన్న ఆత్మవిశ్వాసం వల్ల గర్వంగా మాట్లాడుతున్నాను. ప్రభువు మాట్లాడమన్నట్లు కాకుండా తెలివిలేనివాడు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాను. 18 అందరూ లౌకికులవలె తమను గురించి గర్వంగా మాట్లాడుకుంటున్నారు. కనుక నేను కూడా గర్వంగా మాట్లాడుతున్నాను. 19 మీరు బుద్ధిమంతులైయుండి తెలివిలేనివాళ్ళ పట్ల మీరు ఆనందంగా సహనం చూపిస్తున్నారు. 20 మిమ్మల్ని బానిసలుగా చేసుకొన్నవాళ్ళపట్ల, దోచుకొనేవాళ్ళపట్ల, మీ వల్ల లాభం పొందేవాళ్ళపట్ల, మిమ్మల్ని అణచి పెట్టేవాళ్ళపట్ల, మీ చెంపమీద కొట్టినవాళ్ళపట్ల, మీరు సహనం చూపుతారు. 21 వాళ్ళలా ప్రవర్తించే ధైర్యం మాకు లేదు. ఇది చెప్పుకోవటానికి నాకు సిగ్గు వేస్తోంది.

ఎవరికైనా గర్వంగా మాట్లాడే ధైర్యం ఉంటే, నేనూ ఒక అవివేకిగా మాట్లాడుతున్నాను, నాకు కూడా గర్వంగా మాట్లాడే ధైర్యం ఉంది. 22 వాళ్ళు హెబ్రీయులా? నేను కూడా హెబ్రీయుణ్ణి, వాళ్ళు ఇశ్రాయేలీయులా? నేను కూడా ఇశ్రాయేలీయుడను. వాళ్ళు అబ్రాహాము వంశీయులా? నేను కూడా అబ్రాహాము వంశీయుణ్ణి. 23 వాళ్ళు క్రీస్తు సేవకులా? ఈ విధంగా మాట్లాడాలంటే నాకు మతిపోతుంది. నేను వాళ్ళకన్నా ఎక్కువ సేవ చేస్తున్నాను. నేను వాళ్ళకన్నా ఎక్కువ కష్టించి పని చేసాను. వాళ్ళకన్నా ఎక్కువ సార్లు కారాగారానికి వెళ్ళాను. వాళ్ళకన్నా తీవ్రమైన కొరడాదెబ్బలు తిన్నాను. ఎన్నోసార్లు చావుకు గురి అయ్యాను.

24 యూదులు నన్ను ఐదు సార్లు ముప్పైతొమ్మిది కొరడాదెబ్బలు కొట్టారు. 25 మూడు సార్లు ఇనుప కడ్డీలతో కొట్టారు; ఒకసారి రాళ్ళతో కొట్టారు. మూడు సార్లు పడవ పగిలి ఒక రాత్రి, ఒక పగలు సముద్రం మీద గడిపాను. 26 విరామం లేకుండా ప్రయాణం చేసాను. ఆ ప్రయాణాల్లో నదులవల్ల ప్రమాదం కలిగింది. బందిపోటు దొంగలవల్ల ప్రమాదం కలిగింది. నా జాతీయులవల్ల ప్రమాదం కలిగింది. యూదులుకానివాళ్ళవల్ల ప్రమాదం కలిగింది. పట్టణాల్లో ప్రమాదం కలిగింది. నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రమాదం కలిగింది. సముద్రం మీద ప్రమాదం కలిగింది. దొంగ సోదరులవల్ల ప్రమాదం కలిగింది.

27 నేను కష్టాలు ఎదుర్కొని, కష్టించి పని చేసాను. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. ఆకలి దప్పులు అంటే ఏమిటో తెలుసుకొన్నాను. ఎన్నోసార్లు ఆహారం లేక గడిపాను. చలిలో వస్త్రాలు లేకుండా గడిపాను. 28 ఇవే కాక, సంఘాల కొరకు నేను ప్రతిరోజూ దిగులు పడుతుంటాను. 29 మీలో ఒకడు బలహీనుడైనప్పుడు, నేనూ బలహీనుడు కాకుండా ఉండగలనా? ఒకడు పాపంలో పడితే, నేను నా అంతరంగంలో మండిపోకుండా ఉండగలనా? పాపం చెయ్యటానికి మీలో ఎవరైనా కారకుడు అయితే అతని పట్ల నాకు కోపం కలగదా?

30 నేను గర్వంగా చెప్పుకోవాలి అంటే బలహీనతను చూపే వాటిని గురించి గర్వంగా చెప్పుకొంటాను. 31 యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవునికి, సర్వదా స్తుతింపతగిన దేవునికి, నేను అసత్యం ఆడటం లేదని తెలుసు. 32 నేను డెమాస్కసులో ఉన్నప్పుడు అరెత అను రాజు పరిపాలనలో ఉన్న రాజ్యాధికారి, నన్ను బంధించాలని ఊరి చుట్టూ కాపలా ఉంచాడు. 33 కాని కొందరు నన్ను గంపలో ఉంచి గోడ మీదనుండి క్రిందికి దింపారు. నేను చిక్కకుండా తప్పించుకొని పారిపోయాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International