Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 కొరింథీయులకు 7:20-40

20 ప్రతి ఒక్కడూ, దేవుడు పిలిచినప్పుడు ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా ఉండాలి. 21 దేవుడు పిలిచినప్పుడు నీవు బానిసవా? చింతించకు. కాని నీవు స్వేచ్ఛ పొందగలిగితే అందుకు ప్రయత్నం చేయి. 22 ప్రభువు పిలిచినప్పుడు బానిసగా ఉన్నవాడు, ప్రభువులో ఐక్యత పొందటంవల్ల స్వేచ్ఛను పొందుతాడు. అదే విధంగా ప్రభువు పిలిచినప్పుడు స్వేచ్ఛగా ఉన్నవాడు ప్రభువుకు బానిస అవుతాడు. 23 మీకోసం వెల చెల్లించి దేవుడు మిమ్మల్ని కొన్నాడు. మానవులకు బానిసలు కాకండి. 24 సోదరులారా! దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరేవిధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండి దేవునితో కలిసి ఉండండి.

పెండ్లి చేసుకొనుటలో గల సమస్యలు

25 ఇక కన్యలను గురించి: ప్రభువు మీకు ఏ ఆజ్ఞ ఇవ్వలేదు. కాని దేవుని అనుగ్రహంవల్ల నేను మీకు చెపుతున్న సలహాలు నమ్మతగినవి. 26 ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల వల్ల మీరు కన్యలుగా ఉండిపోవటం మంచిది. 27 ఇక పురుషులు, మీరు వివాహితులైనట్లయితే విడాకులు ఇవ్వకండి. మీరు అవివాహితులైనట్లయితే భార్యల కోసం వెతక్కండి. 28 అలాగని మీరు వివాహం చేసుకొంటే పాపం కాదు. అదే విధంగా కన్యలు కూడా వివాహం చేసుకొంటే పాపం కాదు. కాని వివాహం చేసుకొన్నవాళ్ళు జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తారు. మీకా కష్టాలు కలుగరాదని ఇలా చెపుతున్నాను.

29 సోదరులారా! ఇక వ్యవధి లేదు. ఇక మీదటనుండి భార్యలున్నవాళ్ళు భార్యలు లేనట్లు జీవించాలి. 30 దుఃఖించేవాళ్ళు దుఃఖించనట్లు, ఆనందిస్తున్నవాళ్ళు ఆనందించనట్లు, కొనేవాళ్ళు కొన్నవి తమని కానట్లు జీవించాలి. 31 ఇప్పుడున్న ప్రపంచం నశించబోతోంది. కనుక ఈ ప్రపంచంలో జీవిస్తున్నవాళ్ళు దానిలో ఉన్న వస్తువుల పట్ల ఆశ పెంచుకోకుండా జీవించాలి.

32 మీరు చింతించరాదని నా కోరిక. “వివాహం చేసుకోనివాడు ప్రభువును ఏ విధంగా ఆనంద పరచాలా” అని, అంటే ఆత్మీయమైన విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. 33 కాని, వివాహితుడు తన భార్యను ఎలా ఆనందపరచాలని ఆలోచిస్తూ ఉంటాడు. కనుక ప్రాపంచిక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. 34 అందువల్ల అతని మనస్సు రెండు రకాలుగా పని చేస్తూ ఉంటుంది. పెళ్ళికాని స్త్రీలు, కన్యలు ప్రభువు ఆజ్ఞల్ని పాటించటంలో నిమగ్నులై ఉంటారు. తమ మనస్సును, శరీరాన్ని ప్రభువుకు అర్పించి పని చేస్తుంటారు. కాని పెళ్ళిచేసుకొన్న స్త్రీలు తమ భర్తను ఆనందపరచటానికి, ప్రాపంచిక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటారు. 35 ఇది నేను మీ మంచి కోసం చెపుతున్నాను. అనవసరమైన కట్టుబాట్లు నియమించాలని కాదు. మీరు సక్రమంగా నడుచుకోవాలని, మనస్ఫూర్తిగా మిమ్నల్ని మీరు ప్రభువుకు అర్పించుకోవాలని నా ఉద్ధేశ్యం.

36 తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకోకుండా ఉండటం అక్రమమని భావించినవాడు, లేక ఆమెకు వయస్సు పెరిగిపోవటంవల్ల పెళ్ళి చేసుకోవటం అవసరమని భావించినవాడు పెళ్ళి చేసుకోవచ్చు. ఇది పాపం కాదు. 37 కాని పెళ్ళి చేసుకోరాదని తన మనస్సులో నిశ్చయించుకొన్నవాడు, పెళ్ళి చేసుకోవాలనే నిర్బంధం లేనివాడు, తన మనస్సును అదుపులో పెట్టుకోగలవాడు కూడా పెళ్ళి మాని సరియైన పని చేస్తున్నాడు. 38 కనుక తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకొన్నవాడు మంచి పని చేస్తున్నాడు. కాని పెళ్ళి చేసుకోనివాడు ఇంకా మంచి పని చేస్తున్నాడు.

39 భర్త బ్రతికి ఉన్నంత కాలము భార్య అతనికి కట్టుబడి ఉండాలి. అతడు చనిపోతే ఆమె తనకు ఇష్టమున్నవాణ్ణి వివాహం చేసుకోవచ్చు. కాని అతడు ప్రభువు యొక్క విశ్వాసియై ఉండాలి. 40 ఆమె విధవరాలుగా ఉండిపోతే ఆనందంగా ఉంటుందని నా అభిప్రాయం. నాకును దేవుని ఆత్మ సహాయం ఉన్నదని తలస్తున్నాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International