New Testament in a Year
15 సంపూర్ణ విశ్వాసం గల మనము సంపూర్ణ విశ్వాసం లేనివాళ్ళ బలహీనతల్ని సహించాలి. మనం మన ఆనందం మాత్రమే చూసుకోకూడదు. 2 ప్రతి వ్యక్తి తన సోదరుని మేలు కోసం, అభివృద్ధి కోసం అతనికి అనుగుణంగా నడుచుకోవాలి. 3 క్రీస్తు కూడా తన ఆనందం మాత్రమే చూసుకోలేదు. దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “దేవా! నిన్ను అవమానించినవాళ్ళు నన్నూ అవమానించారు.” 4 గతంలో వ్రాసిన లేఖనాలు మనకు బోధించటానికి వ్రాశారు. వాటి ద్వారా సహనము, ప్రోత్సాహము పొంది, రక్షణ లభిస్తుందన్న నమ్మకం మనలో కలగాలని దానిలోని ఉద్దేశ్యం. 5 మనలో సహనము, ప్రోత్సాహము కలుగచేసే దేవుడు, యేసు క్రీస్తు ద్వారా మీ మధ్య ఐకమత్యము కలుగచేయునుగాక! 6 అప్పుడు మనము ఒకే హృదయంతో, ఒకే నాలుకతో మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించగలుగుతాము. 7 దేవునికి ఘనత కలగాలని క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లే మీరు కూడా ఇతర్లను అంగీకరించండి. 8 మూలపురుషులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టాలని, దేవుడు సత్యవంతుడని నిరూపించాలని, క్రీస్తు యూదుల సేవకుడు అయ్యాడు. 9 యూదులు కానివాళ్ళు దేవుని అనుగ్రహం కోసం ఆయన్ని స్తుతించాలని క్రీస్తు ఉద్దేశ్యం. ఈ సందర్భాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“ఈ కారణంగానే యూదులు కాని వాళ్ళతో కలిసి నిన్ను స్తుతిస్తాను.
నీ పేరిట భక్తి గీతాలు పాడతాను.”(A)
10 మరొక చోట:
“యూదులు కాని ప్రజలారా!
మీరు కూడా దేవుని ప్రజలతో ఆనందించండి.”(B)
11 ఇంకొక చోట ఇలా వ్రాయబడి వుంది:
“యూదులు కాని ప్రజలారా! ప్రభువును స్తుతించండి.
ఆయన్ని స్తుతిస్తూ గీతాలు పాడండి!”(C)
12 యెషయా ఒక చోట ఈ విధంగా అన్నాడు:
“యెష్షయి వంశ వృక్షం యొక్క వేరు చిగురిస్తుంది.
ఆయన దేశాలను పాలిస్తాడు.
యూదులు కానివాళ్ళు ఆయనలో నిరీక్షిస్తారు.”(D)
13 రక్షణ లభిస్తుందని నిరీక్షణ కలిగించే ఆ దేవుడు మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీకు సంపూర్ణమైన ఆనందాన్ని, శాంతిని కలుగ చేయుగాక! అప్పుడు మీలో ఉన్న నిరీక్షణ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొంగి పొర్లుతుంది.
© 1997 Bible League International