Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
అపొస్తలుల కార్యములు 20:17-38

పౌలు ఎఫెసు పెద్దలతో మాట్లాడటం

17 పౌలు కొందర్ని మిలేతునుండి ఎఫెసుకు పంపి అక్కడున్న సంఘ పెద్దల్ని పిలిపించాడు.

18 వాళ్ళు వచ్చాక వాళ్ళతో యిలా చెప్పాడు: “నేను ఆసియలో అడుగు పెట్టిన నాటినుండి మీతో ఉన్నన్ని రోజులు ఏ విధంగా జీవించానో మీకు తెలుసు. 19 యూదుల పన్నాగాలవల్ల నాకు ఎన్నో కష్టాలు, దుఃఖాలు సంభవించాయి. అయినా ప్రభువు సేవ సంపూర్ణమైన విశ్వాసంతో చేసాను. 20 ఆత్మీయ విషయాల్లో మీకు ఉపయోగమయ్యే ప్రతీ విషయాన్ని దాచకుండా, బహిరంగంగా ప్రకటించటమే కాకుండా యింటింటికీ వెళ్ళి బోధించానని మీకు తెలుసు. 21 మారుమనస్సు పొంది, దేవుని కోసం జీవించమని, మన యేసు ప్రభువును నమ్మమని యూదులకు, గ్రీకులకు చెప్పాను.

22 “పరిశుద్ధాత్మ చెప్పినట్లు చెయ్యాలనే ఉద్దేశ్యంతో నేను యెరూషలేము వెళ్తున్నాను. అక్కడేం జరుగుతుందో నాకు తెలియదు. 23 నేను కష్టాలు, కారాగారాలు ఎదుర్కొంటానని పరిశుద్ధాత్మ నన్ను ప్రతి పట్టణంలో ముందే వారించాడు. ఇది మాత్రం నాకు తెలుసు. 24 నా జీవితాన్ని నేను లెక్కచెయ్యను. కాని ఈ పరుగు పందెం ముగించి యేసు ప్రభువు చెప్పిన ఈ కార్యాన్ని పూర్తి చేస్తే చాలు. దేవుని అనుగ్రహాన్ని గురించి చెప్పే సువార్తను ప్రకటించటమే నా కర్తవ్యం.

25 “మళ్ళీ మిమ్మల్ని చూడటం వీలు పడదని నాకు తెలుసు. నేను మీతో ఉండి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాను. 26 అందువల్ల ఈ రోజు నేనిది ఖచ్చితంగా చెప్పగలను. మీలో ఎవరైనా ఆత్మీయంగా మరణిస్తే దానికి నేను బాధ్యుణ్ణి కాను. 27 ఎందుకంటే, నేను దేవుడు చెయ్యదలచినదాన్ని సంపూర్ణంగా కొంచెం కూడా సంకోచించకుండా ప్రకటించాను. 28 పరిశుద్ధాత్మ మిమ్మల్ని సంఘానికి కాపరులుగా నియమించాడు. ఆ దేవుని సంఘానికి మీరు కాపరుల్లా ఉండాలి. ఆయన తన సంఘమును తన స్వంత రక్తంతో సంపాదించాడు. మీ విషయంలో, ఈ సంఘం విషయంలో జాగ్రత్తగా ఉండండి. 29 నేను వెళ్ళిపొయ్యాక భయంకరమైన తోడేళ్ళు మీ మందలోకి వచ్చి హాని కలిగిస్తాయని నాకు తెలుసు. 30 మీలోనుండి కూడా కొందరు ముందుకు వచ్చి మీతో ఉన్న అనుచరుల్ని దొంగిలించాలని అబద్ధాలాడుతారు. 31 అందుకే జాగ్రత్తగా ఉండండి. నేను మూడు సంవత్సరాలు మీతో ఉన్నాను. కంటతడి పెట్టుకొని రాత్రింబగళ్ళు మీలో ఉన్న ప్రతి ఒక్కర్నీ వారించాను. ఈ విషయం మరిచిపోకండి.

32 “ఇప్పుడు మిమ్మల్ని దేవునికి, ఆయన అనుగ్రహాన్ని గురించి బోధించే సందేశానికి అప్పగిస్తున్నాను. ఆ సందేశంలో మిమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధి పరచగల శక్తి ఉంది. అంతే కాక అది పరిశుద్ధమైన దేవుని విశ్వాసులకు లభించిన వారసత్వం మీక్కూడా లభించేటట్లు చేస్తుంది. 33 మీనుండి నేను వెండి బంగారాలు కాని, మంచి దుస్తులు కాని ఆశించలేదు. 34 నేను నా చేతుల్తో పని చేసి, నా అవసరాలు, నాతో ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చుకొన్నానని మీకు తెలుసు. 35 కష్టించి పని చేసి దిక్కులేని వాళ్ళకు సహాయం చెయ్యటం ఉత్తమమని మీకు అన్ని విధాలా తెలియ చేసాను. యేసు ప్రభువు, ‘తీసుకోవటంలో కన్నా యివ్వటంలో చాలా దీవెన ఉంది!’ అని అన్నాడు. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవటం అవసరమని మీకు రుజువు చేసాను.”

36 ఈ విధంగా చెప్పి, అతడు మోకాళ్ళూని అందరితో కలిసి ప్రార్థించాడు. 37 ఆ తర్వాత అందరూ కంటతడి పెట్టుకొని అతనికి ప్రేమతో వీడ్కోలు యిచ్చారు. 38 “మిమ్మల్ని మళ్ళీ చూడటం వీలుపడదు” అని అతడన్న మాటలు వాళ్ళకు చాలా దుఃఖం కలిగించాయి. ఆ తదుపరి వాళ్ళతనితో ఓడవరకు వెళ్ళారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International