Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
అపొస్తలుల కార్యములు 19:21-41

పౌలు ప్రయాణానికి సిద్ధపడుట

21 ఆ సంఘటనలు జరిగాక పౌలు మాసిదోనియ, అకయ ప్రాంతాల ద్వారా యెరూషలేము వెళ్ళాలని పరిశుద్ధాత్మ సహాయంతో నిశ్చయించుకున్నాడు. అక్కడికి వెళ్ళాక రోమా నగరాన్ని తప్పక దర్శించాలనుకున్నాడు. 22 తనకు సహాయం చేసేవాళ్ళలో యిద్దర్ని మాసిదోనియకు పంపాడు. వాళ్ళ పేర్లు తిమోతి, ఎరస్తు. అతడు ఆసియ ప్రాంతంలో మరి కొంత కాలం గడిపాడు.

ఎఫెసులో అల్లర్లు

23 ఆ రోజుల్లోనే ప్రభువు చూపిన మార్గాన్ని గురించి పెద్ద గొడవ జరిగింది. 24 “దేమేత్రి” అనే ఒక కంసాలి ఉండేవాడు. ఇతడు అర్తెమి దేవత ఉండే మందిరం యొక్క ప్రతిరూపాలను వెండితో తయారు చేసి అమ్మేవాడు. తద్వారా తన క్రింద పని చేసేవాళ్ళకు చాలినంత డబ్బు సంపాదించేవాడు.

25 తన పనివాళ్ళను, తనలాంటి వృత్తి చేసేవాళ్ళను సమావేశ పరిచి ఈ విధంగా అన్నాడు: “అయ్యలారా! మనమీ వ్యాపారంలో చాలా ధనం గడిస్తున్న విషయం మీకందరికీ తెలుసు. 26 ఈ పౌలు అనేవాడు ఏం చేస్తున్నాడో మీరు చూస్తున్నారు. ఇతడిక్కడ ఎఫెసులో, సుమారు ఆసియ ప్రాంతాలన్నిటిలో మానవుడు సృష్టించిన విగ్రహాలు దేవుళ్ళు కాదంటూ చాలా మంది ప్రజల్ని నమ్మించి తప్పుదారి పట్టిస్తున్నాడన్న విషయం మీరు విన్నారు. 27 ఈ కారణంగా మన వ్యాపారానికున్న మంచి పేరు పోయే ప్రమాదం ఉంది. పైగా అర్తెమి మహాదేవి మందిరానికున్న విలువ పోతుంది. ఆసియ ప్రాంతాల్లోనే కాక ప్రపంచమంతా పూజింపబడుతున్న ఆ దేవత యొక్క గొప్పతనము కూడా నశించి పోతుంది.”

28 ఈ మాటలు విన్న వాళ్ళకు చాలా ఉద్రేకం కలిగింది. వాళ్ళు బిగ్గరగా, “ఎఫెసు ప్రజల అర్తెమి దేవత గొప్పది!” అని నినాదం చెయ్యటం మొదలు పెట్టారు. 29 ఈ అలజడి ఆ పట్టణమంతా వ్యాపించి పోయింది. మాసిదోనియకు చెందిన “గాయి, అరిస్తర్కు” అనే యిద్దరు వ్యక్తులు పౌలు వెంట ఉన్నారు. ప్రజలు వీళ్ళను బంధించి త్రోసుకొంటూ ఒక్క గుంపుగా పెద్ద నాటక శాలలోకి ప్రవేశించారు. 30 పౌలు ప్రజల ముందుకు రావాలనుకొన్నాడు. కాని అనుచరులతన్ని వెళ్ళనివ్వలేదు. 31 పౌలు స్నేహితులు కొందరు ఆ ప్రాంతాలకు పాలకులుగా ఉండేవాళ్ళు. నాటక శాలలోకి వెళ్ళవద్దని వేడుకుంటూ వీళ్ళు పౌలుకు ఒక ఉత్తరం పంపారు.

32 ఆ సభ అంతా గందరగోళంగా ఉంది. కొందరు యిదని, కొందరు అదని బిగ్గరగా కేకలు వేసారు. కొందరికి తప్ప మిగతా వాళ్ళకెవ్వరికి తామక్కడికి ఎందుకు వచ్చింది తెలియదు. 33 యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోసారు. కొందరు కేకలు వేస్తూ అతనికి ఏదో సలహా యిచ్చారు. అతడందర్నీ శాంతంగా ఉండమని సంజ్ఞ చేసి సమాధానంగా ఏదో చెప్పబోయాడు. 34 అతడు కూడా ఒక యూదుడని తెలుసుకొన్నాక వాళ్ళంతా రెండు గంటల సేపు ఒకే గొంతుతో, “ఎఫెసు ప్రజల అర్తెమి దేవత చాలా గొప్పది” అని నినాదం చేసారు.

35 ఆ గ్రామాధికారి ప్రజల్ని శాంతపరుస్తూ యిలా అన్నాడు: “ఎఫెసు ప్రజలారా! మహా దేవత అర్తెమి యొక్క మందిరాన్ని, స్వర్గంనుండి పడిన శిలా విగ్రహాన్ని చూసుకొనే బాధ్యత ఎఫెసు పట్టణంపై ఉంది. ఇది ప్రపంచానికంతా తెలుసు. 36 దీన్ని ఎవరూ కాదనలేరు. కనుక మీరు ఆలోచించకుండా తొందర పడి ఏదీ చెయ్యకండి. శాంతంగా ఉండండి!

37 “వీళ్ళు మన మందిరాన్ని దోచుకోలేదు. మన దేవతను దూషించ లేదు. అయినా మీరు వీళ్ళనిక్కడికి పట్టుకొని వచ్చారు. 38 దేమేత్రికి లేక అతనితో కలిసి పని చేసేవాళ్ళకు వాళ్ళపై నేరం మోపాలని ఉంటే న్యాయస్థానాలు తెరిచి ఉన్నాయి. వాళ్ళ వాద వివాదాలు వినటానికి న్యాయాధిపతులున్నారు.

39 “మీరింకేదైనా చెప్పుకోవాలనుకొంటే చట్ట ప్రకారం జరిగే ప్రజా సమావేశాల్లో చెప్పుకోండి. 40 ఈనాడు జరిగిన సంఘటనవల్ల మనం తిరుగుబాటు చేసామని అధికారులు మనపై నేరం మోపే ప్రమాదం వుంది. అది జరిగితే ఈ అలజడికి ఏ కారణం లేదు కనుక మనం ఏ సమాధానమూ చెప్పలేము.” 41 ఇలా చెప్పి అందర్నీ అక్కడినుండి వెళ్ళమన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International