Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
అపొస్తలుల కార్యములు 17:16-34

ఏథెన్సులో

16 పౌలు ఏథెన్సులో వాళ్ళకోసం ఎదురు చూస్తూ కొద్ది రోజులు ఆగిపొయ్యాడు. ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉండటం గమనించి అతని ఆత్మ దుఃఖించింది. 17 అందువల్ల సమాజమందిరంలో సమావేశమయ్యే యూదులతో, దైవభీతిగల యూదులుకాని ప్రజలతో, సంతకు వచ్చి పోయే ప్రజలతో ప్రతి రోజు మాట్లాడే వాడు. 18 ఎపికూరీయులు అని అనబడే కొందరు తత్వజ్ఞులు, స్తోయికులు అనబడే కొందరు తత్వజ్ఞులు అతనితో తర్కించారు.

“ఆ వదరుబోతు ఏమంటున్నాడు?” అని కొందరు అన్నారు. “ఇతర దేవుళ్ళను గురించి ప్రబోధిస్తున్నట్లుంది” అని మరి కొందరు అన్నారు. పౌలు యేసును గురించి, ఆయన బ్రతికి రావటాన్ని గురించి ప్రకటించటం వల్ల అతణ్ణి వాళ్ళిలా విమర్శించారు.

19 వాళ్ళు అతనిని పట్టుకొని అరేయొపగు సభకు పిలుచుకు వచ్చారు. “నీవు చెబుతున్న ఈ క్రొత్త బోధ ఏమిటో మేము తెలుసుకోవచ్చా?” అని కొందరు అడిగారు. 20 “నీవు చిత్రమైన విషయాలు మా చెవుల్లో వేసావు. వాటి అర్థం మాకు చెప్పు” అని మరి కొందరడిగారు. 21 ఏథెన్సు ప్రజలు, ఆ పట్టణంలో నివసించే పరదేశీయులు, తమ కాలాన్నంతా కొన్ని సిద్ధాంతాలను చెప్పటంలోనో లేక వినటంలోనో గడిపేవాళ్ళు. మరే పని చేసేవాళ్ళు కాదు.

22 పౌలు అరేయొపగు సభలో నిల్చొని, “ఏథెన్సు ప్రజలారా! మీరు అన్ని విషయాల్లో చాలా నిష్ఠగా ఉన్నారు. ఇది నేను గమనించాను. 23 నేను మీ పట్టణమంతా పర్యటించాను. మీరు పూజించే వాటిని చూసాను. అంతేకాదు సాంబ్రాణి వేసే ఒక బలిపీఠం మీద, ‘తెలియని దేవునికి’ అని వ్రాయబడి ఉండటం చూసాను. అందువల్ల మీకు తెలియకున్నా మీరు పూజించే ఆ దేవుణ్ణి గురించి ప్రకటించబోతున్నాను.

24 “ఈ ప్రపంచాన్ని, దానిలో ఉన్న ప్రతి వస్తువును సృష్టించిన దేవుడు, ఆకాశానికి, భూమికి ప్రభువైనటువంటి దేవుడు మానవులు కట్టిన మందిరాల్లో నివసించడు. 25 మానవులు దేవుని కోసం చేయగలిగిందేదీ లేదు. జీవి పీల్చుకొనే గాలిని, కావలసిన ప్రతి వస్తువును యిచ్చిన దేవునికి మానవుని సేవలు కావాలా? 26 ఆయన ఒక్క మనుష్యునితో మానవులందర్ని సృష్టించి వాళ్ళు ఈ ప్రపంచమంతా నివసించేటట్లు చేసాడు. వాళ్ళ కోసం ఒక కాలాన్ని నియమించాడు. ఏ దేశపు ప్రజలు ఎక్కడ నివసించాలో ఆ స్థలాన్ని, కాలాన్ని సరిగ్గా నియమించాడు.

27 “మానవులు తనను వెతకాలనీ, గ్రుడ్డివాడు తడిమినట్టు తడిమి తనను కనుగొనే అవకాశం వాళ్ళకు కలిగించాలనీ యిలా చేసాడు. కాని నిజానికి ఆయన ఎవ్వరికీ దూరంగా లేడు. 28 ‘మనం ఆయనలో జీవిస్తున్నాం, ఆయనలో కదులుతున్నాం, ఆయన కారణంగా మనం ఉన్నాం.’ మీలోని కొందరు కవులు చెప్పినట్లు: ‘మనం ఆయన సంతానం.’

29 “మనం దేవుని సంతానం కదా! అలాంటప్పుడు, దేవుడు బంగారంతో కాని, లేక వెండితో కాని, లేక రాతితో కాని చేయబడిన విగ్రహంలాంటివాడని మనం ఎట్లా అనగలం? ఆయన మానవుడు తన కల్పనతో, కళతో సృష్టించిన విగ్రహంలాంటివాడు కాడు. 30 గతంలో మానవుని అజ్ఞానం పట్ల ఆయన చూసీ చూడనట్లు ఉండినాడు. కాని యిప్పుడు ప్రతి ఒక్కణ్ణీ మారుమనస్సు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు. 31 ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిపై న్యాయమైన తీర్పు చెప్పనున్న రోజును నిర్ణయించాడు. ఎవని ద్వారా తీర్పు చెప్పనున్నాడో ఆయన్ని నియమించాడు. ఆయన్ని బ్రతికించి, తాను చేయనున్నదాన్ని ప్రజలందరికీ రుజువు చేసాడు.”

32 చనిపోయిన వారు యేసువలె బ్రతికి వస్తారన్న విషయం విని కొందరు అతణ్ణి హేళన చేసారు. మరి కొందరు, “ఈ విషయాన్ని గురించి మాకింకా వినాలని ఉంది” అని అన్నారు. 33 పరిస్థితులు యిలా అవటం వల్ల పౌలు ఆ సభనుండి వెళ్ళిపొయ్యాడు. 34 కొందరు విశ్వాసులై పౌలును అనుసరించారు. వాళ్ళలో అరేయొపగు అను సభకు సభ్యత్వం ఉన్న దియొనూసి అనేవాడు, దమరి అనే స్త్రీ మొదలగువాళ్ళున్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International