Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
అపొస్తలుల కార్యములు 13:1-25

బర్నబాను, సౌలును ఎన్నుకొని పంపటం

13 అంతియొకయలోని సంఘంలో ఉన్న ప్రవక్తలు, పండితులు ఎవరనగా: బర్నబా, “నీగెరు” అని పిలువబడే “సుమెయోను”, కురేనీ గ్రామానికి చెందిన లూకియ, మనయేను, (ఇతడు, సామంత రాజైన హేరోదు, యిద్దరూ కలిసి పెరిగారు), మరియు సౌలు. వీళ్ళు ఉపవాసాలు చేసి ప్రభువును ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ, “బర్నబాను, సౌలును నా కోసం వేరుచేయండి. వాళ్ళను ఒక ప్రత్యేకమైన పని కోసం పిలిచాను” అని అన్నాడు.

అక్కడున్నవాళ్ళు వీళ్ళిద్దర్ని పంపే ముందు ప్రార్థనలు, ఉపవాసాలు చేసి, వాళ్ళపై తమ చేతులుంచి పంపారు.

సైప్రసులో

పవిత్రాత్మ వాళ్ళను పంపాడు. వాళ్ళు “సెలూకయ” అనే పట్టణానికి వెళ్ళి అక్కడినుండి ఓడలో ప్రయాణం చేసి సైప్రసు (కుప్ర) అనే ద్వీపాన్ని చేరుకున్నారు. అక్కడినుండి సలామి అనే పట్టణానికి వెళ్ళారు. అక్కడున్న యూదుల సమాజ మందిరాల్లో దైవసందేశాన్ని ప్రకటించారు. వాళ్ళకు సహాయంగా యోహాను వాళ్ళ వెంటే ఉన్నాడు.

వాళ్ళు ఆ ద్వీపాన్నంతా పర్యటించి “పాఫు” అనే పట్టణం చేరుకున్నారు. మాయాజాలం చేస్తూ తానొక ప్రవక్తనని చెప్పుకుంటున్న వ్యక్తిని అక్కడ కలుసుకున్నారు. అతడు యూదుడు. పేరు “బర్‌ యేసు,” అతడు “సెర్గి పౌలు” అనే రాష్ట్రపాలకునికి సన్నిహితంగా ఉండేవాడు. సెర్గి పౌలు తెలివిగలవాడు. దైవసందేశాన్ని వినాలని బర్నబాను, సౌలును ఆహ్వానించాడు. ఎలుమ రాష్ట్రపాలకుణ్ణి ఈ విశ్వాసానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించాడు. “ఎలుమ” అనగా గ్రీకు భాషలో మాయాజాలకుడు. అప్పుడు సౌలు (ఇతణ్ణి పౌలు అని కూడా పిలిచే వారు) పరిశుద్ధాత్మతో నిండిపోయి ఎలుమను సూటిగా చూస్తూ, 10 “నీవు సాతానుకు పుట్టావు! మంచిదన్న ప్రతిదీ నీకు శత్రువు! నీలో అన్ని రకాల మోసాలు, కుట్రలు ఉన్నాయి! ప్రభువు యొక్క సక్రమ మార్గాల్ని వక్రంగా మార్చటం ఎప్పుడు మానుకొంటావు? 11 ఇదిగో చూడు, ప్రభువు ఇప్పుడు నిన్ను శిక్షిస్తాడు. కొంతకాలం దాకా నీవు సూర్యుని వెలుగు చూడలేవు! గ్రుడ్డివాడివై పోతావు!” అని అన్నాడు.

తక్షణమే పొగమంచు, చీకట్లు అతణ్ణి చుట్టివేసాయి. తన చేయి పట్టుకొని నడిపేందుకు ఎవరైనా దొరుకుతారేమోనని తారాడుతూ చూసాడు. 12 ఆ రాష్ట్రపాలకుడు ప్రభువును గురించి చెప్పిన బోధలు విని ఆశ్చర్యపడి ప్రభువును నమ్మాడు.

పిసిదియ అంతియొకయలో

13 “పాఫు” నుండి పౌలు, అతని స్నేహితులు పంఫూలియాలోని “పెర్గే” అనే పట్టణానికి ఓడలో ప్రయాణం చేసి వెళ్ళారు. యోహాను వాళ్ళను అక్కడ వదిలి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయాడు. 14 వాళ్ళు పెర్గేనుండి పిసిదియ ప్రక్కన ఉన్న అంతియొకయ అనే పట్టణాన్ని చేరుకున్నారు.

ఒక విశ్రాంతి రోజు యూదుల సమాజ మందిరములోకి వెళ్ళి కూర్చున్నారు. 15 ధర్మశాస్త్రంలోని విషయాలు, ప్రవక్తల గ్రంథాలు చదివారు. ఆ తదుపరి సమాజమందిరం యొక్క అధికారులు, “సోదరులారా! ప్రజలను ఉత్సాహపరిచే ఆధ్యాత్మిక విషయాలు ఏవైనా ఉంటే దయచేసి మాట్లాడండి” అని అడగనంపారు.

16 పౌలు లేచి నిలుచొని చేతులెత్తి, ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజలారా! యూదులవలె దైవభీతిగల ప్రజలారా! నా మాటలు వినండి. 17 ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పూర్వులను ఎన్నుకొని వాళ్ళు ఈజిప్టులో పరదేశీయులుగా ఉన్నప్పుడు వాళ్ళను గొప్పవాళ్ళుగా చేసాడు. తన అద్భుతమైన శక్తితో ఆ దేశంనుండి వాళ్ళను పిలుచుకెళ్ళి, 18 ఎడారుల్లో వాళ్ళ ప్రవర్తనను నలభై సంవత్సరాలు సహిస్తూ వాళ్ళను కాపాడాడు. 19 కనాను దేశంలో ఏడు జాతుల్ని పడగొట్టి తన ప్రజల్ని ఆ ప్రాంతానికి వారసులుగా చేసాడు. 20 ఇవి చేయటానికి సుమారు నాలుగు వందల ఏబది సంవత్సరాలు పట్టింది.

“ఆ తర్వాత దేవుడు సమూయేలు ప్రవక్త కాలందాకా, నాయకత్వం వహించగల న్యాయాధిపతుల్ని పంపాడు. 21 తమకు ‘రాజు’ కావాలని కోరగా కీషు కుమారుడైన ‘సౌలును’ వాళ్ళకు రాజుగా పంపాడు. ఇతడు బెన్యామీను వంశానికి చెందినవాడు. సౌలు నలభై సంవత్సరాలు పాలించాడు. 22 సౌలును తీసివేసాక దావీదును వాళ్ళ రాజుగా చేసాడు. దావీదు విషయంలో తన అంగీకారం చూపుతూ దేవుడు యిలా అన్నాడు: ‘యెష్షయి కుమారుడైన దావీదు నా మనస్సుకు నచ్చాడు. అతడు నేను చెప్పినట్లు చేస్తాడు.’

23 “దేవుడు తన వాగ్దానానుసారం ఇశ్రాయేలు ప్రజల కోసం రక్షకుడైనటువంటి యేసును ఇతని వంశంలో జన్మింపచేసాడు. 24 యేసు రాకముందు, యోహాను మారుమనస్సును గురించి బాప్తిస్మమును గురించి ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. 25 తన కర్తవ్యం ముగిసే చివరి దశలో అతడు ఇలా అన్నాడు: ‘నేనెవర్ననుకొన్నారు? నేను మీరనుకొంటున్న వాణ్ణి కాదు! కాని నా తర్వాత ఆయన రాబోతున్నాడు. ఆయన చెప్పులు తాకే అర్హత కూడా నాకు లేదు.’

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International