Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
అపొస్తలుల కార్యములు 10:24-48

24 ఆ మరుసటి రోజు వాళ్ళు కైసరియకు చేరుకొన్నారు. వీళ్ళు రానున్నారని తెలిసి కొర్నేలీ సన్నిహితులైన బంధువుల్ని తన యింటికి ఆహ్వానించాడు.

25 పేతురు యింట్లోకి అడుగు పెడ్తుండగానే కొర్నేలీ అతనికి ఎదురు వెళ్ళి అతని కాళ్ళ ముందు సాష్టాంగపడి నమస్కరించాడు. 26 పేతురు అతనిని లేపుతూ, “లెమ్ము! నేను కూడా ఒక మనిషినే” అని అన్నాడు. 27 పేతురు అతనితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళాడు. అక్కడ చాలా మంది ప్రజలు సమావేశమై ఉండటం చూసాడు.

28 పేతురు వాళ్ళతో, “యూదుడు, యూదుడు కానివానితో కలిసి ఉండరాదనీ, అతని యింటికి వెళ్ళరాదనీ యూదుల న్యాయశాస్త్రం అంటుంది. ఇది తప్పని మీకందరికి తెలుసు. కాని ‘ఏ వ్యక్తినీ అధమంగా భావించరాదు. పరిశుభ్రత లేనివాడని అనకూడదు’ అని నాకు దేవుడు తెలియజేసాడు. 29 కాబట్టి నా కోసం పిలవనంపగానే వచ్చాను. నన్నెందుకు పిలిచారో నేను యిప్పుడు కారణం అడగవచ్చా?” అని అన్నాడు.

30 కొర్నేలీ యిలా చెప్పాడు: “నాలుగు రోజుల క్రితం యిదే సమయంలో యింట్లో కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అప్పుడు పగలు మూడు గంటలు. అకస్మాత్తుగా తెల్లటి మెరిసే దుస్తులు వేసుకొని ఒక వ్యక్తి నా ముందు ప్రత్యక్షమయ్యాడు. 31 అతడు నాతో, ‘కొర్నేలీ! దేవుడు నీ ప్రార్థనల్ని విన్నాడు. నీవు పేదలకు చేస్తున్న దానాలను గుర్తించాడు. 32 పేతురు అని పిలువబడే సీమోన్ను పిలుచుకు రావటానికి కొందర్ని యొప్పేకు పంపు. అతడిప్పుడు సీమోను అనే చెప్పులు కుట్టేవాని యింట్లో అతిథిగా ఉన్నాడు. ఈ చెప్పులు కుట్టేవాని యిల్లు సముద్ర తీరాన ఉంది’ అని చెప్పాడు. 33 మిమ్మల్ని పిలుచుకు రావటానికి తక్షణం మనుష్యుల్ని పంపాను. మీరొచ్చి మంచి పని చేసారు. ఇప్పుడు మనమంతా దేవుని ముందున్నాము. మాకు చెప్పుమని ప్రభువు మీకాజ్ఞాపించినవన్నీ వినటానికి సిద్ధంగా ఉన్నాము.”

పేతురు వాక్యోపదేశం

34-35 పేతురు ఇలా చెప్పటం మొదలు పెట్టాడు: “దేవుడు పక్షపాతం చూపడని, తానంటే భయభక్తులున్న వాళ్ళను, నిజాయితీ పరుల్ని వాళ్ళు ఏ దేశస్థులైనా అంగీకరిస్తాడని యిప్పుడు నాకు బాగా తెలిసింది. 36 ఈ సందేశాన్ని దేవుడు ఇశ్రాయేలు వంశీయులకు అందించాడు. దేవుడు మనకందరికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా శాంతి లభిస్తుందనే శుభవార్తను ప్రకటించాడు.

37 “యోహాను బోధించిన బాప్తిస్మమును ప్రజలు పొందాక గలిలయలో ఒక సంగతి ప్రారంభమైంది. ఆ సంగతిని గురించిన ప్రకటనలు యూదయ ప్రాంతం అంతా వ్యాపించాయి. ఇది మీకంతా తెలుసు. 38 నజరేతు నివాసి యేసును దేవుడు పవిత్రాత్మతో అభిషేకించాడు. అద్భుతమైన శక్తి యిచ్చాడు. దేవుడు ఆయనతో ఉండటం వల్ల యేసు ప్రజలకు మేలు చేస్తూ అన్ని ప్రాంతాలు పర్యటించాడు. సాతాను పీడవలన బాధపడ్తున్న వాళ్ళకు నయం చేసాడు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు.

39 “యెరూషలేము, యూదయ దేశంలో ఉన్న మిగతా ప్రాంతాల్లో ఆయన చేసిన ప్రతి పనిని మేము కళ్ళారా చూసాము. వాళ్ళు ఆయన్ని మ్రానుతో చేసిన సిలువకు మేకులు కొట్టి చంపారు. 40 కాని మూడవ రోజున దేవుడు ఆయన్ని బ్రతికించాడు. ఆయన ప్రజలకు కనిపించాలని దేవుని ఉద్దేశ్యం. 41 అందరూ ఆయన్ని చూడలేదు. ఇదివరకే దేవుడు ఎన్నుకొన్న కొందరు మాత్రం చూసారు. మేమే ఆ సాక్షులం. ఆయన బ్రతికి వచ్చాక మేమంతా ఆయనతో కలిసి భోజనం చేసాం.

42 “ఆయన అందరికి న్యాయాధిపతి. అంటే బ్రతికి ఉన్నవాళ్ళకు, పునర్జీవం పొందనున్న వాళ్ళకు. ఈ పదవిని దేవుడు ఆయనకిచ్చాడు. దీన్ని గురించి ప్రజల ముందు సాక్ష్యం చెప్పమని, సువార్తను ప్రకటించమని ఆయన మాకు ఆజ్ఞాపించాడు. 43 యేసును నమ్మినవాళ్ళు తమ పాపాలకు ఆయన ద్వారా క్షమాపణ పొందుతారని ప్రవక్తలందరు చెప్పారు.”

దేవుడందర్ని అంగీకరిస్తాడని చూపించాడు

44 పేతురు యింకా మాట్లాడుతుండగానే అతని సందేశాన్ని వింటున్న అక్కడివాళ్ళందరి మీదికి పరిశుద్ధాత్మ వచ్చాడు. 45 పేతురుతో వచ్చిన వాళ్ళందరు యూదులు. 46 యేసునందు విశ్వసించినవారు. వీళ్ళు యూదులు కానివాళ్ళు యితర భాషల్లో మాట్లాడటం, దేవుణ్ణి స్తుతించటం చూసారు. దేవుడు తన పరిశుద్ధాత్మను వరంగా యూదులు కానివాళ్ళకు కూడా యిచ్చాడని గ్రహించి వాళ్ళకు ఆశ్చర్యం వేసింది. తదుపరి పేతురు యిలా అన్నాడు: 47 “వీళ్ళకు బాప్తిస్మము నివ్వటానికి అడ్డు చేప్పే ధైర్యం ఎవరికుంది? మనలాగే వీళ్ళు కూడా దేవుని పరిశుద్ధాత్మ పొందారు.” 48 యేసు పేరిట వాళ్ళు బాప్తిస్మం పొందాలని పేతురు ఆజ్ఞాపించాడు. ఇదంతా ముగిసాక వాళ్ళు పేతురును తమతో కొద్దిరోజులు ఉండమని అడిగారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International