New Testament in a Year
22 ఈజిప్టు దేశస్థుల జ్ఞానాన్నంతా అతనికి నేర్పించింది. మోషే గొప్ప విషయాలు చెప్పటంలో గొప్ప పనులు చేయటంలో ఆరితేరినవాడయ్యాడు.
23 “మోషేకు నలభై సంవత్సరాలు రాగానే అతడు తన తోటి ఇశ్రాయేలు ప్రజల్ని కలుసుకొన్నాడు. 24 ఒకసారి, మోషే ఈజిప్టు దేశస్థుడు ఇశ్రాయేలు వానితో అన్యాయంగా ప్రవర్తించటం చూసి ఇశ్రాయేలువానికి సహాయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో, అతణ్ణి రక్షించటానికి వెళ్ళాడు. ఈజిప్టు దేశస్థుణ్ణి చంపి ఇశ్రాయేలు వాని పక్షాన పగ తీర్చుకున్నాడు. 25 ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించటానికి దేవుడు తనను ఉపయోగిస్తున్న విషయం వాళ్ళు తెలుసుకొంటారని మోషే ఆశించాడు. కాని వాళ్ళకది అర్థం కాలేదు.
26 “మరుసటి రోజు మోషే యిద్దరు ఇశ్రాయేలీయులు పోట్లాడటం చూసి, వాళ్ళను శాంత పరచాలనే ఉద్దేశ్యంతో, ‘అయ్యా! మీరు సోదరులు! పరస్పరం ఎందుకు పోట్లాడుతున్నారు?’ అని అడిగాడు. 27 ఏ ఇశ్రాయేలు వాడు తోటివాడికి అన్యాయం చేశాడో వాడు, మోషేను ప్రక్కకు త్రోసి, ‘మా మీద తీర్పు చెప్పటానికి, మమ్మల్ని పాలించటానికి నిన్నెవరు నియమించారు? 28 ఈజిప్టు దేశస్థుణ్ణి నిన్న చంపినట్లు నన్ను కూడా చంపాలని చూస్తున్నావా?’ అని అన్నాడు. 29 ఈ విమర్శ విని మోషే ఈజిప్టు దేశాన్ని వదిలి, మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ పరదేశీయునిగా స్థిరపడ్డాడు. అక్కడ అతనికి యిద్దరు కుమారులు కలిగారు.
30 “నలభై సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు సీనాయి పర్వతంపై మండుతున్న పొదలో మోషేకు ఒక దేవదూత కనిపించాడు. 31 ఆ దృశ్యాన్ని చూసి మోషే దిగ్భ్రాంతి చెందాడు. దగ్గరనుండి చూడాలనుకొని ముందుకు వెళ్తుండగా అతనికి ప్రభువు స్వరం వినిపించింది. 32 ఆ స్వరం అతనితో ‘నేను మీ పూర్వుల దేవుణ్ణి! అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి!’(A) అని అన్నాడు. మోషే వణికిపోయాడు. తలెత్తి చూడటానికి అతనికి ధైర్యం చాలలేదు.
33 “ప్రభువు, ‘చెప్పులు తీసెయ్యి! నీవు నిలుచున్న స్థలం పవిత్రమైనది. 34 నా ప్రజల్ని ఈజిప్టులో అణచి ఉంచటం చూసాను. వాళ్ళ ఏడుపులు విన్నాను. వాళ్ళకు విముక్తి కలిగించటానికి వచ్చాను. రా! నిన్ను తిరిగి ఈజిప్టు పంపుతాను!’”(B) అని అన్నాడు.
35 స్తెఫను ఇంకా ఇలా చెప్పాడు: “‘నిన్ను పాలకునిగా, న్యాయాధిపతిగా చేసిందెవరు?’ అని వాళ్ళచే తిరస్కరించబడినవాడే ఈ మోషే. ఈ మోషేను దేవుడు వాళ్ళ పాలకునిగా, రక్షకునిగా పంపినట్లు పొదలో కనిపించిన దేవదూత ద్వారా తెలియచేసాడు. 36 మోషే అద్భుతాలు, మహత్యాలు చేసి వాళ్ళను ఈజిప్టునుండి వెలుపలికి పిలుచుకు వచ్చాడు. ఎఱ్ఱ సముద్రం దగ్గర, ఆ తర్వాత నలభై సంవత్సరాలు ఎడారుల్లో కూడా అద్భుతాలు, మహత్యాలు చేసాడు.
37 “‘నాలాంటి ప్రవక్తను దేవుడు మీనుండి ఎన్నుకొని మీకందిస్తాడు’ అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మోషే ఇతడే! 38 ఇశ్రాయేలు ప్రజలందరూ ఎడారిలో సమావేశమైనప్పుడు, అక్కడున్న మన పూర్వికులతో కలిసి ఉన్నవాడు మోషేనే. సీనాయి పర్వతంపై దేవదూతతో మాట్లాడింది మోషేనే. మనకు అందివ్వటానికి సజీవమైన దైవసందేశాన్ని పొందింది మోషేనే.
39 “కాని మన పూర్వికులు అతని మాటలు వినలేదు. పైగా అతణ్ణి తిరస్కరించి ఈజిప్టు దేశానికి తిరిగి వెళ్ళాలనుకొన్నారు. 40 అందువల్ల అహరోనుతో, ‘మాకు దారి చూపించగల దేవుళ్ళ విగ్రహాలను సిద్ధం చేయించు. మమ్మల్ని ఈజిప్టునుండి పిలుచుకు వచ్చిన ఆ మోషేకు ఏమైందో ఏమో!’(C) అని అన్నారు. 41 వెంటనే అందరూ కలిసి దూడ రూపంలో ఒక విగ్రహాన్ని సిద్ధం చేసారు. ఆ విగ్రహానికి బలి అర్పించారు. తమ చేతుల్తో తయారు చేసిన ఆ విగ్రహం పేరిట పండుగ చేసుకొన్నారు. 42 కాని దేవుడు విరక్తి చెంది, ‘ఆకాశంలోని మీ దేవుళ్ళను మీరు పూజించుకొండి’ అని అన్నాడు. దీన్ని గురించి ప్రవక్తల గ్రంథంలో యిలా వ్రాయబడి వుంది:
‘ఓ ఇశ్రాయేలు ప్రజలారా! ఎడారుల్లో నలభై సంవత్సరాలు పశువుల్ని బలి యిచ్చింది నా కోసం కాదు!
43 మీరు మీ వెంట మోసుకు వెళ్ళింది, మొలొకు యొక్క డేరా!
మీరు మోసుకు వెళ్ళింది మీరు దేవుడనుకొంటున్న రొంఫా నక్షత్రం యొక్క విగ్రహాన్ని!
దాన్ని మీరు పూజించుకోవటానికి సృష్టించుకున్నారు.
కనుక మిమ్మల్ని బబులోను నగరానికి దూరంగా పంపుతాను!’(D)
© 1997 Bible League International