New Testament in a Year
స్తెఫను ఉపన్యాసం
7 ఆ తర్వాత ప్రధాన యాజకుడు, “ఈ నేరారోపణలు నిజమా?” అని అతణ్ణి అడిగాడు. 2 అతడు సమాధానంగా, “అయ్యలారా! సోదరులారా! నేను చెప్పేది వినండి. అది మన తండ్రి అబ్రాహాము ‘మెసొపొతమియలో’ నివసిస్తున్న కాలం. అంటే, అతడు అప్పటికి యింకా తన నివాసాన్ని ‘హారాను’ పట్టణానికి మార్చలేదన్న మాట. 3 అక్కడ అతనికి తేజస్వి అయిన దేవుడు కనిపించి, ‘నీ దేశాన్ని, ప్రజల్ని వదిలి నేను చూపబోయే దేశానికి వెళ్ళు’ అని అన్నాడు.
4 “అందువల్ల అతడు కల్దీయుల దేశాన్ని వదిలి హారానులో స్థిరపడ్డాడు. అతని తండ్రి చనిపోయాక ఆ దేశాన్ని కూడా వదలమని, మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశంలో దేవుడతణ్ణి స్థిరపర్చాడు. 5 దేవుడతనికి ఈ దేశంలో ఒక్క అడుగు భూమి కూడా ఆస్తిగా యివ్వలేదు. అతనికి అప్పుడు సంతానం లేకపోయినా, అతనికి, అతని తర్వాత రానున్న వాళ్ళకు ఆ దేశం ఆస్తిగా ఉంటుందని వాగ్దానం చేసాడు.
6 “దేవుడతనితో, ‘నీ వారసులు పరదేశంలో నివసిస్తారు. ఆ పరదేశీయులు నీ వాళ్ళను నాలుగు వందల సంవత్సరాలు తమ బానిసలుగా ఉంచుకొని వాళ్ళను కష్టపెడతారు. 7 వాళ్ళను బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను. ఆ తర్వాత నీ ప్రజలు ఆ దేశం వదిలి నన్ను యిక్కడ ఆరాధిస్తారు’ అని అన్నాడు.
8 “సున్నతి నియమాన్ని పాటిస్తే తన వాగ్దానాన్ని నిలుపుకొంటానని దేవుడు అబ్రాహాముతో ఒక ఒప్పందం చేసాడు. ఇస్సాకు పుట్టిన ఎనిమిదవ రోజున అబ్రాహాము అతనికి సున్నతి చేయించాడు. అదే విధంగా ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు సున్నతి చేయించాడు. యాకోబు తన పన్నెండుమంది కుమారులకు సున్నతి చేయించాడు. ఈ పన్నెండు మంది పండ్రెండు వంశాలకు మూల పురుషులయ్యారు.
9 “వీళ్ళకు, తమలో ఒకడైన యోసేపు మీద ఈర్ష్య ఉండేది. అందువల్ల వాళ్ళతణ్ణి ఈజిప్టు దేశానికి బానిసగా అమ్మేసారు. కాని దేవుడతనికి అండగా ఉండి, 10 అతణ్ణి కష్టాలనుండి రక్షించాడు. అతనికి జ్ఞానాన్ని యిచ్చాడు. ఆ జ్ఞానంతో అతడు ఈజిప్టు రాజైన ‘ఫరో’ అభిమానాన్ని సంపాదించాడు. ఫరో అతణ్ణి ఈజిప్టు దేశానికి పాలకునిగా, తన రాజభవనాలకు అధికారిగా నియమించాడు. 11 ఇంతలో ఈజిప్టు, కనాను దేశాల్లో కరువు రాగా ప్రజలు చాలా కష్టాలనుభవించారు. మన పూర్వికులకు తినటానికి తిండి కూడా లేకుండింది.
12 “ఈజిప్టు దేశంలో ధాన్యం ఉందని తెలియగానే యాకోబు మన పూర్వికుల్ని మొదటి సారిగా అక్కడకు పంపాడు. 13 రెండవసారి వచ్చినప్పుడు, యోసేపు తానెవ్వరన్న విషయం తన సోదరులకు చెప్పాడు. యోసేపు కుటుంబాన్ని గురించి ఫరోకు తెలిసిపోయింది. 14 ఆ తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును, డెభ్బై ఐదు మందిగల తన కుటుంబాన్ని పిలవనంపాడు. 15 యాకోబు ఈజిప్టు దేశానికి వచ్చాక, అతడు, మన పూర్వికులు అందరూ చనిపోయారు. 16 వాళ్ళ దేహాలు షెకెము పట్టణానికి తేబడ్డాయి. అబ్రాహాము యిదివరలో హమోరు వంశం వాళ్ళకు డబ్బిచ్చి వాళ్ళనుండి ఒక స్మశాన భూమిని కొని ఉంచాడు. వాళ్ళు అక్కడ సమాధి చేయబడ్డారు.
17 “దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం ఫలించే సమయం దగ్గరకు వచ్చింది. ఈజిప్టులో మన వాళ్ళ సంఖ్య బహుగా పెరిగింది. 18 కొంత కాలం తర్వాత యోసేపును గురించి ఏమీ తెలియనివాడు ఈజిప్టు దేశానికి పాలకుడయ్యాడు. 19 అతడు మన వాళ్ళను మోసం చేసాడు. మన వాళ్ళ సంతానం చనిపోవాలని, వాళ్ళకు పుట్టిన పసికందుల్ని బయట వేయించి వాళ్ళ పట్ల క్రూరంగా ప్రవర్తించాడు.
20 “ఆ కాలంలోనే మోషే జన్మించాడు. ఇతడు సామాన్యుడు కాడు. మోషే మూడు నెలల దాకా తన తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. 21 ఇతణ్ణి యింటి బయట ఉంచగానే ఫరో కుమార్తె తీసుకెళ్ళి తన స్వంత కుమారునిగా పెంచుకుంది.
© 1997 Bible League International