New Testament in a Year
22-23 భటులు కారాగారానికి వచ్చారు. కాని వాళ్ళకు అపొస్తలులు కనపడలేదు. వాళ్ళు తిరిగి వెళ్ళి, “మేము కారాగారపు ద్వారాలు భద్రంగా తాళం వేయబడి ఉండటం చూసాము. ద్వారపాలకులు ద్వారాల దగ్గర ఉండటం చూసాము. కాని ద్వారాలు తెరిచి చూస్తే అపొస్తలులు లేరు” అని చెప్పారు. 24 ఈ సంగతి విని మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, ప్రధాన యాజకులు వాళ్ళు ఏమై ఉంటారా? అని ఆశ్చర్యపడ్డారు.
25 ఇంతలో ఒకడు వచ్చి, “మీరు కారాగారంలో ఉంచినవాళ్ళు మందిరం యొక్క ఆవరణంలో నిలబడి ప్రజలకు బోధిస్తున్నారు” అని చెప్పాడు. 26 ఇది విని ద్వారపాలకుల అధిపతి భటులను వెంట తీసుకొని వాళ్ళను పట్టుకు రావటానికి వెళ్ళాడు. ప్రజలు తమను రాళ్ళతో కొడతారనే భయం వాళ్ళలో ఉంది. కనుక అపొస్తలులపై వాళ్ళు ఏ దౌర్జన్యం చేయలేదు.
27 అపొస్తలుల్ని పిలుచుకు వచ్చి మహాసభ ముందు నిలుచోబెట్టారు. ప్రధాన యాజకుడు విచారణ చేస్తూ, 28 “మీ యేసు పేరిట బోధించవద్దని మేము యిది వరకే ఖచ్చితంగా ఆజ్ఞాపించాము. అయినా యెరూషలేమంతా మీ బోధలతో నింపివేసారు. అంతేకాక అతని మరణాన్ని మాపై మోపాలని చూస్తున్నారు” అని అన్నాడు.
29 పేతురు, మిగతా అపొస్తలులు యిలా అన్నారు: “మేము దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్నాము, మానవుల ఆజ్ఞల్ని కాదు. 30 మీరు సిలువకు వ్రేలాడదీసి చంపిన యేసును మా పూర్వికుల దేవుడు బ్రతికించాడు. 31 దేవుడు ఆయనకు తన కుడి వైపుననున్న స్థానాన్నిచ్చాడు. ఆయన్ని ఒక అధిపతిగా, రక్షకుడిగా నియమించాడు. తద్వారా ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపం పొందే అవకాశము, తమ పాపాలకు క్షమాపణ పొందే అవకాశము కలగాలని ఆయన ఉద్దేశ్యం. 32 వీటికి మేము సాక్షులము. దేవుడు తన ఆజ్ఞల్ని పాటించిన వాళ్ళకిచ్చిన పవిత్రాత్మ కూడా దీనికి సాక్షి.”
33 ఇది విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు అపొస్తలులను చంపాలనుకున్నారు. 34 కాని “గమలీయేలు” అనే పరిసయ్యుడు ఆ మహాసభలో లేచి నిలుచొని అపొస్తలుల్ని కొంతసేపు అవతలకు తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. గమలీయేలు ధర్మశాస్త్ర పండితుడు. ప్రజల గౌరవం పొందినవాడు. 35 అతడు వాళ్ళని సంబోధిస్తూ, “ఇశ్రాయేలు ప్రజలారా! వీళ్ళను ఏమి చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించండి! 36 ఇదివరలో థూదా కనిపించి తానొక గొప్పవాణ్ణని చెప్పుకున్నాడు. సుమారు నాలుగువందలమంది అతణ్ణి అనుసరించారు. అతడు చంపబడ్డాడు. ఆ తర్వాత అతని అనుచరులు చెదిరిపోయారు. చివరకు ఏమీ మిగల్లేదు. 37 అతని తర్వాత జనాభా లెక్కల కాలంలో యూదా అనే వాడు వచ్చి ప్రజల్ని చేరదీసి తిరుగుబాటు చేసాడు. ఇతడు గలిలయవాడు. ఇతడు కూడా చంపబడ్డాడు. అతని అనుచరులందరూ చెదిరిపోయారు. 38 అందువల్ల వాళ్ళ విషయంలో నా సలహా ఇది: వాళ్ళ విషయం పట్టించుకోకండి! వాళ్ళను వదిలివేయండి! వాళ్ళ కార్యము, వాళ్ళ ఉద్దేశ్యము మానవుడు సృష్టించినదైతే అది నశిస్తుంది. 39 అలా కాకుండా అది దైవేచ్ఛ వలన అయితే మీరు వాళ్ళను ఆపలేరు. అలా చేస్తే మీరు దేవునికి ఎదురు తిరిగిన వాళ్ళౌతారు” అని అన్నాడు.
40 సభ్యులు అతడు చెప్పినట్లు విన్నారు. అపొస్తలుల్ని పిలిపించి కొరడా దెబ్బలు కొట్టించారు. ఆ తర్వాత, యేసు పేరిట మాట్లాడవద్దని వారించి వదిలి వేసారు. 41 అపొస్తలులు యేసు కోసం అవమానింపబడటానికి తాము అర్హులైనందుకు సంతోషిస్తూ మహాసభనుండి వెళ్ళిపోయారు. 42 ప్రతి రోజూ మందిరంలో, ఇంటింటా “యేసే క్రీస్తు” అని ప్రకటించారు. ఈ సువార్త ప్రకటించటం మానుకోలేదు.
© 1997 Bible League International