New Testament in a Year
అననీయ మరియు సప్పీరా
5 “అననీయ” అనబడే ఒక వ్యక్తి, అతని భార్య “సప్పీరా” కలిసి తమ భూమి అమ్మేసారు. 2 “అననీయ” తన కొరకు కొంత డబ్బు దాచుకొన్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలుసు. “అననీయ” మిగతా డబ్బు తెచ్చి అపొస్తలుల కాళ్ళ ముందుంచాడు.
3 అప్పుడు పేతురు ఈ విధంగా అన్నాడు: “అననీయా, నీ మనస్సులో సాతాను ఎందుకు చేరాడు? భూమి అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని దాచి పవిత్రాత్మను ఎందుకు మోసం చేసావు? 4 అది అమ్మక ముందు కూడా నీదే కదా! అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఇలా చెయ్యటానికి నీకెట్లా బుద్ధి పుట్టింది? నీవు మనుష్యులతో కాదు అబద్ధం ఆడింది, దేవునితో.”
5 ఈ మాటలు విని అననీయ క్రింద పడి ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనని విన్నవాళ్ళందరికీ ఒక పెద్ద భయం పట్టుకుంది. 6 కొందరు యువకులు ముందుకొచ్చి అననీయ దేహాన్ని ఒక వస్త్రంలో చుట్టి మోసుకెళ్ళి సమాధి చేసారు.
7 మూడు గంటల తర్వాత అననీయ భార్య అక్కడికి వచ్చింది. అక్కడ జరిగిందేదీ ఆమెకు తెలియదు. 8 పేతురు, “మీరు భూమి అమ్మగా లభించిన డబ్బు యింతేనా? చెప్పు!” అని ఆమెను అడిగాడు.
“ఔను! అంతే డబ్బు లభించింది” అని ఆమె సమాధానం చెప్పింది.
9 పేతురు ఆమెతో, “నీవు, నీ భర్త కలిసి ప్రభువు ఆత్మను పరీక్షించాలని ఎందుకు నిశ్చయించుకున్నారు? ఆ తలుపు దగ్గరనుండి వస్తున్న అడుగుల చప్పుడు విను! అవి నీ భర్తను సమాధి చేసినవాళ్ళవి. వాళ్ళు నిన్ను కూడా మోసుకు వెళ్తారు” అని అన్నాడు. 10 తక్షణమే ఆమె అతని పాదాలముందు పడి ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయి ఉండటం చూసి ఆమెను కూడా మోసుకు వెళ్ళి ఆమె భర్త ప్రక్కన సమాధి చేసారు. 11 సంఘానికి, ఈ సంఘటనలు విన్నవాళ్ళకు పెద్ద భయం పట్టుకుంది.
అనేకులను నయం చేయటం
12 అపొస్తలులు, విశ్వాసులు ఉమ్మడిగా సొలొమోను మండపంలో సమావేశమౌతూ ఉండేవాళ్ళు. వీళ్ళు ప్రజల్లో ఎన్నో అద్భుతాలు, మహత్యాలు చేసారు. 13 ప్రజలు అపొస్తలుల్ని పొగుడుతూ ఉన్నప్పటికీ మిగతావాళ్ళు వాళ్ళతో చేరడానికి తెగించలేదు. 14 చాలా మంది స్త్రీలు, పురుషులు ప్రభువును విశ్వసించారు. ప్రభువు వాళ్ళను సంఘంలో చేర్చాడు. 15 ఇవి చూసిన ప్రజలు జబ్బుతో ఉన్నవాళ్ళను దారి మీదికి తెచ్చి పరుపుల మీద చాపల మీద పడుకోబెట్టారు. పేతురు ఆ దారి మీదుగా నడిచినప్పుడు అతని నీడ కొందరి మీదనన్నా పడుతుందని వాళ్ళ ఉద్దేశ్యం. 16 ప్రజలు యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతాలనుండి గుంపులు గుంపులుగా వచ్చారు. తమలో జబ్బుతో ఉన్నవాళ్ళను, దయ్యాలు పట్టి బాధపడ్తున్నవాళ్ళను తీసుకు వచ్చారు. వాళ్ళందరికీ నయమైపోయింది.
అపొస్తలులు హింసించబడటం
17 సద్దూకయ్యుల తెగకు చెందిన ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్ళు అసూయతో నిండిపోయారు. 18 వాళ్ళు అపొస్తలులను బంధించి కారాగారంలో వేసారు. 19 కాని రాత్రివేళ దేవదూత కారాగారపు తలుపులు తీసి వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చాడు. 20 వాళ్ళతో, “వెళ్ళి మందిర ఆవరణంలో నిలుచొని ఈ క్రొత్త జీవితాన్ని గురించి విశదంగా ప్రజలకు చెప్పండి” అని చెప్పాడు. 21 దేవదూత చెప్పినట్లు విని వాళ్ళు తెల్లవారుతుండగా మందిరం యొక్క ఆవరణంలో ప్రవేశించి ప్రజలకు బోధించటం మొదలు పెట్టారు.
ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్ళు ఇశ్రాయేలు ప్రజల పెద్దలందర్ని సమావేశపరిచి మహాసభను ఏర్పాటు చేసారు. ఆ తర్వాత అపొస్తలులను పిలుచుకు రమ్మని కొందర్ని కారాగారానికి పంపారు.
© 1997 Bible League International