New Testament in a Year
విశ్వాసుల ప్రార్థన
23 విడుదలయ్యాక పేతురు, యోహాను తమ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రధానయాజకులు, పెద్దలు చెప్పినదంతా చెప్పారు. 24 ఇది విన్నాక వాళ్ళంతా కలిసి ఒకే ధ్యేయంతో దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు: “మహా ప్రభూ! నీవు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సకల వస్తువుల్ని సృష్టించావు. 25 నీవు పవిత్రాత్మ ద్వారా నీ సేవకుడు, మా తండ్రి అయిన దావీదు నోటినుండి యిలా పలికించావు:
‘జనాంగములు ఎందుకు రెచ్చుతున్నాయి?
ప్రజలెందుకు వృథాగా పన్నాగాలు పన్నుతున్నారు?
26 ‘రాజులు, పాలకులు కలిసి ప్రభువును,
ఆయన క్రీస్తును ఎందుకు ఎదిరిస్తున్నారు?’(A)
27 హేరోదు మరియు పొంతి పిలాతు ఇశ్రాయేలు ప్రజలతో మరియు యితర దేశ ప్రజలతో కలిసారు. అంతా కలిసి పవిత్రతగల నీ సేవుకుణ్ణి, నీవు క్రీస్తుగా నియమించిన యేసును నిజంగానే ఎదిరించారు. 28 ఏది జరగాలో నీ శక్తి సంకల్పానుసారం నీవు ముందే నిర్ణయించావు. వాళ్ళు నీవు నిర్ణయించినట్లే చేసారు. 29 ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని భయపెడ్తున్నారు, చూడు ప్రభూ! నీ సందేశాన్ని ధైర్యంగా చెప్పే శక్తిని నీ సేవకులకు యివ్వు! 30 యేసు పవిత్రమైనవాడు, నీ సేవకుడు. ఆయన పేరిట రోగుల్ని నయం చెయ్యటానికి, అద్భుతాలు, మహత్యాలు చెయ్యటానికి నీ అభయ హస్తాన్ని చాపి మాకు శక్తినివ్వు!”
31 వాళ్ళ ప్రార్థన ముగిసాక వాళ్ళు సమావేశమైన స్థలం కంపించింది. అందరిలో పవిత్రాత్మ నింపుదల కలిగింది. వాళ్ళు దైవసందేశాన్ని ధైర్యంగా చెప్పటం మొదలు పెట్టారు.
విశ్వాసుల ఐకమత్యం
32 విశ్వాసుల మనస్సు, ఆత్మ ఒకే విధంగా ఉండేవి. ఎవ్వరూ “ఇది నాది” అని అనకుండా తమకున్న వాటిని ఇతర్లతో పంచుకొనేవాళ్ళు. 33 దైవికమైన శక్తితో అపొస్తలులు ప్రభువు బ్రతికి వచ్చాడని రుజువు చేసారు. దేవుని అనుగ్రహం వాళ్ళందరిపై సంపూర్ణంగా ఉంది. 34 వాళ్ళలో ఎవ్వరికీ ఏ కొరతలు ఉండేవి కావు. ఇండ్లు, పొలాలు ఉన్నవాళ్ళు వాటిని అమ్మి, 35 ఆ డబ్బును అపొస్తలుల పాదాల ముందుంచేవాళ్ళు. ఆ అపొస్తలులు అవసరమున్న ప్రతి ఒక్కనికి ఆ డబ్బును పంచేవాళ్ళు.
36 యోసేపు అనే అతడు లేవి వంశీయుడు. ఇతడు సైప్రసు (కుప్ర) ద్వీపానికి చెందినవాడు. ఇతణ్ణి అపొస్తలులు బర్నబా (ప్రోత్సాహపు కుమారుడని ఈ పదానికి అర్థం) అని పిలిచేవాళ్ళు. 37 ఇతడు తన పొలాన్ని అమ్మి ఆ డబ్బు తెచ్చి అపొస్తలుల పాదాల ముందుంచాడు.
© 1997 Bible League International