New Testament in a Year
పవిత్రాత్మ రావటం
2 పెంతెకొస్తు అనే పండుగ వచ్చింది. ఆ రోజు వాళ్ళంతా ఒక చోట సమావేశం అయ్యారు. 2 తీవ్రమైన గాలి వీచినప్పుడు కలిగే ధ్వనిలాంటిది పరలోకంనుండి అకస్మాత్తుగా వచ్చి వాళ్ళు కూర్చొన్న యింటినంతా నింపివేసింది. 3 అప్పుడు వాళ్ళకు నాలుకల్లా అగ్నిజ్వాలలు కనిపించాయి. అవి విడిపోయి ప్రతి ఒక్కరి మీదా దిగినవి. 4 అందరూ పవిత్రాత్మతో నిండిపోయి తమ భాషల్లో కాక యితర భాషల్లో మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళిలా మాట్లాడటానికి పవిత్రాత్మ శక్తినిచ్చాడు.
5 అప్పుడు ఈ యెరూషలేము పట్టణంలో అన్ని దేశాలకు చెందిన దైవభక్తిగల యూదులు ఉండినారు. 6 ఆ మాటల శబ్దం విని ఒక పెద్ద ప్రజల గుంపు అక్కడికి వచ్చింది. గుంపులోని ప్రతి ఒక్కడూ తన స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం విని దిగ్భ్రాంతి చెందాడు.
7 వాళ్ళు దిగ్భ్రాంతి చెంది, “మాట్లాడుతున్న వాళ్ళందరూ గలిలయ ప్రాంతపు వాళ్ళే కదా? 8 అలాంటప్పుడు, మాలోని ప్రతి ఒక్కడూ, అతని స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం ఎట్లా వింటున్నాడు? 9 మేము, అంటే ‘పార్తీయ’ దేశంవాళ్ళు, ‘మాదీయ’ దేశంవాళ్ళు, ‘ఏలామీ’ దేశంవాళ్ళు, ‘మెసొపొతమియ’ నివాసులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియ నివాసులు, 10 ఫ్రుగియ, పంఫులియ, ఈజిప్టు ప్రాంతాలవాళ్ళు, ‘లిబియ’లోని ‘కురేనే’ దగ్గరున్న ప్రాంతాలనుండి వచ్చినవాళ్ళు, రోమా నగరంనుండి వచ్చినవాళ్ళు, 11 యూదులు, యూద మతంలో చేరినవాళ్ళు, క్రేతీయులు, అరబీయులు, వాళ్ళు దేవుని మహిమల్ని గురించి మా స్వంత భాషలో చెప్పటం వింటున్నామే!” అని అన్నారు.
12 దిగ్భ్రాంతి చెందటం వల్ల, జరిగిన విషయాలు అర్థం కాకపోవటం వల్ల, “దీని అర్థమేమిటి” అని పరస్పరం ప్రశ్నించుకొన్నారు. 13 “బాగా మద్యం త్రాగి మత్తులో ఉన్నారు” అని కొందరు వాళ్ళనెగతాళి చేసారు.
పేతురు ఉపన్యసించటం
14 ఇది విని పేతురు పదకొండుగురితో లేచి, పెద్ద గొంతుతో ప్రజల్ని సంబోధిస్తూ, “తోటి యూదా సోదరులారా! యెరూషలేంలో నివసిస్తున్న సమస్త ప్రజలారా! నన్ను దీన్ని గురించి మీకు చెప్పనివ్వండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. 15 మీరనుకొన్నట్లు వీళ్ళు త్రాగలేదు. ఇప్పుడు ఇంకా ఉదయం తొమ్మిది గంటలే కదా! 16 దీన్ని గురించి ప్రవక్త యోవేలు ఈ విధంగా వ్రాసాడు కనుక యివి జరుగుతున్నాయి:
17 ‘దేవుడు ఈ విధంగా అంటున్నాడు:
ఈ చివరి దినాల్లో నా ఆత్మను అందరిపై కురిపిస్తాను!
మీ కుమారులు, కుమార్తెలు నా ప్రవచనాలు పలుకుతారు!
మీ యువతరం దివ్యదర్శనాలు చూస్తుంది.
వయస్సు మళ్ళిన మీవాళ్ళు కలలుగంటారు.
18 ఆడా, మగా అనే భేదం లేకుండా నా సేవకులందరిపై ఆ దినాల్లో నా ఆత్మను కురిపిస్తాను.
అప్పుడు వాళ్ళు నా ప్రవచనాలు చెబుతారు.
19 పైన ఆకాశంలో నేను అద్భుతాలు చూపిస్తాను.
క్రింద భూమ్మీద రుజువులు చూపిస్తాను.
రక్తం, మంటలు, చిక్కటి పొగలు చెలరేగుతాయి.
20 సూర్యుణ్ణి చీకటిగా మారుస్తాను.
చంద్రుణ్ణి ఎర్రటి రక్తంలా మారుస్తాను.
ఉత్కృష్టమైనటువంటి, తేజోవంతమైనటువంటి ప్రభువు యొక్క దినం రాక ముందే యిది జరుగుతుంది.
21 అప్పుడు ఆయన నామంలో ప్రార్థించు ప్రతి ఒక్కణ్ణి ప్రభువు రక్షిస్తాడు.’(A)
© 1997 Bible League International