Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యోహాను 12:1-26

యేసు బేతనియలో తన స్నేహితులతో

(మత్తయి 26:6-13; మార్కు 14:3-9)

12 పస్కా పండుగకు ఆరు రోజుల ముందే యేసు బేతనియ చేరుకున్నాడు. యేసు బ్రతికించిన లాజరు యింతకు పూర్వం ఆ గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. అక్కడ యేసు గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేయబడింది. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో సహా కూర్చున్న వాళ్ళలో లాజరు ఒకడు. మరియ జటామాంసి చెట్టుతో చేయబడిన ఒక సేరున్నర విలువైన మంచి అత్తరు యేసు పాదాల మీద పోసి, తన తల వెంట్రుకలతో పాదాలను తుడుచింది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది.

4-5 యూదా ఇస్కరియోతు యేసు శిష్యుల్లో ఒక్కడు. యేసుకు ద్రోహం చెయ్యబోయేవాడు వీడే. యూదా, “ఈ అత్తరు అమ్మి, ఆ డబ్బు పేద వాళ్ళ కెందుకివ్వలేదు. ఆ అత్తరు వెల మూడువందల దేనారా లన్నా ఉంటుంది కదా!” అని అన్నాడు. యూదాకు పేద వాళ్ళపై కనికరం ఉండుటవలన యిలా అనలేదు. వీడు దొంగ. డబ్బు సంచి తన దగ్గర ఉండటంవల్ల దానిలోవున్న డబ్బు దొంగలించే వాడు.

యేసు, “ఆమె ఈ అత్తరుతో నన్ను సమాధికి సిద్ధం చెయ్యటానికి ఈనాటి దాకా దాన్ని దాచి ఉంచింది. మీతో పేదవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను” అని అన్నాడు.

లాజరుకు విరోధముగా కుట్ర

ఇంతలో పెద్ద యూదుల గుంపు ఒకటి యేసు అక్కడవున్నాడని విని అక్కడికి వచ్చింది. ఆయన కోసమే కాకుండా ఆయన బ్రతికించిన లాజరును కూడా చూడటానికి వచ్చారు. 10-11 తద్వారా ప్రధాన యాజకులు లాజరును కూడా చంపాలని పన్నాగం పన్నారు. ఎందుకంటే యితని కారణంగానే చాలామంది యూదులు యేసు దగ్గరకు వెళ్ళి ఆయన యందు నమ్మకం ఉంచారు.

యేసు యెరూషలేము ప్రవేశించటం

(మత్తయి 21:1-11; మార్కు 11:1-11; లూకా 19:28-40)

12 మరుసటి రోజు పండుగ కోసం వచ్చిన గుంపు ఒకటి యేసు యెరూషలేంలోకి వస్తున్నాడని విన్నది. 13 వాళ్ళు ఖర్జూరపు మట్టల్ని పట్టుకొని,

“హోసన్నా![a]
    ప్రభూవు పేరిట వచ్చిన ఇశ్రాయేలు రాజు ధన్యుడు!”(A)

అని కేకలు వేస్తూ ఆయన్ని కలవటానికి వచ్చారు.

14 యేసు ఒక గాడిద పిల్లను కనుగొని దానిపై కూర్చున్నాడు. ఈ సందర్భాన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:

15 “సీయోను కుమారీ, భయపడకు!
    గాడిద పిల్లపై కూర్చొని
నీ రాజు వస్తున్నాడు చూడు!”(B)

16 ఇవి ఆయన శిష్యులకు అప్పుడు అర్థంకాలేదు. కాని యేసు మహిమ పొందిన తర్వాత ప్రవక్తలు ఆయన్ని గురించి వ్రాశారని గుర్తించారు. అంతేగాక తాము చేసిన వాటిని గురించి అర్థం చేసుకొన్నారు.

17 యేసు లాజరును సమాధినుండి లేచి రమ్మని పిలవటము, అతణ్ణి బ్రతికించటము చూసిన ప్రజలు ఆవార్త ప్రచారం చేసారు. 18 చాలా మంది ఆయన ఈ అద్భుతాన్ని చేసాడని విన్నందువలన ఆయన్ని కలుసు కోవటానికి వెళ్ళారు. 19 అందువలన పరిసయ్యులు పరస్పరం, “చూడండి! మనం గెలవటం లేదు. ప్రపంచమంతా అతని వెంట ఎట్లా వెళ్తున్నారో చూడండి!” అని మాట్లాడుకున్నారు.

జీవము, మరణముల గురించి యేసు మాట్లాడటం

20 పండుగ రోజు ఆరాధన చెయ్యటానికి వెళ్ళిన వాళ్ళల్లో గ్రీకులు కూడా ఉన్నారు. 21 వాళ్ళు ఫిలిప్పును కలుసుకొని, “అయ్యా! మేము యేసును చూడటానికి వచ్చాము” అని అన్నారు. ఫిలిప్పు, గలిలయలోని బేత్సయిదా అనే గ్రామానికి చెందిన వాడు. 22 ఫిలిప్పు వెళ్ళి అంద్రెయతో చెప్పాడు. వీళ్ళిద్దరూ వెళ్ళి యేసుతో చెప్పారు.

23 యేసు ఇలా అన్నాడు: “మనుష్యకుమారుడు మహిమపొందు గడియ దగ్గరకు వచ్చింది. 24 ఇది నిజం. గోధుమ విత్తనం భూమ్మీద పడి చనిపోకపోతే అది ఒకటిగానే ఉంటుంది. అది చనిపోతే ఎన్నో విత్తనాల్ని ఉత్పత్తి చేస్తుంది. 25 తన ప్రాణాన్ని ప్రేమించే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని ఈ ప్రాపంచిక జీవితాన్ని ఏవగించుకొన్నవాడు తన ప్రాణాన్ని కాపాడు కొంటాడు. పైగా అనంతజీవితం పొందుతాడు. 26 నా సేవ చేయదలచిన వాడు నన్ను అనుసరించాలి. నేను ఎక్కడ ఉంటే నా సేవకుడు అక్కడ ఉంటాడు. నా సేవ చేసేవాణ్ణి నా తండ్రి గౌరవిస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International