New Testament in a Year
లాజరు మరణము
11 బేతనియ గ్రామానికి చెందిన లాజరుకు జబ్బు చేసింది. మరియ, ఆమె సోదరి మార్త కూడా ఆ గ్రామంలో ఉండే వాళ్ళు. 2 ఒకప్పుడు ప్రభువు పాదాల మీద అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచింది ఈ మరియయే! జబ్బుతో ఉండిన లాజరు మరియ సోదరుడు. 3 ఈ స్త్రీలు, “ప్రభూ! మీరు ప్రేమిస్తున్న లాజరు జబ్బుతో ఉన్నాడు” అన్న వార్త యేసుకు పంపారు.
4 యేసు, విని, “ఈ జబ్బు చంపటానికి రాలేదు. దేవుని కుమారునికి మహిమ కలుగచేసి తద్వారా దేవుని మహిమను ప్రకటించటానికి వచ్చింది” అని అన్నాడు. 5 యేసుకు మార్త పట్ల, ఆమె సోదరి పట్ల, లాజరు పట్ల ప్రేమ ఉంది. 6 లాజరు జబ్బుతో ఉన్నాడని యేసు విన్నాడు. అక్కడ రెండురోజులు ఉండి, 7 ఆ తర్వాత తన శిష్యులతో, “మనమంతా యూదయకు తిరిగి వెళ్దాం” అని అన్నాడు.
8 వాళ్ళు, “కాని రబ్బీ! యింతకు ముందే యూదులు మిమ్మల్ని రాళ్ళతో కొట్టాలని ప్రయత్నించారు. అయినా మీరు తిరిగి అక్కడికి వెళ్తున్నారా?” అని అడిగారు.
9 యేసు, “దినానికి పన్నెండు గంటలు వెలుతురుంటుంది. పగటి వేళ నడిచేవాడు ప్రపంచం యొక్క వెలుగు చూస్తుంటాడు. కనుక క్రిందపడడు. 10 రాత్రి వేళ నడిచే వానిలో వెలుగు ఉండదు. కనుక క్రిందపడతాడు” అని అన్నాడు.
11 ఈ విషయాలు చెప్పాక యేసు యింకా ఈ విధంగా అన్నాడు: “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతణ్ణి నిద్రనుండి లేపటానికి నేను అక్కడికి వెళ్తున్నాను.”
12 ఆయన శిష్యులు, “ప్రభూ! నిద్ర పోతే ఆరోగ్యంగా ఉంటాడు” అని అన్నారు. 13 యేసు మాట్లాడింది అతని చావును గురించి. కాని ఆయన శిష్యులు ఆయన సహజమైన నిద్రను గురించి మాట్లాడుతున్నాడనుకున్నారు.
14 అప్పుడు యేసు స్పష్టంగా, “లాజరు చనిపోయాడు. 15 నేనక్కడ లేనిది మంచిదైంది. మీ కోసమే అలా జరిగింది. మీరు నమ్మాలని నా ఉద్దేశ్యం. ఇప్పుడు అక్కడికి వెళ్దాం” అని అన్నాడు.
16 దిదుమ అని పిలువబడే తోమా, మిగతా శిష్యులతో, “యేసుతో కలిసి చనిపోవటానికి మనం కూడా ఆయన వెంట వెళ్దాం” అని అన్నాడు.
లాజరు కుటుంబాన్ని ఓదార్చుట
17 యేసు అక్కడికి చేరుకున్నాడు. నాలుగు రోజుల ముందే లాజరు సమాధి చేయబడ్డాడని ఆయనకు తెలిసింది. 18 బేతనియ, యెరూషలేమునకు సుమారు రెండు మైళ్ళ దూరంలో ఉంటుంది. 19 చాలా మంది యూదులు మార్తను, మరియను వాళ్ళ సోదరుడు చనిపోయినందుకు ఓదార్చటానికి వచ్చారు.
20 యేసు వస్తున్నాడని విని మార్త ఆయన్ని కలుసుకోవటానికి వెళ్ళింది. కాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది. 21 మార్త యేసుతో, “ప్రభూ! మీరిక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయే వాడు కాదు. 22 కాని, యిప్పటికైనా మీరడిగితే దేవుడు మీరడిగింది యిస్తాడని నాకు తెలుసు” అని అన్నది.
23 యేసు ఆమెతో, “మీ సోదరుడు మళ్ళీ బ్రతికివస్తాడు” అని అన్నాడు.
24 మార్త, “చివరి రోజున అనగా అందరూ బ్రతికి వచ్చే రోజున అతడూ బ్రతికి వస్తాడని నాకు తెలుసు” అని సమాధానం చెప్పింది.
25 యేసు, “బ్రతికించే వాణ్ణి, బ్రతుకును నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా జీవిస్తాడు. 26 జీవిస్తున్నవాడు నన్ను విశ్వసిస్తే ఎన్నటికి మరణించడు. ఇది నీవు నమ్ముతున్నావా?” అని అడిగాడు.
27 ఆమె, “నమ్ముతున్నాను ప్రభూ! మీరు క్రీస్తు అని, ఈ ప్రపంచంలోకి వచ్చిన దేవుని కుమారుడవని నమ్ముతున్నాను” అని అన్నది.
యేసు యేడవటం
28 ఈ విధంగా అన్న తర్వాత యింటికి వెళ్ళి తన సోదరి మరియను ప్రక్కకు పిలిచి, ఆమెతో, “బోధకుడు వచ్చాడు. నీ కొరకు అడుగుతున్నాడు” అని అన్నది. 29 మరియ యిది విని వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్ళింది.
© 1997 Bible League International