New Testament in a Year
24 యూదులు గ్రుడ్డివానిగా ఉన్నవాణ్ణి రెండవసారి పిలువనంపారు. అతనితో, “దేవుణ్ణి స్తుతించు, అతణ్ణి కాదు. అతడు పాపాత్ముడని తెలుసు!” అని అన్నారు.
25 “ఆయన పాపాత్ముడో, కాదో నాకు తెలియదు. నాకు ఒకటి తెలుసు. నేనిదివరలో గ్రుడ్డి వాణ్ణి. ఇప్పుడు చూడగలుగుతున్నాను” అని అతడు సమాధానం చెప్పాడు.
26 “అతడు ఏమి చేసాడు? ఏ విధంగా నీకు దృష్టి కలిగించాడు?” అని వాళ్ళు అడిగారు.
27 అతుడు, “నేను యిది వరకే చెప్పాను. కాని మీరు వినలేదు. మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కావాలని అనుకుంటున్నారా?” అని అన్నాడు.
28 వాళ్ళు అతణ్ణి అవమానపరచారు. అతనితో, “నువ్వు అతని శిష్యుడివి. మేము మోషే శిష్యులము. 29 దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు. ఇక ఇతని గురించా? ఇతడెక్కడినుండి వచ్చాడో కూడా మాకు తెలియదు” అని అన్నారు.
30 అతడు, “ఇది చాలా విచిత్రం. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో కూడా మీకు తెలియదు. అయినా ఆయన నాకు దృష్టి కలిగించాడు. 31 దేవుడు పాపాత్ముల మాటలు వినడని, తన ఆజ్ఞలను పాటిస్తున్న విశ్వాసుల మాటలు వింటాడని మాకు తెలుసు. 32 పుట్టు గ్రుడ్డివానికి కళ్ళు తెప్పించటం ఇది వరకు ఎవ్వరూ వినలేదు. 33 ఇతడు దేవుని నుండి రానట్లైతే ఏమి చెయ్యలేకపొయ్యేవాడు” అని అన్నాడు.
34 ఇది విని వాళ్ళు, “నీవు పాపంలో పుట్టావు. పాపంలో పెరిగావు. మాకు ఉపదేశించటానికి నీకెంత ధైర్యం?” అని అంటూ అతణ్ణి వెలివేశారు.
ఆత్మీయ అంధత్వము
35 అతణ్ణి వెలివేశారని యేసు విన్నాడు. యేసు అతణ్ణి కనుగొని, “నీవు మనుష్యకుమారుణ్ణి నమ్ముచున్నావా?” అని అడిగాడు.
36 ఆ వ్యక్తి, “ఆయనెవరో చెప్పండి ప్రభూ! విశ్వసిస్తాను!” అని అన్నాడు.
37 యేసు, “నీవు ఆయన్ని చూస్తున్నావు. నీతో మాట్లాడుతున్నవాడాయనే!” అని అన్నాడు.
38 అతడు, “ప్రభూ! నేను నమ్ముతున్నాను!” అని అంటూ ఆయన ముందు మోకరిల్లాడు.
39 యేసు, “నేను తీర్పు చెప్పటానికి ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఆ తీర్పేదనగా-గ్రుడ్దివాళ్ళు చూడగలగాలనీ, చూడగలమని అంటున్న వాళ్ళు గ్రుడ్డివాళ్ళు కావాలని నేను వచ్చాను” అని అన్నాడు.
40 ఆయనతో ఉండి ఆయనన్న మాటలు విన్న కొందరు పరిసయ్యులు, “మేము కూడా గ్రుడ్డివాళ్ళ మంటున్నావా?” అని అన్నారు.
41 యేసు, “మీరు గ్రుడ్డి వాళ్ళైనట్లైతే మిమ్ములను దోషులుగా పరిగణించవలసిన అవసరం ఉండదు. కాని మీరు చూడగలము అంటున్నారు. కనుక మిమ్మల్ని దోషులనవలిసిందే!” అని అన్నాడు.
© 1997 Bible League International