Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యోహాను 7:28-53

28 అప్పుడు యేసు మందిరంలో ఇంకను మాట్లాడుతూ ఉండినాడు. ఆయన బిగ్గరగా, “ఔను! నేనెవరినో మీకు తెలుసు. నేను స్వతహాగా యిక్కడికి రాలేదు నన్ను పంపించినవాడు సత్యవంతుడు. ఆయనెవరో మీకు తెలియదు. 29 కాని ఆయన నన్ను పంపాడు కాబట్టి ఆయన దగ్గర నుండి నేను యిక్కడికీ వచ్చాను. కాబట్టి ఆయనెవరో నాకు తెలుసు” అని అన్నాడు.

30 ఇది విని వాళ్ళు ఆయన్ని బంధించాలని ప్రయత్నించారు. కాని ఆయన సమయం యింకా రాలేదు కనుక ఆయన మీద ఎవ్వరూ చేయి వేయలేదు. 31 అక్కడున్న వాళ్ళలో చాలా మంది ఆయన్ని విశ్వసించారు. వాళ్ళు, “క్రీస్తు వచ్చినప్పుడు ఈయన కన్నా గొప్ప అద్భుతాలు చేస్తాడా?” అని అన్నారు.

యూదా నాయకులు యేసును బంధించుటకు ప్రయత్నించటం

32 ప్రజలు ఆయన్ని గురించి యిలా మాట్లాడు కోవటం పరిసయ్యులు విన్నారు. వాళ్ళు, ప్రధాన యాజకులు కలిసి ఆయన్ని బంధించటానికి భటుల్ని పంపారు. 33 కనుక యేసు ప్రజలతో, “నేను మీతో కొద్దికాలమే ఉంటాను. ఆ తర్వాత నన్ను పంపిన వాని దగ్గరకు వెళ్తాను. 34 నా కోసం మీరు వెతుకుతారు. కాని నన్ను కనుక్కోలేరు. నేనున్న చోటికి మీరు రాలేరు” అని అన్నాడు.

35 యూదులు తమలో తాము, “మనం కనుక్కోకుండా ఉండేటట్లు ఇతడు ఎక్కడికి వెళ్ళదలిచాడు? గ్రీకుల మధ్య నివసిస్తున్న మనవాళ్ళ దగ్గరకు వెళ్ళి గ్రీకులకు బోధిస్తాడా? 36 ‘నా కోసం వెతుకుతారు, కాని కనుక్కోలేరు. నేనున్న చోటికి మీరు రాలేరు’ అని అతడు అనటంలో అర్థమేమిటి?” అని మాట్లాడుకున్నారు.

యేసు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడటం

37 పండుగ చివరి రోజు చాలా ముఖ్యమైనది. ఆ రోజు యేసు నిలుచుని పెద్ద గొంతుతో, “దాహం వేసినవాడు నా దగ్గరకు రావచ్చు. వచ్చి తన దాహం తీర్చుకోవచ్చు. 38 లేఖనాలు చెప్పినట్లు, నన్ను నమ్మిన వాని లోపలి నుండి జీవపు ఊటలు ప్రవహిస్తాయి” అని అన్నాడు. 39 అంటే, తనను నమ్మిన వాళ్ళకు ముందుగా లభించబోయే ఆత్మను గురించి ఈ మాటలు చెప్పాడు. ఆయన మహిమ పర్చబడలేదు. కనుక దేవుడు యింత వరకు ఆత్మను ఎవ్వరికీ యివ్వలేదు.

ప్రజలు యేసును గురించి వాదించటం

40 ఆయన మాటలు విన్నాక కొందరు, “ఈయన తప్పక ప్రవక్త అయివుండాలి” అని అన్నారు.

41 మరికొందరు, “ఈయన క్రీస్తు అయ్యి ఉండాలి” అని అన్నారు.

కాని యితర్లు, “క్రీస్తు గలిలయనుండి ఎట్లావస్తాడు? 42 ఆయన దావీడు వంశంనుండి, దావీదు నివసించిన బేత్లెహేమునుండి వస్తాడని లెఖానాల్లో వ్రాసారు కదా!” అని అన్నారు. 43 యేసును బట్టి అక్కడున్న ప్రజలలో భేధాభిప్రాయం కలిగింది. 44 కనుక ఆయన్ని బంధించాలనుకున్నారు. కాని ఎవ్వరూ ఆయన పై చెయ్యి వెయ్యలేదు.

యూదుల నాయకులు విశ్వసించకపోవటం

45 చివరకు భటులు ప్రధానయాజకుల దగ్గరకు, పరిసయ్యుల దగ్గరకు తిరిగి వెళ్ళిపొయ్యారు. వాళ్ళు ఆ భటుల్ని, “అతణ్ణెందుకు పిలుచుకొని రాలేదు?” అని అడిగారు.

46 వాళ్ళు, “అతడు మాట్లాడినట్లు ఇంత వరకు ఎవ్వరూ మాట్లాడలేదు!” అని అన్నారు.

47 పరిసయ్యులు, “అంటే! మిమ్మల్ని కూడా అతడు మోసం చేసాడా? 48 పాలకుల్లో కాని, పరిసయ్యుల్లో కాని అతణ్ణి నమ్మిన వాళ్ళెవ్వరూ లేరు. 49 ధర్మశాస్త్రాన్ని గురించి ఏమీ తెలియని ఆ ప్రజల మీద దేవుని శాపం ఉందన్నట్లే!” అని అన్నారు.

50 నీకొదేము వాళ్ళలో ఒకడు. ఇతడు ఇదివరలో యేసు దగ్గరకు వెళ్ళి వచ్చాడు. 51 అతడు, “మన ధర్మశాస్త్రం విచారణ చేయకుండా, అతని వాదన వినకుండా, అతడు చేసింది తేలుసుకోకుండా శిక్షవిధిస్తుందా?” అని అడిగాడు.

52 వాళ్ళు, “నీవు కూడా గలిలయవాడవా? ధర్మశాస్త్రాన్ని చదువు. ప్రవక్త గలిలయనుండి రాడని నీకే తెలుస్తుంది” అని సమాధానం చెప్పారు.

వ్యభిచరించిన స్త్రీ

53 [a] ఆ తర్వాత అందరూ తమ తమ ఇళ్ళకు వెళ్ళి పొయ్యారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International