New Testament in a Year
యేసు మరియు ఆయన సోదరులు
7 ఇది జరిగిన తర్వాత, యేసు గలిలయలో మాత్రమే పర్యటన చేసాడు. యూదులు ఆయన ప్రాణం తీయాలనుకోవటం వలన ఆయన కావాలనే యూదయలో పర్యటన చెయ్యలేదు. 2 యూదుల పర్ణశాలల పండుగ దగ్గరకు వచ్చింది. 3 యేసు సోదరులు యేసుతో, “నీవీ ప్రాంతం వదిలి యూదయకు వెళ్ళు. అలా చేస్తే నీ శిష్యులు నీవు చేసే కార్యాల్ని చూడగలుగుతారు. 4 నీవు ఈ కార్యాల్ని చేస్తున్నావు. కనుక నీవు ప్రజలముందుకు రావాలి. ఎందుకంటే, ప్రజానాయకుడు కాదలచినవాడు రహస్యంగా కార్యంచేయడు” అని అన్నారు. 5 అంటే ఆయన సోదరులు కూడా ఆయన్ని నమ్మలేదన్నమాట!
6 యేసు వాళ్ళతో, “నాకింకా సమయం రాలేదు. మీకు ఏ సమయమైనా మంచిదే. 7 ప్రపంచం మిమ్మల్ని ద్వేషించదు. కాని నేను దాని పనులు దుర్మార్గములని అంటాను. కనుక అది నన్ను ద్వేషిస్తున్నది. 8 మీరు పండుగకు వెళ్ళండి. నాకు తగిన సమయం యింకా రాలేదు కనుక నేను యిప్పుడు రాను” అని అన్నాడు. 9 ఇలాగు అన్న తర్వాత యేసు గలిలయులోనే ఉండి పోయాడు.
10 ఆయన సోదరులు వెళ్ళాక ఆయన కూడా పండుగకు వెళ్ళాడు. కాని బహిరంగంగా కాదు. రహస్యంగా. 11 అక్కడ పండుగ జరుగే స్థలంలో యూదులు, “అతడెక్కడున్నాడు?” అని అంటూ ఆయన కోసం వెదకసాగారు.
12 ప్రజలు ఆయన్ని గురించి రహస్యంగా మాట్లాడటం మొదలు పెట్టారు. కొందరు ఆయన మంచివాడన్నారు. మరి కొందరు, “కాదు, అతడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు!” అని అన్నారు. 13 యూదులకు భయపడి ఆయన్ని గురించి బహిరంగంగా ఎవ్వడూ ఏమీ అనలేదు.
యేసు పండుగ సమయంలో బోధించటం
14 పండుగ సగం కాకముందే యేసు మందిరంలోకి వెళ్ళి బోధించటం మొదలుపెట్టాడు. 15 యూదులు ఆశ్చర్యపడి, “చదవకుండా యితడు యింత జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించాడు” అని అన్నారు.
16 యేసు, “నేను బోధించేవి నావి కావు. అవి నన్ను పంపిన దేవునివి. 17 దైవేచ్చానుసారం జీవించ దలచిన వానికి నా బోధనలు దేవునివా లేక నేను స్వయంగా నా అధికారంతో మాట్లాడుతున్నానా అన్న విషయం తెలుస్తుంది. 18 స్వతహాగా మాట్లాడేవాడు గౌరవం సంపాదించాలని చూస్తాడు. కాని తనను పంపిన వాని గౌరవం కోసం మాట్లాడేవాడే నిజమైనవాడు. అలాంటి వాడు అసత్యమాడడు. 19 మోషే మీకు ధర్మశాస్త్రాన్ని అందించాడు కదా! అయినా మీలో ఒక్కడు కూడా దాన్ని పాటించలేదు. నన్ను చంపటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు” అని అన్నాడు.
20 “నీకేమన్నా దయ్యం పట్టిందా? నిన్ను చంపటానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు?” అని ప్రజలు అన్నారు.
21 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నేను ఒక మహత్కార్యాన్ని చేసాను. దానికే మీరింత ఆశ్చర్యపడిపోయారు. 22 మోషే మీకు సున్నతి[a] చేయించుకోమని చెప్పాడు. నిజానికి యిది మోషే నుండి కాదు కాని పితరులనుండి ప్రారంభమైనది. 23 కనుక అవసరమైతే మీరు విశ్రాంతి రోజున సున్నతి చేస్తే తప్పుకాదు కాని, నేను ఒక మనిషి దేహాన్ని సంపూర్ణంగా నయంచేసినందుకు మీకు కోపం వస్తోంది? 24 పైన చూసి తీర్పు చెప్పటం మానుకోండి. న్యాయంగా తీర్పు చెప్పండి.”
యేసు, “క్రీస్తా”?
25 అదే క్షణాన కొందరు యెరూషలేము ప్రజలు ఈ విధంగా అనటం మొదలుపెట్టారు: “వాళ్ళు చంపాలని ప్రయత్నిస్తున్నది ఈయనే కదా! 26 ఆయనిక్కడ బహిరంగంగా మాట్లాడుతున్నా వాళ్ళు ఆయన్ని ఒక్క మాట కూడా అనటం లేదే! అధికారులు కూడా ఈయన నిజంగా క్రీస్తు అని తలంచారా ఏమి? 27 కాని క్రీస్తు వచ్చేటప్పుడు ఎక్కడనుండి వస్తాడో ఎవ్వరికీ తెలియదు. మరి ఈయనెక్కడి నుండి వచ్చాడో మనకందరికి తెలుసు!”
© 1997 Bible League International