New Testament in a Year
యేసు నికోదేముకు బోధించటం
3 నీకోదేము అనే పరిసయ్యుడు యూదుల నాయకునిగా ఉండేవాడు. 2 అతడు ఒకనాటి రాత్రి యేసు దగ్గరకు వెళ్ళి, “రబ్బీ! నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడవని మాకు తెలుసు. నీవు చేస్తున్న అద్భుతాలు దేవుని అండ లేకుండా ఎవ్వరూ చెయ్యలేరు” అని అన్నాడు.
3 యేసు జవాబు చెబుతూ, “ఇది సత్యం. క్రొత్తగా జన్మిస్తే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు” అని స్పష్టంగా చెప్పాడు.
4 నికోదేము, “కాని ఒక వ్యక్తి వృద్ధుడయ్యాక తిరిగి ఏవిధంగా జన్మిస్తాడు? మళ్ళీ జన్మించటానికి తల్లిగర్భంలోకి రెండవ సారి ప్రవేశించలేము కదా!” అని అడిగాడు.
5 యేసు జవాబు చెబుతూ, “ఇది సత్యం. నీళ్ళద్వారా, పవిత్రాత్మద్వారా, జన్మిస్తే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. 6 మానవుడు భౌతికంగా జన్మిస్తాడు. కాని, ఆధ్యాత్మికత పవిత్రాత్మ వల్ల జన్మిస్తుంది. 7 అందువల్ల నేను, ‘నీవు మళ్ళీ జన్మించాలి’ అనటం విని అశ్చర్యపోవద్దు. 8 గాలి తన యిష్టం వచ్చినట్లు వీస్తుంది. మీరు దాని ధ్వని వినగలరు కాని అది ఏ వైపు నుండి వీచిందో, ఏ వైపుకు వీస్తుందో చెప్పలేరు. పవిత్రాత్మవల్ల జన్మించిన ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు” అని అన్నాడు.
9 “అది ఏ విధంగా సంభవమౌతుంది?” అని నికోదేము అడిగాడు.
10 యేసు, “నీవు ఇశ్రాయేలు వారిలో పండితుడవు కదా! నీకీ విషయాలు అర్థం కాలేదా? 11 ఇది నిజం. మేము మాకు తెలసిన విషయాలు చెబుతున్నాము. చూసిన వాటికి సాక్ష్యం చెబుతున్నాము. అయినా మీరు మేము చెబుతున్న వాటిని అంగీకరించరు. 12 నేను మాట్లాడిన ప్రాపంచిక విషయాలను గురించి మీరు నమ్మలేదు. అటువంటప్పుడు పరలోక విషయాలు మాట్లాడితే ఎట్లా నమ్ముతారు? 13 పరలోకం నుండి వచ్చిన మనుష్యకుమారుడు తప్ప పరలోకమునకు ఎవ్వరూ ఎప్పుడూ వెళ్ళలేదు.
14-15 “ఆయన్ని నమ్మిన ప్రతి ఒక్కడూ నశించకుండా అనంత జీవితం పోందాలంటే, మోషే ఎడారిలో పామును ఎత్తినట్లు మనుష్యకుమారుడు కూడా ఎత్త బడాలి” అని అన్నాడు.
16 దేవుడు ఈ ప్రపంచ ప్రజల్ని ఎంతగానో ప్రేమించాడు. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ ప్రపంచంలోకి పంపాడు. ఆయన్ని నమ్మిన వాళ్ళెవ్వరూ నాశనం కాకూడదని, వాళ్ళు అనంత జీవితం పొందాలనీ ఆయన ఉద్దేశ్యం. 17 దేవుడు తన కుమారుని ద్వారా ఈ ప్రపంచానికి రక్షణనివ్వటానికే గాని తీర్పు చెప్పటానికి పంపలేదు. 18 తన కుమారుణ్ణి నమ్మినవానికి ఆయన శిక్ష విధించడు. నమ్మనివానిపై, అనగా తన ఏకైక కూమారుణ్ణి నమ్మలేదు కనుక, యిదివరకే శిక్ష విధించాడు.
© 1997 Bible League International