New Testament in a Year
యేసు తన శిష్యులకు కనిపించటం
(మత్తయి 28:16-20; మార్కు 16:14-18; యోహాను 20:19-23; అపొ. కా. 1:6-8)
36 వాళ్ళు ఈ విషయాన్ని గురించి యింకా మాట్లాడుతుండగా యేసు స్వయంగా వచ్చి వాళ్ళతో నిలుచుని, “శాంతి కలుగుగాక” అని అన్నాడు.
37 వాళ్ళు భూతాన్ని చూసామనుకొని వణికి భయపడిపోయారు. 38 యేసు వాళ్ళతో, “మీరెందుకు భయపడ్తున్నారు. మీకు సందేహాలు ఎందుకు కలుగుతున్నాయి? 39 నా చేతులు, కాళ్ళు చూడండి. నేనే ఆయనను. తాకి చూడండి. నాకు మాంసము, ఎముకలు ఉన్నాయి. భూతానికి అవి ఉండవు” అని అన్నాడు.
40 ఆయన ఈ మాటలు అంటూ తన చేతులు, కాళ్ళు వాళ్ళకు చూపాడు. 41 వాళ్ళకు ఆశ్చర్యము, ఆనందము కలిగాయి. వాళ్ళు నమ్మలేకపొయ్యారు. అప్పుడు యేసు, “మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా?” అని అడిగాడు. 42 వాళ్ళు ఒక కాల్చిన చేపను తెచ్చి యిచ్చారు. 43 ఆయన దాన్ని తీసుకొని వాళ్ళ సమక్షంలో తిన్నాడు.
44 ఆయన, “నేను మీతో కలిసి ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాలలో, కీర్తనలలో నన్ను గురించి వ్రాసినవన్నీ జరుగుతాయి అని చెప్పాను” అని అన్నాడు.
45 అప్పుడు వాళ్ళు లేఖనాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వాళ్ళ కండ్లు తెరిపించాడు. 46 ఆయన వాళ్ళతో, “ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు చనిపోయి మూడవరోజున బ్రతికి వస్తాడు! 47 పశ్చాత్తాపాన్ని గురించి, పాప క్షమాపణ గురించి ఆయన పేరిట ప్రకటించటం మొదట యెరూషలేములో మొదలౌతుంది. ఆ పిదప అది అన్ని దేశాల్లో ప్రకటింపబడుతుంది. 48 మీరు వీటికి సాక్షులు. 49 నా తండ్రి వాగ్దానం చేసిన ఆయన్ని నేను పంపుతాను. కాని పరలోకం నుండి మీకు పరిశుద్ధాత్మ శక్తి లభించే దాకా ఈ పట్టణంలోనే ఉండండి” అని చెప్పాడు.
యేసు పరలోకానికి వెళ్ళటం
(మార్కు 16:19-20; అపొ. కా. 1:9-11)
50 ఆ తర్వాత వాళ్ళను అక్కడి నుండి బేతనియ దాకా తీసుకు వెళ్ళి తన చేతులెత్తి వాళ్ళను ఆశీర్వదించాడు. 51 వాళ్ళను ఆశీర్వదిస్తుండగా ఆయన వాళ్ళ నుండి దూరం చేయబడ్డాడు. ఆ తర్వాత పరలోకానికి తీసుకు వెళ్ళబడ్డాడు. 52 ఆ తర్వాత వాళ్ళాయనకు నమస్కరించి చాలా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. 53 వాళ్ళు మందిరంలో ఉండి విరామం లేకుండా దేవుని స్తుతించారు.
© 1997 Bible League International