New Testament in a Year
పిలాతు సమక్షంలో యేసు
(మత్తయి 27:1-2, 11-14; మార్కు 15:1-5; యోహాను 18:28-38)
23 మహాసభ సభ్యులందరూ లేచి యేసును పిలాతు ముందుకు పిలుచుకు వచ్చి, 2 “ఇతడు మన దేశాన్ని తప్పుదారి పట్టించటం మేము గమనించాము. చక్రవర్తికి పన్నులు కట్టరాదని, తాను క్రీస్తునని, రాజునని చెప్పుకుంటున్నాడు” అని ఫిర్యాదు చేసారు.
3 ఇది విని పిలాతు యేసుతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు.
“ఔను, మీరన్నది నిజం!” అని యేసు సమాధానం చెప్పాడు.
4 ఆ తర్వాత పిలాతు ప్రధాన యాజకులతో, ప్రజలతో, “ఇతనికి శిక్ష విధించటానికి నాకు ఏ కారణం కనిపించటం లేదు” అని అన్నాడు.
5 కాని వాళ్ళు, “ఇతడు తన బోధనలతో యూదయ ప్రాంతంలో ఉన్న ప్రజలనందరిని పురికొలుపుచున్నాడు. ఇది యితడు గలిలయలో ప్రారంభించి యిక్కడి దాకా వచ్చాడు” అని మళ్ళీ మళ్ళీ అన్నారు.
హేరోదు సమక్షంలో యేసు
6 ఇది విని పిలాతు వాళ్ళను, “అతడు గలిలయ దేశస్థుడా?” అని అడిగాడు. 7 యేసు, హేరోదు పాలిస్తున్న ప్రాంతానికి చెందినవాడని తెలుసుకొన్న వెంటనే, పిలాతు ఆయన్ని హేరోదు దగ్గరకు పంపాడు. అప్పుడు హేరోదు యెరూషలేములో ఉన్నాడు.
8 హేరోదుకు చాలాకాలం నుండి యేసును చూడాలని ఉంది. కనుక ఆయన్ని చూడగానే హేరోదుకు చాలా ఆనందం కలిగింది. యేసును గురించి విన్నవాటిని బట్టి ఆయన ఏదైనా మహాత్యం చేస్తాడేమోనని ఆశించాడు. 9 అతడు యేసును ఎన్నో ప్రశ్నలు అడిగాడు. కాని యేసు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. 10 ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసుపై తీవ్రంగా నేరారోపణ చేస్తూ అక్కడే నిలుచొని ఉన్నారు. 11 హేరోదు, అతని భటులు యేసును తిరస్కరించి, హేళన చేస్తూ నవ్వారు. ఆయనకు రాజ దుస్తులు తొడిగించి తిరిగి పిలాతు దగ్గరకు పంపారు. 12 ఆ రోజు హేరోదు, పిలాతు ఇద్దరూ మిత్రులయ్యారు. ఆనాటివరకు వాళ్ళు శత్రువులుగా ఉన్నారు.
మరణదండన విధించటం
(మత్తయి 27:15-26; మార్కు 15:6-15; యోహాను 18:39–19:16)
13 పిలాతు ప్రధానయాజకుల్ని, పాలకుల్ని, ప్రజల్ని, సమావేశపరిచాడు. 14 వాళ్ళతో, “తిరుగుబాటు చెయ్యటానికి ప్రజల్ని పురికొలుపుతున్నాడని అతణ్ణి మీరిక్కడికి పిలుచుకు వచ్చారు. మీ సమక్షంలోనే అతణ్ణి విచారించాము. మీ నేరారోపణలకు నాకు ఏమాత్రం కారణం కనపడటంలేదు. 15 హేరోదుకు కూడా ఏ తప్పూ కనిపించలేదు. కనుకనే అతణ్ణి తిరిగి మా దగ్గరకు పంపాడు. మరణ దండన పొందవలసిన నేరం అతడు చెయ్యలేదని మీరు గమనించారు. 16 అందువల్ల కొన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల చేస్తాను” అని అన్నాడు. 17 [a]
18 వాళ్ళంతా ఒకే గొంతుతో, “అతణ్ణి చంపండి, బరబ్బను విడుదల చెయ్యండి” అని కేకలు వేశారు. 19 బరబ్బ తాను పట్టణంలో చేసిన ఒక తిరుగుబాటు కారణంగా, హత్య కారణంగా కారాగారంలో ఉన్నాడు.
20 యేసును విడుదల చెయ్యాలనే ఉద్దేశ్యంతో పిలాతు మళ్ళీ విజ్ఞప్తి చేశాడు. 21 కాని వాళ్ళు బిగ్గరగా, “అతణ్ణి సిలువకు వెయ్యండి!” అని కేకలు వేశారు.
22 మూడవసారి, పిలాతు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “ఎందుకు? అతడేమి నేరం చేశాడు? అతనికి మరణ దండన విధించటానికి నాకు ఏ కారణం కన్పించలేదు. అందువల్ల కొన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల చేస్తాను.” అని అన్నాడు.
23 కాని, అతణ్ణి సిలువకు వెయ్యమని కేకలు వేయటం వాళ్ళు మానలేదు. చివరకు వాళ్ళు గెలిచారు. 24 పిలాతు వాళ్ళడిగినట్లు చెయ్యటానికి ఒప్పుకున్నాడు. 25 తిరుగుబాటు కారణంగా, హత్య కారణంగా కారాగారంలో ఉన్న వాళ్ళడిగిన బరబ్బను విడుదల చేసి యేసును వాళ్ళ కప్పగించాడు.
© 1997 Bible League International