New Testament in a Year
యేసును బంధించటం
(మత్తయి 26:47-56; మార్కు 14:43-50; యోహాను 18:3-11)
47 ఆయనింకా మాట్లాడుతుండగా ప్రజల గుంపు ఒకటి అక్కడికి వచ్చింది. పన్నెండుమందిలో ఒకడైన యూదా అన్నవాడు అందరి కన్నా ముందు ఉన్నాడు. వాడు యేసును ముద్దు పెట్టుకోవటానికి ఆయన దగ్గరకు వెళ్ళాడు.
48 కాని యేసు వానితో, “యూదా! ముద్దు పెట్టుకొని దేవుని కుమారునికి ద్రోహం చెయ్యాలని నీ ఉద్దేశ్యమా?” అని అడిగాడు. 49 యేసు శిష్యులు జరుగబోయే సంఘటనను గ్రహించారు. వాళ్ళు, “ప్రభూ! మా కత్తులతో వాళ్ళను నరకమంటారా?” అని అడిగారు. 50 ఇంతలో ఆయన శిష్యుల్లో ఒకడు తన కత్తి దూసి ప్రధానయాజకుని సేవకుని యొక్క కుడిచెవి నరికి వేశాడు.
51 యేసు, “ఆపండి” అని అంటూ ఆ సేవకుని చెవి తాకి అతనికి నయం చేశాడు.
52 ఆ తర్వాత యేసు తనను బంధించటానికి వచ్చిన ప్రధానయాజకులతో, మందిరం యొక్క ముఖ్య ద్వారపాలకులతో, పెద్దలతో ఈ విధంగా అన్నాడు: “నేనొక దొంగనైనట్లు మీరు కత్తులతో, కర్రలతో రావలసిన అవసరమేమొచ్చింది? 53 నేను మీతోపాటు ప్రతిరోజు ఆలయంలో ఉన్నాను. కాని మీరు అప్పుడు నన్ను బంధించలేదు. ఇది మీ ఘడియ. సైతాను శక్తులు రాజ్యం చేస్తున్న ఘడియ.”
పేతురు యేసును ఎరుగుననుటకు భయపడటం
(మత్తయి 26:57-58, 69-75; మార్కు 14:53-54, 66-72; యోహాను 18:12-18, 25-27)
54 యేసును బంధించి ప్రధాన యాజకుని యింటికి తీసుకొని వెళ్ళారు. పేతురు కొంత దూరంలో ఉండి వాళ్ళను అనుసరించాడు. 55 వాళ్ళు పెరటి మధ్య చలిమంటలు వేసి చుట్టూరా కూర్చొన్నారు. పేతురు వచ్చి వాళ్ళతో సహా కూర్చున్నాడు. 56 ఒక పనిపిల్ల ఆ మంటల వెలుతురులో పేతురు అక్కడ కూర్చుని ఉండటం గమనించింది. దగ్గరకు వచ్చి అతణ్ణి చూస్తూ, “ఇతడు కూడా యేసుతో ఉన్నాడు” అని అనింది.
57 కాని పేతురు అది నిజంకాదంటూ, “ఆయనెవరో నాకు తెలియదు అమ్మాయి!” అని అన్నాడు. 58 కొంత సేపయ్యాక మరొకడు అతణ్ణి చూసి, “నీవు కూడా వాళ్ళలో ఒకడివి” అని అన్నాడు.
“నేను వాళ్ళలో ఒకణ్ణి కాదు” అని సమాధానం చెప్పాడు.
59 ఒక గంట తర్వాత యింకొకడు, “ఇతడు గలిలయ దేశస్థుడు. కనుక తప్పక అతనితో ఉన్నవాడే!” అని అన్నాడు.
60 “అయ్యా! మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియదు” అని పేతురు సమాధానం చెప్పాడు.
అతడీ మాటలంటుండగానే కోడి కూసింది. 61 ప్రభువు అటువైపు మళ్ళీ సూటిగా పేతురు వైపు చూశాడు. అప్పుడు ప్రభువు, “ఈ రోజు కోడి కూయక ముందే నేనెవరినో తెలియదని మూడుసార్లంటావు” అని అన్న మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి. 62 పేతురు బయటకు వెళ్ళి భోరున ఏడ్చాడు.
భటులు యేసును హేళన చెయ్యటం
(మత్తయి 26:67-68; మార్కు 14:65)
63-64 యేసును కాపలా కాస్తున్న వాళ్ళు ఆయన్ని హేళన చేస్తూ కొట్టటం మొదలు పెట్టారు. ఆయన కళ్ళకు బట్టకట్టి, “నిన్నెవరు కొట్టారో దివ్యదృష్టితో చూసి చెప్పు!” అని ఆయన్ని కవ్వించి అడిగారు. 65 అవమానిస్తూ ఎన్నెన్నో మాటలు అన్నారు.
మహాసభ సమక్షంలో యేసు
(మత్తయి 26:59-66; మార్కు 14:55-64; యోహాను 18:19-24)
66 సూర్యోదయం కాగానే యూదుల పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు సమావేశమయ్యారు. వాళ్ళు యేసును మహాసభ ముందుకు పిలుచుకు వచ్చారు. 67 మహాసభ సభ్యులు, “నీవు క్రీస్తువైనట్లైతే మాతో చెప్పు” అని అన్నారు.
యేసు, “నేను చెబితే మీరు నమ్మరు. 68 నేను అడిగితే మీరు చెప్పరు. 69 కాని యిప్పటినుండి మనుష్య కుమారుడు సర్వశక్తిసంపన్నుడైన దేవుని యొక్క కుడివైపున కూర్చుంటాడు” అని సమాధానం చెప్పాడు.
70 వాళ్ళు, “నీవు దేవుని కుమారునివా?” అని అడిగారు. ఆయన, “మీరన్నది నిజం” అని అన్నాడు.
71 ఆ తదుపరి వాళ్ళు, “మనకిక ఇతర సాక్ష్యాలు ఎందుకు? స్వయంగా అతని నోటినుండే విన్నాము” అని అన్నారు.
© 1997 Bible League International