Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లూకా 21:20-38

యేసు యెరూషలేము నాశనమౌతుందని చెప్పటం

(మత్తయి 24:15-21; మార్కు 13:14-19)

20 “యెరూషలేము చుట్టూ సైన్యాలు చూసినప్పుడు అది నాశనమయ్యే రోజులు వచ్చాయని గ్రహించండి. 21 అప్పుడు యూదయలో ఉన్న మీరు పరుగెత్తి కొండల మీదికి వెళ్ళండి. పట్టణంలో ఉన్న వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపొండి. గ్రామాల్లో ఉన్న వాళ్ళు పట్టణాల్లోకి వెళ్ళకండి. 22 ఇది శిక్షా సమయం. ఇదివరకు లేఖనాల్లో వ్రాసినవన్నీ నిజంకానున్న సమయం. 23 ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు, పురిటి స్త్రీలకు ఎంత కష్టం కలుగుతుందో కదా! ఈ దేశానికి పెద్ద దుఃఖంకలుగనున్నది. దేవుడు తన కోపాన్ని ఈ దేశంపై చూపనున్నాడు. 24 కొందరు కత్తికి బలి అవుతారు. మరి కొందరు ఖైదీలుగా యితర దేశాలకు తీసుకు వెళ్ళబడతారు. యూదులుకాని వాళ్ళ కాలం ముగిసేదాకా వాళ్ళు యెరూషలేమును అణగత్రొక్కి ఉంచుతారు.

భయపడవద్దు

(మత్తయి 24:29-31; మార్కు 13:24-27)

25 “సూర్యునిలో, చంద్రునిలో, నక్షత్రాల్లో సూచనలు కన్పిస్తాయి. సముద్రాల రోదనకు, తీవ్రమైన అలలకు దేశాలు భయపడి కలవరం చెందుతాయి. 26 రానున్న ఘోరాన్ని తలంచుకొని ప్రజలు భయంతో మూర్చపోతారు. ఆకాశపు జ్యోతులు గతి తప్పుతాయి. 27 అప్పుడు శక్తితో, గొప్ప తేజస్సుతో మేఘం మీద మనుష్యకుమారుడు రావటం వాళ్ళు చూస్తారు. 28 ఇవి జరగటం మొదలైనప్పుడు లేచి మీ తలలెత్తి చూడండి. అంటే మీకు రక్షణ దగ్గరకు వచ్చిందని అర్థం” అని అన్నాడు.

చెట్ల ఉపమానం

(మత్తయి 24:32-35; మార్కు 13:28-31)

29 ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “ఆ అంజూరపు చెట్టును చూడండి. అంతెందుకు; చెట్లన్నిటిని చూడండి. 30 చెట్టు చిగురు వేయగానే ఎండాకాలం దగ్గరకు వచ్చిందని గ్రహిస్తారు. 31 అదే విధంగా ఈ సంఘటనలు జరగటం చూసినప్పుడు దేవుని రాజ్యం దగ్గరకు వచ్చిందని గ్రహించండి.

32 “ఇది నిజం. ఇవన్నీ సంభవించేవరకు ఈ తరంవాళ్ళు గతించరు. 33 ఆకాశం, భూమి గతించి పోవచ్చుకాని నామాటలు చిరకాలం నిలిచి పోతాయి.

అన్ని వేళలా సిద్ధంగా ఉండండి

34 “జాగ్రత్త! విందులు, వినోదాలు చేసుకొంటూ త్రాగుబోతులై జీవించకండి. ప్రాపంచిక విషయాల్లో మునిగిపోకండి. అలా చేస్తే మీ బుద్ధి పని చెయ్యటం మానేస్తుంది. అప్పుడు ఆ దినం మీరు సిద్ధంగా లేనప్పుడు వచ్చి మీ మీద పడుతుంది. 35 అది ప్రపంచం మీదికంతా వస్తుంది. 36 అన్ని వేళలా జాగ్రత్తగా ఉండండి. ఈ దుర్ఘటనలనుండి తప్పించుకొనే శక్తి, మనుష్యకుమారుని సమక్షంలో నిలబడగలిగే శక్తి కలగాలని ప్రార్థించండి.”

37 యేసు ప్రతి రోజు మందిరంలో బోధిస్తూ ఉండేవాడు. ప్రతిరాత్రి ఒలీవలకొండ మీదికి వెళ్ళి గడిపేవాడు. 38 ప్రజలందరు ఆయన బోధనలు వినాలని తెల్లవారుఝామునే మందిరానికి వెళ్ళేవాళ్ళు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International