New Testament in a Year
కొందరు సద్దూకయ్యులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం
(మత్తయి 22:23-33; మార్కు 12:18-27)
27 చనిపొయ్యాక మళ్ళీ బ్రతికిరారని వాదించే సద్దూకయ్యుల తెగకు చెందిన కొందరు యేసు దగ్గరకు వచ్చి ఈ విధంగా ప్రశ్నించారు: 28 “బోధకుడా! మోషే ‘ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే అతని సోదరుడు ఆ చనిపోయిన వానికి సంతానం కలుగ చేయటానికి అతని భార్యను వివాహం చేసుకోవాలి’ అని వ్రాశాడు. 29 ఒక్కప్పుడు ఏడుగురు సోదరులుండే వారు. మొదటి వాడు పెళ్ళి చేసుకొని సంతానం లేకుండా మరణించాడు. 30 రెండవవాడు ఆమెను పెళ్ళి చేసుకొని మరణించాడు. 31 మూడవవాడును ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. అదేవిధంగా ఆ ఏడుగురు సోదరులు సంతానం లేకుండా మరణించారు. 32 చివరకు ఆమెకూడా మరణించింది. 33 మరణించిన వాళ్ళందరూ బ్రతికి వచ్చినప్పుడు ఆమెను ఆ ఏడుగురూ పెళ్ళి చేసుకొంటారు గనుక ఆమె ఎవరి భార్య అవుతుంది?” అని అడిగారు.
34 యేసు, “ఈ భూమ్మీద వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు. చేసుకొంటారు. 35 పరలోకమునకు పునరుత్థానమగుటకు అర్హత ఉన్నవాళ్ళు అనంత జీవితం పొంది రానున్న కాలంలో జీవిస్తారు. అప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, చెయ్యరు. 36 వాళ్ళు దేవదూతల వలె, దేవుని కుమారులవలె ఉంటారు. కనుక వారిక చావరు. వాళ్ళు మరణాన్ని జయించి బ్రతికి వచ్చిన వాళ్ళు కనుక దేవుని సంతానంగా పరిగణింపబడతారు. 37 మండుచున్న పొదను గురించి వ్రాస్తూ, ‘ప్రజలు చావునుండి బ్రతికింపబడతారు’ అని మోషే సూచించాడు. ఎందుకంటే, అతడు ప్రభువును గురించి ప్రస్తావిస్తూ ‘ప్రభువు అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు దేవుడు’(A) అని వ్రాసాడు. 38 ప్రభువు చనిపోయిన వాళ్ళకు దేవుడు కాదు. ఆయన సజీవంగా ఉన్నవాళ్ళకే దేవుడు. ఆయన అందర్ని జీవిస్తున్న వాళ్ళుగా పరిగణిస్తాడు” అని అన్నాడు.
39 కొందరు శాస్త్రులు, “బోధకుడా! చక్కగా చెప్పారు” అని అన్నారు. 40 ఆ తదుపరి ఆయన్ని ప్రశ్నించటానికి ఎవరికి ధైర్యం చాలలేదు.
క్రీస్తు దావీదు కుమారుడా లేక దావీదుకు ప్రభువా?
(మత్తయి 22:41-46; మార్కు 12:35-37)
41 ఆ తర్వాత యేసు వాళ్ళతో, “క్రీస్తు దావీదు కుమారుడని వాళ్ళు ఎందుకు అంటున్నారు? 42-43 దావీదు, తన కీర్తనలో ఈ విధంగా వ్రాశాడు కదా!
‘ప్రభువు నా ప్రభువుతో:
నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకూ
నా కుడి వైపు కూర్చో’(B)
44 దావీదు ఆయన్ని ‘ప్రభూ!’ అని అన్నాడు కదా! అలాంటప్పుడు ఆయన దావీదు కుమారుడెట్లా ఔతాడు?” అని అన్నాడు.
శాస్త్రుల్ని విమర్శించటం
(మత్తయి 23:1-36; మార్కు 12:38-40; లూకా 11:37-54)
45 ప్రజలు యేసు చెబుతున్న విషయాలు వింటూ అక్కడే ఉన్నారు. ఆయన తన శిష్యులకు ఈ విధంగా చెప్పాడు: 46 “శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిండుగా అంగీలువేసుకొని తిరగాలి అంటే వారికి చాలా యిష్టం. సంతలో నడుస్తున్నప్పుడు ప్రజలు దండాలు పెడితే సంతసిస్తారు. విందుకు వెళ్ళినప్పుడు, సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన స్థానాల్లో కూర్చోవటానికి ప్రాకులాడుతారు. 47 వితంతువుల్ని మోసం చేసి వాళ్ళ ఇళ్ళు దోచుకుంటారు. కాని పైకి మాత్రం చాలాసేపు ప్రార్థనలు చేస్తూవుంటారు. అలాంటి వాళ్ళను దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు.”
© 1997 Bible League International