New Testament in a Year
పట్టు వదలని వితంతువు యొక్క ఉపమానం
18 నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలని, నిరుత్సాహం చెందరాదని, బోధించటానికి యేసు తన శిష్యులకు ఈ ఉపమానం చెప్పాడు: 2 “ఒక గ్రామంలో ఒక న్యాయాధిపతి ఉండేవాడు. అతనికి దేవుడంటే భయంకాని, ప్రజలు తనని గురించి ఏమనుకొంటారనే భీతికాని లేకుండెను. 3 అదే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. ఆమె ఆ న్యాయాధిపతి దగ్గరకు ప్రతిరోజు వచ్చి ‘నాకు ఒకడు అన్యాయం చేశాడు. నాకు న్యాయం చేకూర్చండి’ అని అడుగుతూ ఉండేది. 4 చాలా కాలం అతడు ఆమె మాటలు పట్టించుకోలేదు. కాని చివరకు ‘నాకు దేవుడంటే భయంకాని, ప్రజలంటే భీతికాని లేదు. 5 కాని ఈ వితంతువు వచ్చి నన్ను విసిగిస్తోంది. కాబట్టి ఈమె మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు రాకుండ ఈమెకు న్యాయం జరిగేలా చూస్తాను’ అని తన మనస్సులో అనుకున్నాడు.”
6 ఇలా చెప్పి ప్రభువు, “ఆ నీతి నియమం లేని న్యాయాధిపతి అనుకొన్న మాటలు విన్నారు కదా! 7 మరి దేవుడు తనను రాత్రింబగళ్ళు ప్రార్థించే తన వాళ్ళకు న్యాయం చేకూర్చకుండా ఉంటాడా? వాళ్ళకు న్యాయం చెయ్యటంలో ఆలస్యం చేస్తాడా! 8 ఆయన వాళ్ళకు వెంటనే న్యాయం చేకూరుస్తాడని నేను చెబుతున్నాను. కాని మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఈ ప్రపంచంలోని ప్రజలలో విశ్వాసాన్ని కనుగొంటాడా?” అని అన్నాడు.
పరిసయ్యుడు, పన్నులు సేకరించేవాడు
9 తాము మాత్రమే నీతిమంతులమని అనుకొని యితర్లను చిన్నచూపు చూసేవాళ్ళకు యేసు ఈ ఉపమానం చెప్పాడు: 10 “ఇద్దరు మనుష్యులు మందిరానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు పన్నులు వసూలు చేసేవాడు. 11 పరిసయ్యుడు ఒక ప్రక్కనిలుచొని ఈ విధంగా ప్రార్థించటం మొదలు పెట్టాడు: ‘ప్రభూ! నేను యితరుల్లా, అంటే మోసగాళ్ళల్లా, దుర్మార్గుల్లా, వ్యభిచారుల్లా ఉండనందుకు నీకు కృతజ్ఞుణ్ణి. ఈ పన్నులు సేకరించేవానిలా నేను ఉండనందుకు కూడా కృతజ్ఞుణ్ణి. 12 నేను వారానికి రెండుసార్లు ఉపవాసాలు చేస్తాను. నా సంపదలో పదవవంతు దేవుని పేరిట యిస్తాను.’
13 “ఆ పన్నులు సేకరించేవాడు మరొక ప్రక్క నిలుచొని ఆకాశం వైపు కూడా చూడటానికి ధైర్యము లేక గుండెలు బాదుకుంటూ, ‘దేవుడా! నేనొక పాపిని, నాపై దయచూపు’ అని అన్నాడు. 14 దేవుని దృష్టిలో పరిసయ్యునికి మారుగా ఇతడు నీతిమంతుడనిపించుకొని ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే గొప్పలు చెప్పుకొన్నవాడు అణచబడతాడు. అణుకువతో ఉన్నవాడు గొప్ప స్థానానికి ఎత్తబడతాడు.”
యేసు చిన్నపిల్లల్ని దీవించటం
(మత్తయి 19:13-15; మార్కు 10:13-16)
15 యేసు వారిని తాకాలని ప్రజలు చిన్న పిల్లల్ని ఆయన దగ్గరకు పిలుచుకు వచ్చారు. శిష్యులు యిది చూసి ప్రజల్ని వారించారు. 16 కాని, యేసు ఆ చిన్న పిల్లల్ని తన దగ్గరకు పిలుస్తూ, “చిన్న పిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి. వాళ్ళను ఆపకండి. దేవుని రాజ్యం వాళ్ళలాంటి వారిదే. 17 యిది నిజం. దేవుని రాజ్యాన్ని చిన్న పిల్లల్లా అంగీరించనివాడు ఆందులోకి ప్రవేశించలేడు” అని అన్నాడు.
ధనవంతుడు యేసును వెంబడించుటకు నిరాకరించటం
(మత్తయి 19:16-30; మార్కు 10:17-31)
18 ఒక యూదుల నాయకుడు యేసును, “బోధకుడా! మీరు మంచివాళ్ళు. నేను అనంత జీవితం పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.
19 “నేను మంచివాణ్ణని ఎందుకంటున్నావు? దేవుడు తప్ప మరెవ్వరూ మంచివాళ్ళు కాదు. 20 నీకు దేవుని ఆజ్ఞలు తెలుసు కదా: ‘వ్యభిచారం చెయ్యరాదు, హత్య చెయ్యరాదు. దొంగతనము చెయ్యరాదు. దొంగ సాక్ష్యాలు చెప్పరాదు. తల్లి తండ్రుల్ని గౌరవించవలెను’” అని యేసు సమాధానం చెప్పాడు.
21 “నేను చిన్ననాటినుండి ఈ నియమాలు పాటిస్తూనేవున్నాను” అని ఆ యూదుల పెద్ద అన్నాడు.
22 ఇది విని యేసు అతనితో, “నీలో యింకొక లోపం ఉంది. నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకు దానం చెయ్యి. అది నీకు పరలోకంలో సంపద అవుతుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అన్నాడు. 23 ఆ యూదుల పెద్ద చాలా ధనవంతుడు. అందువల్ల యిది విని అతనికి చాలా దుఃఖం కలిగింది.
© 1997 Bible League International