Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లూకా 12:1-31

పరిసయ్యులవలె ఉండవద్దు

12 అంతలో వేలమంది ప్రజలు సమావేశమవటం వలన ఒకళ్ళనొకళ్ళు త్రోసు కోవటం మొదలు పెట్టారు. యేసు మొదట తన శిష్యులతో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు: “పరిసయ్యుల ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తపడండి. బయట పడకుండా ఏదీ దాగివుండదు. దాచబడింది ఏదీ బహిరంగం కాకుండా పోదు. చీకట్లో మాట్లాడుకున్న మాటలు అందరికీ వినిపిస్తాయి. గది తలుపులు వేసుకొని రహస్యంగా మాట్లాడుకున్న విషయాలు ఇంటి కప్పుల మీదినుండి ప్రకటింపబడతాయి.

దేవునికి మాత్రమే భయపడుము

(మత్తయి 10:28-31)

“మిత్రులారా! నేను చెబుతున్నది వినండి: ఈ శరీరాన్ని చంపేవాళ్ళను చూసి భయపడకండి. దాన్ని చంపాక వాళ్ళేమీ చెయ్యలేరు. ఎవరికి భయపడాలో నేను చెబుతున్నాను. శరీరం చనిపోయాక మిమ్మల్ని నరకంలో పారవేయటానికి అధికారమున్న వానికి భయపడండి! ఔను, ఆయనకు భయపడుమని చెబుతున్నాను.

“రెండు కాసులకు ఐదు పిచ్చుకలు అమ్ముడు పోతాయి కదా! అయినా, ఒక్క పిచ్చుకనైనా దేవుడు మరచిపోలేదు. మీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా దేవునికి తెలుసు. పిచ్చుకలకన్నా మీ విలువ ఎక్కువే! కనుక భయపడకండి.

నీ విశ్వాసాన్ని గురించి సిగ్గుపడవొద్దు

(మత్తయి 10:32-33; 12:32; 10:19-20)

“బహిరంగంగా నన్ను అంగీకరించిన వాణ్ణి మనుష్యకుమారుడు దేవదూతల సమక్షంలో అంగీకరిస్తాడని నేను చెబుతున్నాను. కాని ప్రజల సమక్షంలో నన్ను కాదన్న వాణ్ణి మనుష్యకుమారుడు దేవుని సమక్షంలో కాదంటాడు.

10 “మనుష్యకుమారుణ్ణి దూషించిన వాణ్ణి దేవుడు క్షమించవచ్చునేమో కాని పవిత్రాత్మను దూషించినవాణ్ణి దేవుడు క్షమించడు.

11 “సమాజమందిరాల ముందు, లేక పాలకుల ముందు, లేక అధికారుల ముందు మిమ్మల్ని నిలబెడితే ఏ విధంగా మాట్లాడాలో, నిర్దోషులని ఏ విధంగా ఋజువు చేసుకోవాలో చింతించకండి. 12 మీరు ఏమి మాట్లాడాలో అప్పుడు పవిత్రాత్మ మీకు చెబుతాడు.”

పిసినారి ఉపమానం

13 ప్రజల నుండి ఒకడు, “అయ్యా! నా సోదరుణ్ణి ఆస్తి పంచిపెట్టమని చెప్పండి” అని అన్నాడు.

14 యేసు, “నన్ను మీ న్యాయాధిపతిగా లేక మీ మధ్యవర్తిగా ఎవరు నియమించారు?” అన్నాడు. 15 ఆ తర్వాత వాళ్ళతో, “జాగ్రత్త! అత్యాసలకు పోకండి. మానవుని జీవితం అతడు ఎంత ఎక్కువ కూడబెట్టాడన్న దానిపై ఆధారపడి ఉండదు” అని యేసు అన్నాడు.

16 ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “ఒక ధనికుడు ఉండేవాడు. అతని పొలంలో బాగాపంట పండింది. 17 అతడు ‘నేనేం చేయాలి? నా దగ్గర ఈ ధాన్యం దాచటానికి స్థలం లేదే’ అని తన మనస్సులో ఆలోచించసాగాడు.

18 “‘ఆ! ఇలా చేస్తాను. నా ధాన్యపు కొట్టుల్ని పడగొట్టి యింకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యాన్ని, వస్తువుల్ని దాస్తాను’ అని అనుకొన్నాడు. ఆ తర్వాత అతడు, తనతో 19 ‘అదృష్టవంతుడివి, సంవత్సరాలదాకా సరిపోయే వస్తువుల్ని కూడబెట్టుకున్నావు. ఇక జీవితాన్ని సుఖంగా గడుపు. తిను, త్రాగు, ఆనందించు’ అని చెప్పుకుంటానని అనుకొన్నాడు.

20 “కాని దేవుడు అతనితో, ‘మూర్ఖుడా! ఈ రాత్రే నీ ప్రాణం పోతుంది. అప్పుడు నీవు నీకోసం దాచుకొన్నవి ఎవరు అనుభవిస్తారు?’ అని అడిగాడు.

21 “ఐహిక సంపదల్ని కూడబెట్టుకొని, ఆధ్యాత్మిక సంపదల్ని నిర్లక్ష్యం చేసినవాని గతి అదే విధంగా ఉంటుంది.”

మొదట దేవుని రాజ్యం

(మత్తయి 6:25-34, 19-21)

22 ఈ విధంగా చెప్పి యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “అందువల్ల నేను చెప్పేదేమిటంటే జీవించటానికి ఏమి తినాలి? మీ దేహాలకు ఏ దుస్తులు ధరించాలి? అని చింతించకండి. 23 మీ జీవితం ఆహారాని కన్నా ముఖ్యమైనది. దేహం దుస్తులకన్నా విలువైనది. 24 పక్షుల్ని చూడండి. అవి విత్తనాలు నాటవు. పంటకోయవు. వాటిదగ్గర ఎలాంటి ధాన్యపు కొట్లు లేవు. దేవుడు వాటికి ఆహారం చూపిస్తున్నాడు. మీరాపక్షుల కన్నా విలువైన వాళ్ళు. 25 చింతించి తన జీవితాన్ని ఒక గంట పొడిగించగల వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? 26 మీరింత చిన్న విషయం సాధించ లేనప్పుడు మిగతా వాటిని గురించి ఎందుకు చింతిస్తున్నారు?

27 “పువ్వులు ఏ విధంగా పెరుగుతున్నాయో గమనించండి. అవి పని చేయవు. దారం వడకవు. నేను చెప్పేదేమిటంటే ఖరీదైన దుస్తులు వేసుకొనే సొలొమోను రాజుకూడా ఏ ఒక్క పువ్వుతో సరితూగలేడు. 28 మీలో కొంతకూడా విశ్వాసం లేదు. ఎందుకు? ఈ రోజు ఉండి, రేపు అగ్నిలో కాలిపోయే గడ్డిని దేవుడు అంత అందంగా అలంకరించాడు కదా! మరి మిమ్మల్నెంత అందంగా అలంకరిస్తాడో ఆలోచించండి.

29 “అందువల్ల ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని ప్రాకులాడకండి. వాటిని గురించి చింతించకండి. 30 ప్రపంచం లోవున్న ప్రతి ఒక్కడూ వాటికోసం ప్రాకులాడుతాడు. మీ తండ్రికి మీకేవి అవసరమో తెలుసు. 31 ఆయన రాజ్యాన్ని, నీతిని సంపాదించుకోండి. అప్పుడు దేవుడు మీకు యివి కూడా యిస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International