New Testament in a Year
31 “మరి ఈ కాలపు ప్రజల్ని నేను దేనితో పోల్చాలి? వాళ్ళు ఏ విధంగా ఉంటారు? 32 వాళ్ళు సంతలో కూర్చొని,
‘మేము మీకోసం పిల్లన గ్రోవి ఊదాము.
కాని మీరు నాట్యం చేయలేదు.
మేము చనిపోయిన వానికోసం పాట పాడాము.
కాని మీరు దుఃఖించలేదు.’
అని మాట్లాడుకొంటున్న చిన్న పిల్లల్లాంటి వాళ్ళు. 33 బాప్తిస్మమునిచ్చే యోహాను ఆహారం తినలేదు. ద్రాక్షారసం త్రాగలేదు. మీరు అతనికి దయ్యం పట్టిందన్నారు. 34 మనుష్యకుమారుడు తింటూ, త్రాగుతూ వచ్చాడు. ఆయన్ని మీరు తిండిపోతు, త్రాగుపోతు అని అన్నారు. పన్నులు వసూలు చేసే వాళ్ళతో, పాపులతో స్నేహం చేస్తాడని ఆయన్ని విమర్శించారు. 35 జ్ఞానము దానిని పొందినవాని ద్వారా సరైనదని ఋజువు చేయబడుతుంది.”
పాపపు స్త్రీ యేసు పాదాలకు అత్తరు పూయటం
36 ఒకసారి ఒక పరిసయ్యుడు యేసును తన యింటికి భోజనానికి పిలిచాడు. యేసు అతని యింటికి వెళ్ళాడు. ఆయన భోజనానికి కూర్చొని ఉండగా, 37 ఆ పట్టణంలో పాపాలు చేస్తూ జీవిస్తున్న ఒక స్త్రీ యేసు పరిసయ్యుని యింట్లో భోజనం చేస్తున్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళింది. వెళ్ళేముందు చలువరాతి బుడ్డిలో ఖరీదైన అత్తరు తన వెంట తీసుకువెళ్ళింది. 38 వెనుకనుండి వచ్చి ఆయన కాళ్ళ దగ్గర నిలుచొంది. ఆయన పాదాలను తన కన్నీటితో తడిపి, తన వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంది. వాటిపై అత్తరు పోసింది.
39 ఆయన్ని ఆహ్వానించిన పరిసయ్యుడు ఇది చూసి, “ఆయన ప్రవక్త అయినట్లైతే తనను ఎవరు తాకారో, ఆమె ఎలాంటి స్త్రీయో, అంటే ఆమె పాపం చేస్తూ జీవించే స్త్రీయని తెలుసుకుంటాడు” అని తన మనస్సులో అనుకున్నాడు.
40 యేసు అతనితో, “సీమోనూ, నీకో విషయం చెప్పాలి!” అని అన్నాడు.
“చెప్పండి, బోధకుడా!” అని సీమోను అన్నాడు.
41 యేసు, “ఇద్దరు వ్యక్తులు ఒక షావుకారికి అప్పుండినారు. వాళ్ళలో ఒకడు అయిదు వందల దేనారాలు, యింకొకడు యాభై దేనారాలు అప్పు తీసుకొని ఉన్నారు. 42 ఇద్దరిలో ఎవ్వరి దగ్గర కూడా అప్పుతీర్చటానికి డబ్బులేదు. అందువల్ల ఆ షావుకారు వాళ్ళిద్దరి అప్పు రద్దు చేశాడు. ఆ యిద్దరిలో ఎవరు ఆ షావుకారి పట్ల ఎక్కువ ప్రేమ కనుబరుస్తారు?” అని అడిగాడు.
43 “ఎక్కువ ధనం అప్పున్నవాడని నేననుకొంటాను” అని సీమోను సమాధానం చెప్పాడు.
యేసు, “నీ తీర్పు సరియైనది” అని అన్నాడు. 44 ఆ తర్వాత ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, “ఈ స్త్రీని చూస్తున్నావా? నేను నీ యింటికి వచ్చాను. కాళ్ళు కడుక్కోవటానికి నీవు నీళ్ళు కూడా ఇవ్వలేదు. కాని ఈమె నా కాళ్ళు తన కన్నీటితో కడిగి తన వెంట్రుకలతో తుడిచింది. 45 నీవు నన్ను ప్రేమతో హృదయానికి హత్తుకోలేదు. కాని ఈమె యింట్లోకి వచ్చినప్పటినుండి నా కాళ్ళను భక్తితో ముద్దాడటం మానలేదు. 46 నీవు నా తలకు నూనె అంటలేదు. కాని ఈమె నా కాళ్ళకు అత్తరు రాసింది. 47 అందువల్ల నేను చెప్పేదేమిటంటే ఆమె చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయి. దీనికి ఆమె చూపిన అమితమైన ప్రేమే నిదర్శనం. కొన్ని పాపాలు మాత్రమే క్షమించబడిన వానికి కొంత ప్రేమ మాత్రమే ఉంటుంది” అని అన్నాడు.
48 ఆ తర్వాత యేసు ఆమెతో, “నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నాడు.
49 అక్కడున్న మిగతా అతిథులు, “పాపాలు కూడా క్షమించటానికి యితడెవరు?” అని పరస్పరం మాట్లాడుకున్నారు.
50 యేసు ఆ స్త్రీతో, “నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. శాంతంగా వెళ్ళు!” అని అన్నాడు.
© 1997 Bible League International