Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లూకా 6:1-26

యేసు విశ్రాంతి రోజుకు ప్రభువు

(మత్తయి 12:1-8; మార్కు 2:23-28)

ఒక విశ్రాంతి రోజు యేసు ధాన్యపు పొలాల్లో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కంకులు త్రుంచి వాటిని నలిపి తినటం మొదలుపెట్టారు. కొందరు పరిసయ్యులు, “విశ్రాంతి రోజున చెయ్యరాని పనులు ఎందుకు చేస్తున్నారు?” అని అడిగారు.

యేసు, “దావీదు తనకు, తనతో ఉన్న వాళ్ళకు ఆకలి వేసినప్పుడు ఏమిచేసాడో మీరు చదవలేదా? అతడు దేవుని ఆలయంలోకి వెళ్ళాడు. అక్కడ దేవుని సన్నిధిని పెట్టిన రొట్టెలు ఉండినవి. వాటిని యాజకులు తప్ప యితర్లు తిన కూడదు. అతడు వాటిని తీసుకొని తాను తిని, తనతో ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చాడు” అని సమాధానం చెప్పాడు. యేసు మళ్ళీ, “మనుష్యకుమారుడు విశ్రాంతి రోజుకు ప్రభువు!” అని అన్నాడు.

విశ్రాంతి రోజు యేసు నయం చేయటం

(మత్తయి 12:9-14; మార్కు 3:1-6)

మరొక విశ్రాంతి రోజు యేసు సమాజ మందిరానికి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. అక్కడ కుడి చేయి పడిపోయిన వాడొకడున్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు యేసును ఏదో ఒక కారణంతో నిందించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు విశ్రాంతి రోజు ఆయన ఆ చేయి పడిపోయిన వానిని నయం చేస్తాడేమోనని ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. యేసుకు వాళ్ళేమాలోచిస్తున్నారో తెలుసు. ఆయన ఆ చేయి పడిపోయిన వానితో, “లేచి అందరి ముందు నిలుచో!” అని అన్నాడు. ఆ చేయి పడిపోయిన వాడు లేచి నిలుచున్నాడు. ఆ తదుపరి యేసు వాళ్ళతో, “విశ్రాంతి రోజు ఏది చెయ్యటం న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నాను? ఒకరికి మేలు చేయటమా? లేక కీడు చేయటమా? ప్రాణాన్ని రక్షించటమా? లేక నాశనం చేయటమా?” అని అన్నాడు.

10 యేసు వాళ్ళ వైపు ఒకసారి చూసి, చేయి పడిపోయిన వానితో, “నీ చేయి చాపు!” అని అన్నాడు. ఆచేయి పడిపోయినవాడు యేసు చెప్పినట్లు చేశాడు. అతని చేయి పూర్తిగా నయమై పోయింది. 11 ఇది చూసి అక్కడున్నవాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు యేసును ఏమి చెయ్యాలో తమలో తాము ఆలోచించుకొన్నారు.

యేసు పన్నెండు మంది అపోస్తలుల్ని ఎన్నుకొనటం

(మత్తయి 10:1-4; మార్కు 3:13-19)

12 ఆ తర్వాత యేసు ఒక రోజు ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు. రాత్రంతా దేవుణ్ణి ప్రార్థిస్తూ గడిపాడు. 13 ఉదయం కాగానే తన శిష్యులందర్ని దగ్గరకు పిలిచి వాళ్ళలో పన్నెండు మందిని ఎన్నుకొని వాళ్ళను తన అపొస్తలులుగా నియమించాడు. వారెవరనగా,

14 సీమోను, యేసు ఇతనికి “పేతురు” అని పేరు పెట్టాడు,

అతని తమ్ముడు అంద్రెయ.

యాకోబు,

యోహాను,

ఫిలిప్పు,

బర్తొలొమయి,

15 మత్తయి,

తోమా,

అల్ఫయి కుమారుడు యాకోబు,

జెలోతె[a] అని పిలువబడే సీమోను

16 యాకోబు కుమారుడు యూదా,

యూదా ఇస్కరియోతు. (ఈ యూదా ఇస్కరియోతు మున్ముందు ద్రోహిఔతాడు).

యేసు బోధించి రోగులను నయం చేయటం

(మత్తయి 4:23-25; 5:1-12)

17 యేసు వాళ్ళతో సహా కొండ దిగి సమంగా ఉన్న స్థలంలో నిలుచున్నాడు. చాలా మంది శిష్యులు ఆయనతో ఉన్నారు. ఆయన శిష్యులే కాక యూదయ నుండి, యెరూషలేం నుండి చాలా మంది ప్రజలు వచ్చారు. సముద్ర తీరంలో ఉన్న తూరు, సీదోను పట్టణాల నుండి కూడా చాలా మంది ప్రజలు వచ్చారు. 18 ఆయన బోధనలు వినాలని ఆయన ద్వారా తమ రోగాలు బాగు చేయించుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం. దయ్యాలు పట్టి బాధపడ్తున్న వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా నయమైపోయింది. 19 ఆయన నుండి శక్తి ప్రవహించి అందరికి నయం చేస్తూవుండటం వల్ల అందరూ ఆయన్ని తాకటానికి ప్రయత్నించారు.

20 యేసు తన శిష్యుల వైపు చూసి ఈ విధంగా అన్నాడు:

“దీనులైన మీరు ధన్యులు.
    దేవుని రాజ్యం మీది.
21 ఇప్పుడు ఆకలితో ఉన్న మీరు ధన్యులు.
    మీ ఆకలి తీరుతుంది.
ఇప్పుడు దుఃఖిస్తున్న మీరు ధన్యులు.
    భవిష్యత్తులో మీరు నవ్వుతారు.

22 “మనుష్యకుమారుని కారణంగా ప్రజలు మిమ్ముల్ని ద్వేషించినప్పుడు, మిమ్మల్ని దూరం చేసి అవమానించినప్పుడు, మీ పేరే హానికరమైనదని వారు భావించినప్పుడు మీరు ధన్యులౌతారు! 23 మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక యిది జరిగిన రోజు ఆనందంతో గంతులు వెయ్యండి! వీళ్ళ పూర్వీకులు కూడా ఆనాడు ప్రవక్తల పట్ల యిదే విధంగా ప్రవర్తించారు.

24 “ఓ ధనికులారా! మీకు శ్రమ తప్పదు!
    మీరు అనుభవించవలసిన సుఖాన్ని యిదివరకే అనుభవించారు!
25 కడుపులు నిండిన ప్రజలారా మీకు శ్రమ తప్పదు.
    మీకు ఆహారం దొరకదు!
నవ్వుతున్న ప్రజలారా! మీకు శ్రమ తప్పదు!
    మీరు దుఃఖిస్తారు, శోకిస్తారు!

26 “పొగడ్తులుపొందే ప్రజలారా! మీకు శిక్ష తప్పదు! వాళ్ళ పూర్వులు యిదే విధంగా అబద్ధ ప్రవక్తల్ని పొగిడారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International