New Testament in a Year
యేసు ఒక మనుష్యుని దయ్యంనుండి విడిపించటం
(మార్కు 1:21-28)
31 అక్కడి నుండి ఆయన గలిలయలోని కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ విశ్రాంతి రోజున బోధించటం మొదలు పెట్టాడు. 32 ఆయన అధికారమున్న వానిలా బోధించటం వల్ల వాళ్ళు ఆశ్చర్యపోయారు.
33 అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలోకి వచ్చాడు. ఆ దయ్యం బిగ్గరగా, 34 “ఓ నజరేయుడైన యేసూ! మాతో నీకేంపని? మమ్మల్ని నాశనం చెయ్యటానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు” అని అన్నది. 35 యేసు, “నోరు మూసుకొని అతని నుండి బయటకు రా!” అని గద్దించాడు. ఆ దయ్యం తాను పట్టిన వాణ్ణి క్రింద పడవేసి ఏ హానీ చెయ్యకుండా ఆ దయ్యం వెలుపలికి వచ్చింది.
36 అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు పరస్పరం, “ఏమిటిది? దయ్యాలను కూడా ఆయన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడే? అవి బయటికి రావటానికి ఈయన మాటల్లో ఎంత శక్తి ఉందో కదా?” అని మాట్లాడుకున్నారు. 37 ఆ చుట్టు ఉన్న ప్రాంతాల్లో ఈయన్ని గురించి అందరికి తెలిసింది.
యేసు పేతురు అత్తను నయం చేయటం
(మత్తయి 8:14-17; మార్కు 1:29-34)
38 యేసు సమాజమందిరాన్ని వదిలి సీమోను యింటికి వెళ్ళాడు. సీమోను అత్తకు జ్వరం తీవ్రంగా ఉంది. వాళ్ళు ఆమె జ్వరాన్ని గురించి యేసుకు చెప్పారు. 39 యేసు, ఆమె దగ్గరకు వచ్చి జ్వరాన్ని వదిలి పొమ్మని గద్దించాడు. జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె లేచి అందరిని ఆదరించటం మొదలు పెట్టింది.
యేసు అనేకులను నయం చేయటం
40 సూర్యాస్తమయమౌతుండగా ప్రజలు రక రకాల రోగాలున్న వాళ్ళను ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు. ఆయన ప్రతి ఒక్కరి మీద తన చేతుల్ని ఉంచి అందరిని నయం చేశాడు. 41 “నీవు దేవుని కుమారుడవు” అని బిగ్గరగా కేకలు వేస్తూ చాలా మంది నుండి దయ్యాలు బయటకు వచ్చాయి. వాటికి తాను క్రీస్తు అని తెలియటం వల్ల యేసు వాటిని మాట్లాడవద్దని గద్దించాడు.
యేసు ఇతర పట్టణాలకు వెళ్ళటం
(మార్కు 1:35-39)
42 తెల్లవారుతుండగా యేసు గ్రామం వదిలి ఎడారిలో ఒంటరిగా ఒక ప్రత్యేక స్థలానికి వెళ్ళాడు. ప్రజలాయన కోసం వెతుకుతూ ఆయనున్న చోటికి వచ్చారు. ఆయన తమను మళ్ళీ వదిలి వెళ్ళకుండా చెయ్యాలని ప్రయత్నించారు. 43 కాని యేసు, “దేవుని రాజ్యం యొక్క సువార్త నేను యితర పట్టణాల్లో కూడా ప్రకటించాలి. దేవుడు నన్ను అందుకే పంపాడు” అని అన్నాడు.
44 ఆయన యూదయ ప్రాంతాల్లోని సమాజ మందిరాల్లో బోధించాడు.
© 1997 Bible League International