Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లూకా 2:1-24

యేసు జన్మ వృత్తాంతం

(మత్తయి 1:18-25)

ఇది యిలా వుండగా రోమా సామ్రాజ్యమంతటా జనాభా లెక్కలు సేకరించటానికి కైసరు ఔగుస్తు చక్రవర్తి ఒక ప్రకటన జారీ చేశాడు. కురేనియ సిరియ దేశాన్ని పాలిస్తున్న కాలంలో మొదటి సారిగా ఇలాంటి జనాభా లెక్కలు సేకరింపబడ్డాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ జాబితాలో తమ పేర్లు వ్రాయబడటానికి తమ స్వగ్రామాలకు వెళ్ళారు.

యోసేపు దావీదు వంశానికి చెందినవాడు కాబట్టి అతడు గలిలయలోని నజరేతు అనే పట్టణం నుండి యూదయ దేశంలోని దావీదు పట్టణానికి వెళ్ళాడు. దీన్ని బేత్లెహేము అని అనే వాళ్ళు. మరియతో ఇతనికి పెళ్ళి నిశ్చయమై ఉంది. మరియ గర్భంతో ఉంది. అతడు ఆమెను తన వెంట తీసుకొని తమ పేర్లు జాబితాలో వ్రాయించుకోటానికి వెళ్ళాడు. వాళ్ళక్కడ ఉండగా ఆమెకు ప్రసవవేదన వచ్చింది. ఆమె మగ శిశువును ప్రసవించింది. ఈయన ఆమె మొదటి కుమారుడు. వాళ్ళకు సత్రంలో గది దొరకనందువల్ల ఆమె ఆ పసివాణ్ణి పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో ఉంచింది.

గొఱ్ఱెల కాపరులు చూసిన దృశ్యం

ఊరు ప్రక్క పొలాల్లో ఉన్న గొఱ్ఱెల కాపరులు రాత్రివేళ తమ గొఱ్ఱెల్ని కాపలాకాస్తూ ఉన్నారు. ఒక దేవదూత వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ చుట్టూ దివ్యమైన వెలుగు ప్రకాశించింది. వాళ్ళు చాలా భయపడ్డారు. 10 ఆ దేవదూత వాళ్ళతో, “భయపడకండి! మీకే కాక ప్రజలందరికి ఆనందం కలిగించే సువార్త తెచ్చాను. 11 దావీదు పట్టణంలో ఈ రోజు మీకోసం రక్షకుడు జన్మించాడు. ఆయనే మన ప్రభువు. 12 మీకొక గుర్తు చెబుతాను. పశువుల తొట్టిలో, పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఒక పసివాడు మీకు కనిపిస్తాడు” అని అన్నాడు.

13 తక్షణం పరలోకంలోనుండి చాలామంది దేవదూతలు వచ్చి అక్కడున్న దేవదూతతో నిలుచొని దేవుణ్ణి స్తుతిస్తూ ఈ విధంగా అన్నారు:

14 “మహోన్నత లోకంలోవున్న దేవునికి మహా తేజస్సు కలుగుగాక!
    భూమ్మీద ఆయన ప్రేమించే ప్రజలకు శాంతి కలుగుగాక!”

15 దేవదూతలు వాళ్ళను వదిలి పరలోకానికి వెళ్ళి పొయ్యాక గొఱ్ఱెల కాపరులు, “జరిగిన దాన్ని గురించి ప్రభువు మనకు చెప్పాడు. బేత్లెహేము వెళ్ళి ఇది చూసి వద్దాం” అని మాట్లాడుకొన్నారు.

16 వాళ్ళు తక్షణం అక్కడికి వెళ్ళారు. మరియను, యోసేపును, తొట్టిలో పడుకొనివున్న పసివాణ్ణి, చూసారు. 17 ఆ బాలుణ్ణి చూసాక ఆయన్ని గురించి దేవదూత తమతో చెప్పిన విషయం అందరితో చెప్పారు. 18 వాళ్ళు చెప్పింది విని అంతా ఆశ్చర్యపోయారు. 19 కాని, మరియ యివన్నీ మనస్సులో భద్రంగా దాచుకొని వాటిని గురించి ఆలోచించేది. 20 గొఱ్ఱెల కాపరులు తాము విన్నవి, చూసినవి దేవదూత చెప్పినట్లు జరిగినందుకు వాటిని గురించి మాట్లాడుకొంటూ దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన తేజస్సును పొగుడుతూ తిరిగి వెళ్ళిపొయ్యారు.

21 ఎనిమిదవ రోజున సున్నతి చేయించి ఆ బాలునికి యేసు అని నామకరణం చేసారు. మరియ గర్భవతి కాకముందే దేవదూత ఈ పేరు మరియకు చెప్పాడు.

బాలుని దేవాలయానికి తీసుకెళ్ళటం

22 మోషే ధర్మశాస్త్రానుసారం మరియ, యోసేపులు పరిశుభ్రం కావలసిన సమయం వచ్చింది. వాళ్ళు ఆ బాలుణ్ణి ప్రభువుకు అర్పించటానికి యెరూషలేముకు వెళ్ళారు. 23 ప్రభువు యొక్క ధర్మశాస్త్రంలో, “మొదటి మగసంతానాన్ని దేవునికి సమర్పించాలి”[a] అని వ్రాయబడి ఉంది. 24 అంతేకాక, ప్రభువు యొక్క ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా వాళ్ళు వెళ్ళి రెండు పావురాలనైనా లేక రెండు గువ్వలనైనా బలి యివ్వాలనుకొన్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International