New Testament in a Year
21 బయట ప్రజా సమూహం జెకర్యా దేవాలయంలో యింతవరకు ఎందుకున్నాడో అని ఆశ్చర్యంతో అతని కోసం కాచుకొని ఉన్నారు. 22 జెకర్యా వెలుపలికి వచ్చాడు. కాని వాళ్ళతో మాట్లాడలేక పోయాడు. ఏమీ మాట్లాడలేక సంజ్ఞలు చెయ్యటం వల్ల దేవాలయంలో అతనికి దివ్య దర్శనం కలిగినదని అక్కడున్న వాళ్ళు గ్రహించారు. 23 సేవా దినములు ముగిసాక అతడు తన యింటికి వెళ్ళిపోయాడు.
24 కొన్ని రోజుల తర్వాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఐదు నెలల దాకా ఆమె గడపదాటలేదు. 25 “ప్రభువు ఈ దశలో నాకీ గర్భం యిచ్చి నన్ను అనుగ్రహించాడు; నలుగురిలో నాకున్న అవమానం తొలగించాడు” అని ఆమె అన్నది.
యేసు జన్మిస్తాడని ప్రవచనం
26 ఎలీసబెతు ఆరు నెలల గర్భంతో ఉంది. అప్పుడు దేవుడు గాబ్రియేలు అనే దేవదూతను గలిలయలోని నజరేతు అనే పట్టణంలో ఉన్న ఒక కన్య దగ్గరకు పంపాడు. 27 దావీదు వంశస్థుడైన యోసేపు అనే వ్యక్తితో ఈ కన్యకు పెళ్ళి నిశ్చయమైంది. ఈ కన్య పేరు మరియ. 28 ఈ దేవదూత ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో, “నీకు శుభం కలుగుగాక! ప్రభువు నిన్ను అనుగ్రహించాడు. ఆయన నీతో ఉన్నాడు” అని అన్నాడు.
29 దేవదూత మాటలు విని మరియ కంగారు పడి ఇతని దీవెనకు అర్థమేమిటా అని ఆశ్చర్యపడింది.
30 ఇది చూసి దేవదూత ఆమెతో యిలా అన్నాడు: “భయపడకు మరియా! దేవుడు నిన్ను అనుగ్రహించాడు. 31 నీవు గర్భం దాల్చి మగ శిశువును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెట్టు. 32 ఆయన చాలా గొప్ప వాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకు యిస్తాడు. 33 యాకోబు వంశానికి చెందిన వాళ్ళందర్ని ఈయన చిరకాలం పాలిస్తాడు. ఆయన రాజ్యం ఎన్నటికీ అంతరించదు.”
34 “నా కింకా పెండ్లి కాలేదే! ఇది ఎట్లా సాధ్యమవుతుంది?” అని మరియ దేవదూతను అడిగింది.
35 ఆ దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పాడు: “పవిత్రాత్మ నీ మీదికి వచ్చునప్పుడు సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. అందువలన నీకు పుట్టబోయే శిశువు పవిత్రంగా ఉంటాడు. ఆ శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు. 36 నీ బంధువు ఎలీసబెతు తన వృద్ధాప్యంలో తల్లి కాబోతోంది. గొడ్రాలని పిలవబడే ఆమె యిప్పుడు ఆరు నెలల గర్భంతో ఉంది. 37 దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు.”
38 మరియ, “నేను దేవుని సేవకురాలను. మీరన్న విధంగానే జరుగనీ!” అని సమాధానం చెప్పింది. ఆ తర్వాత దేవదూత వెళ్ళిపోయాడు.
© 1997 Bible League International