New Testament in a Year
యేసు తన శిష్యులు ఆయన్ను విడిచిపెడతారని చెప్పటం
(మత్తయి 26:31-35; లూకా 22:31-34; యోహాను 13:36-38)
27 యేసు వాళ్ళతో, “మీ మనస్సులు చెదరి పోతాయి. ఎందుకంటే లేఖనాల్లో,
‘నేను గొఱ్ఱెల కాపరిని కొడతాను!
గొఱ్ఱెలన్నీచెదరిపోతాయి!’(A)
అని వ్రాయబడింది. 28 కాని, నేను బ్రతికివచ్చాక మీకన్నా ముందుగా గలిలయకు వెళ్తాను” అని అన్నాడు.
29 అప్పుడు పేతురు, “అందరి విశ్వాసం పోయినా నా విశ్వాసం సన్నగిల్లదు” అని అన్నాడు.
30 యేసు సమాధానంగా, “ఇది నిజం. ఈ రోజు, అంటే ఈ రాత్రి కోడి రెండు[a] సార్లు కూయక ముందే నీవు మూడుసార్లు నేనెవరో తెలియదంటావు” అని అన్నాడు.
31 కాని పేతురు ఎన్నటికి అలా అననని అంటూ, “నేను మీతో మరణించవలసి వచ్చినా సరే నేనెప్పటికీ మీరెవరో తెలియదనను” అని అన్నాడు. మిగతా శిష్యులు కూడా అదేవిధంగా అన్నారు.
యేసు ఏకాంతంగా ప్రార్థించటం
(మత్తయి 26:36-46; లూకా 22:39-46)
32 అంతా గెత్సేమనె అనే స్థలానికి వెళ్ళారు. అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థించి వచ్చేదాకా మీరిక్కడే ఉండండి” అని అన్నాడు. 33 కాని యేసు పేతురును, యాకోబును, యోహానును, తన వెంట పిలుచుకు వెళ్ళాడు. ఆయనకు చాలా దుఃఖం,[b] ఆవేదన కలగటం మొదలుపెట్టింది. 34 ఆయన వాళ్ళతో, “నా ఆత్మ ప్రాణం పోయేటంత దుఃఖాన్ని అనుభవిస్తోంది. ఇక్కడే కూర్చొని మెలకువతో ఉండండి” అని అన్నాడు.
35 ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై మోకరిల్లి వీలైతే “ఆ ఘడియ” రాకూడదని ప్రార్థిస్తూ, 36 ఆయన, “అబ్బా తండ్రి! నీకన్నీ సాధ్యం ఈ దుఃఖాన్ని నాకు దూరంగా తీసివేయి. కాని, నెరవేరవలసింది నా కోరిక కాదు, నీది” అని అన్నాడు.
37 ఆయన వచ్చి తన శిష్యులు నిద్రిస్తుండడం చూసాడు. ఆయన పేతురుతో, “సీమోనూ! నిద్రిస్తున్నావా, ఒక గంట మేలుకో లేక పోయావా? 38 మెలకువతో ఉండండి. ప్రార్థించండి. అప్పుడే మీరు సైతాను ప్రేరణకు లోంగకుండా ఉంటారు. ఆత్మ సిద్ధమే కాని శరీరంలో బలం లేదు” అని అన్నాడు.
39 యేసు, మళ్ళీ వెళ్ళి మొదటివలే ప్రార్థించాడు. 40 ఆయన తిరిగివచ్చి శిష్యుల కళ్ళు భారంగా ఉండటంవల్ల వాళ్ళు నిద్రిస్తూ వుండటం గమనించాడు. ఆయనకు ఏం సమాధానం చెప్పాలో శిష్యులకు తోచలేదు.
41 యేసు మూడవసారి తిరిగివచ్చి వాళ్ళతో, “ఇంకా హాయిగా నిద్రిస్తున్నారా? చాలించండి. సమయం ఆసన్నమైంది. అదిగో చూడండి. మనుష్య కుమారుడు పాపులకు అప్పగింపబడుతున్నాడు. 42 లేవండి! వెళ్దాం రండి. అదిగో! ద్రోహి వస్తున్నాడు!” అని అన్నాడు.
యేసును బంధించటం
(మత్తయి 26:47-56; లూకా 22:47-53; యోహాను 18:3-12)
43 ఆయన ఇంకా మాట్లాడుతుండగా పన్నెండుగురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు పంపిన ప్రజలు కత్తులు, కర్రలు పట్టుకొని యూదా వెంట ఉన్నారు.
44 ఆ ద్రోహి వాళ్ళతో, “నేను వెళ్ళి ఎవర్ని ముద్దు పెట్టుకొంటానో[c] ఆయనే యేసు. ఆయన్ని బంధించి భటుల మధ్య ఉంచి తీసుకు వెళ్ళండి” అని వాళ్ళతో చెప్పాడు. ఆయన్ని ముద్దు పెట్టుకొని వాళ్ళకు సంజ్ఞ చేస్తానని ముందే వాళ్ళతో మాట్లాడుకొన్నాడు. 45 వెంటనే యూదా, యేసు దగ్గరకు వెళ్ళి, “రబ్బీ!” అని అంటూ ఆయన్ని ముద్దు పెట్టుకొన్నాడు. 46 వచ్చిన ప్రజలు యేసును బంధించారు. 47 యేసు ప్రక్కన నిలుచున్న వాడొకడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికి వేసాడు.
48 యేసు, “మీరు కత్తులతో, కర్రలతో వచ్చి బంధించటానికి నేనేమైనా దొంగనా? 49 నేను ప్రతిరోజు మందిరంలో బోధిస్తూ మీతో ఉన్నవాణ్ణే. అప్పుడు నన్ను ఎందుకు బంధించలేదు? కాని, లేఖనాల్లో వ్రాసింది జరిగి తీరాలి” అని అన్నాడు. 50 అప్పుడు యేసు అనుచరులందరూ ఆయన్ని ఒంటరిగా వదిలి పారిపోయారు.
51 ఒక యువకుడు యేసును అనుసరిస్తూ ఉన్నాడు. అతని వంటిమీద నడుముకు కట్టుకొన్న గుడ్డ తప్ప మరేది లేదు. ప్రజలు వానిని కూడా గభాలున పట్టుకున్నారు. కాని, 52 అతడు తన అంగీపై వేసుకొన్న గుడ్డ జారిరాగా అతడు దాన్ని వదిలి పారిపోయాడు.
మహాసభ సమక్షంలో యేసు
(మత్తయి 26:57-68; లూకా 22:54-55, 63-71; యోహాను 18:13-14, 19-24)
53 వాళ్ళు యేసును ప్రధానయాజకుని దగ్గరకు తీసుకు వెళ్ళారు. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అక్కడ సమావేశం అయ్యారు.
© 1997 Bible League International