New Testament in a Year
యూదా నాయకులు యేసును చంపుటకు కుట్ర పన్నటం
(మత్తయి 26:1-5; లూకా 22:1-2; యోహాను 11:45-53)
14 పస్కా పండుగకు, పులియబెట్టని రొట్టెల పండుగకు రెండురోజుల ముందు ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును బంధించి చంపటానికి పన్నాగం పన్నటం మొదలు పెట్టారు. 2 “కాని పండుగ రోజుల్లో కాదు. అలా చేస్తే ప్రజలు అల్లర్లు మొదలు పెట్టవచ్చు” అని మాట్లాడుకొన్నారు.
బేతనియ గ్రామంలో తైలాభిషేకం
(మత్తయి 26:6-13; లూకా 12:1-8)
3 ఆ సమయంలో యేసు బేతనియలో ఉన్నాడు. ఆయన కుష్టురోగి సీమోను ఇంట్లో భోజనానికి కూర్చొని ఉండగా, ఒక స్త్రీ ఇంట్లోకి వచ్చింది. ఆమె స్వచ్ఛమైన అగరు చెట్లనుండి చేసిన మిక్కిలి విలువైన అత్తరును ఒక చలువరాతి బుడ్డిలో తన వెంట తెచ్చింది. ఆ బుడ్డి మూత పగులగొట్టి ఆ అత్తరును యేసు తలపై పోసింది.
4 ఇది చూసి అక్కడున్న వాళ్ళలో కొందరికి కోపం వచ్చింది. వాళ్ళు పరస్పరం, “అత్తరును ఇలా వృధా చేయటం ఎందుకు? 5 దాన్ని అమ్మితే మూడు వందల దేనారాలు[a] వచ్చేవి. ఆ డబ్బు పేదవాళ్ళకు యిచ్చి ఉండవలసింది” అని ఆ స్త్రీని గూర్చి గొణుక్కున్నారు.
6 యేసు, “ఆపండి. ఆమెనెందుకు కంగారు పెడుతున్నారు. ఆమె మంచి పని చేసింది. 7 పేదవాళ్ళు మీలో ఎప్పుడూ ఉంటారు. మీ కిష్టం వచ్చినప్పుడు మీరు వాళ్ళకు సహాయం చెయ్యవచ్చు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను. 8 ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నన్ను సమాధికి సిద్ధం చేయాలని ఆమె నా దేహంపై అత్తరు పోసింది.[b] 9 ఇది నిజం. ప్రపంచంలో సువార్త ప్రకటించిన ప్రతిచోటా ఆమె జ్ఞాపకార్థంగా ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది” అని అన్నాడు.
యేసుకు ద్రోహం చెయ్యటానికి యూదా అంగీకరించటం
(మత్తయి 26:14-16; లూకా 22:3-6)
10 ఆ తర్వాత పన్నెండుగురిలో ఒకడైన యూదా ఇస్కరియోతు, యేసును ప్రధాన యాజకులకు పట్టివ్వటానికి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. 11 వాళ్ళు ఇది వినిచాలా ఆనందపడి, అతనికి డబ్బిస్తామని వాగ్దానం చేసారు. అందువల్ల యూదా యేసును పట్టివ్వటానికి తగిన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు.
పస్కా భోజనం
(మత్తయి 26:17-25; లూకా 22:7-14, 21-23; యోహాను 13:21-30)
12 పులియబెట్టని రొట్టెలపండుగ వచ్చింది. మొదటి రోజు పస్కా గొఱ్ఱెపిల్లను బలి యివ్వటం ఆచారం. ఆ రోజు యేసు శిష్యులు ఆయనతో, “ఎక్కడికి వెళ్ళి పస్కా[c] పండుగ భోజనం సిద్ధం చెయ్యమంటారు?” అని అడిగారు.
13 యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నగరంలోకి వెళ్ళండి. నీళ్ల కడవనెత్తుకొని వస్తున్న ఒక మనిషి మీకు కనిపిస్తాడు. అతణ్ణి అనుసరించండి. 14 అతడు ప్రవేశించిన యింటి యజమానితో, అతిథులు ఉండే గది ఎక్కడుందో బోధకుడు అడగమన్నాడని, ఆయన తన శిష్యులతో కలిసి ఆ గదిలో పస్కా పండుగ భోజనం చెయ్యాలని అనుకుంటున్నాడని, నేను అన్నట్లు చెప్పండి. 15 అన్ని వస్తువులతో సిద్దంగా ఉన్న మేడమీది విశాలమైన గదిని అతడు మీకు చూపుతాడు. మనకోసం అక్కడ భోజనం ఏర్పాటు చేయండి.”
16 శిష్యులు పట్టణంలోకి వెళ్ళారు. యేసు చెప్పి నట్లే అన్నీ జరిగాయి. వాళ్ళు పస్కా పండుగ భోజనం సిద్ధం చేసారు.
17 సాయంత్రం కాగానే యేసు పన్నెండుగురితో కలిసి వచ్చాడు. 18 వాళ్ళంతా బల్లముందు కూర్చొని భోజనం చేస్తూవున్నారు. అప్పుడు యేసు వాళ్ళతో, “ఇది నిజం. మీలో ఒకడు అంటే ప్రస్తుతం నాతో కూర్చొని భోజనం చేస్తున్న వాళ్ళలో ఒకడు, నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు.
19 వాళ్ళకు దుఃఖం వచ్చింది. “ఖచ్చితంగా నేను కాదుగదా ప్రభూ” అని ఒకరి తర్వాత ఒకరు ఆయనతో అన్నారు.
20 యేసు, “మీ పన్నెండుగురిలో ఒకడు, నాతో కలిసి రొట్టె గిన్నెలో ముంచేవాడు, నాకు ద్రోహం చేస్తాడు. 21 లేఖనాల్లో వ్రాసిన విధంగా మనుష్యకుమారుడు వెళ్లిపోవుచున్నాడు. కాని మనుష్యకుమారునికి ద్రోహం చేసినవాడు శాపగ్రస్తుడౌతాడు. వాడు జన్మించివుండకపోతే బాగుండేది” అని అన్నాడు.
ప్రభు రాత్రి భోజనము
(మత్తయి 26:26-30; లూకా 22:15-20; 1 కొరింథీ. 11:23-25)
22 అంతా భోజనం చేస్తుండగా, యేసు రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. దాన్ని విరిచి శిష్యులకిస్తూ, “ఇది నా దేహం, దీన్ని తీసుకొండి” అని అన్నాడు.
23 ఆ తర్వాత గిన్నె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాళ్ళకిచ్చాడు. వాళ్ళందరూ ఆ గిన్నె నుండి త్రాగారు. 24 “ఇది నా నిబంధన[d] రక్తం. ఆ రక్తాన్ని అందరికోసం కార్చాను. 25 ఇది నిజం. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి క్రొత్త ద్రాక్షారసం త్రాగేదాకా, యిప్పుడు తప్ప మరెప్పుడూ ద్రాక్షారసం త్రాగను” అని యేసు అన్నాడు.
26 వాళ్ళు ఒక భక్తిగీతం పాడాక ఒలీవల కొండ మీదికి వెళ్ళారు.
© 1997 Bible League International