New Testament in a Year
19 సాయంత్రం కాగానే ఆయన, శిష్యులు పట్టణం వదిలి వెళ్ళిపొయ్యారు.
యేసు విశ్వాస శక్తిని చూపటం
(మత్తయి 21:20-22)
20 ఉదయం ఆ దారిన నడుస్తూ వాళ్ళా అంజూరపు చెట్టు వ్రేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండటం గమనించారు. 21 పేతురుకు యేసు అన్నమాటలు జ్ఞాపకం వచ్చి యేసుతో, “రబ్బీ! అదిగో చూడండి; మీరు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది” అని అన్నాడు.
22 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుణ్ణి విశ్వసించండి. 23 ఇది నిజం. హృదయంలో అనుమానించకుండా తాను అన్నది జరుగుతుందని నమ్మి ఒక కొండతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే, అలాగే సంభవిస్తుంది. 24 అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా మీకు లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించండి. అప్పుడు మీకది లభిస్తుంది. 25 అంతేకాక, మీరు ప్రార్థించటానికి నిలుచున్నప్పుడు మీకు ఎవరితోనన్న విరోధం ఉంటే అతణ్ణి క్షమించండి. అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.” 26 [a]
యూదా నాయకులు యేసు అధికారాన్ని సందేహించటం
(మత్తయి 21:23-27; లూకా 20:1-8)
27 యేసు, ఆయన శిష్యులు యెరూషలేం చేరుకొన్నారు. ఆయన మందిరావరణంలో నడుస్తుండగా ప్రధానయాజకులు, శాస్త్రులు పెద్దలు ఆయన దగ్గరకు వచ్చారు. 28 వాళ్ళాయన్ని, “ఎవరిచ్చిన అధికారంతో నీవు వీటిని చేస్తున్నావు? ఇవి చేయటానికి అధికారమెవరిచ్చారు?” అని అడిగారు.
29 యేసు సమాధానంగా, “నన్ను ఒక్క ప్రశ్న అడుగనివ్వండి. దానికి మీరు సమాధానం చెప్పండి. అప్పుడు నేనివి ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెబుతాను. 30 యోహాను బాప్తిస్మము పరలోకంలో నుండి వచ్చినదా? లేక మానవులనుండి వచ్చినదా? సమాధానం చెప్పండి” అన్నాడు.
31 వాళ్ళు, ఆ విషయాన్ని గురించి పరస్పరం చర్చించుకొని, “మనం ‘పరలోకం నుండి’ అని అంటే, ‘మరి అలాగైతే మీరు యోహానును ఎందుకు నమ్మలేదు?’ అని అడుగుతాడు. 32 మనం ‘మానవుల నుండి’ అని అంటే ప్రజలకు మనమంటే కోపం వస్తుంది” అని అనుకున్నారు. యోహాను ఒక ప్రవక్త అని ప్రతి ఒక్కడు నమ్మటంవల్ల వాళ్ళు ప్రజలంటే భయపడ్డారు.
33 కనుక వాళ్ళు, “మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు.
యేసు, “అలాగైతే నేను కూడా యివి ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెప్పను” అని అన్నాడు.
© 1997 Bible League International