Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
మార్కు 7:14-37

14 యేసు మళ్ళీ, ప్రజల్ని తన దగ్గరకు పిలిచి, “ప్రతి ఒక్కళ్ళు ఇది వినండి. అర్థం చేసుకోండి. 15 బయట ఉన్నవేవీ మనిషి కడుపులోకి వెళ్ళి అతణ్ణి అపవిత్రం చేయవు. 16 మనిషినుండి బయటకు వచ్చేది. అతణ్ణి అపవిత్రం చేస్తొంది” అని అన్నాడు.

17 యేసు ప్రజల్ని వదిలి యింట్లోకి వెళ్ళాక ఆయన శిష్యులు ఆ ఉపమానాన్ని గురించి అడిగారు. 18 యేసు, “మీరింత అజ్ఞానులా! బయట ఉన్నది లోపలికి వెళ్ళి మనిషిని అపవిత్రం చెయ్యటం లేదని మీరు గమనించటం లేదా! 19 అది మనిషి హృదయంలోకి వెళ్ళదు. కడుపులోకి వెళ్ళి అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది” అని అన్నాడు. (యేసు ఈ విధంగా చెప్పి అన్ని ఆహార పదార్థాలు తినడానికి పవిత్రమైనవి అని సూచించాడు.)

20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “మనిషి నుండి బయటకు వచ్చేవి అతణ్ణి అపవిత్రం చేస్తాయి. 21 ఎందుకంటే, మానవుల హృదయాల నుండి దురాలోచనలు, జారత్వం, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారం, 22 లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం బయటకు వస్తాయి. 23 ఇవే లోపలనుండి బయటకు వచ్చి నరుని అపవిత్రం చేస్తాయి.”

యేసు యూదేతర స్త్రీకి సహాయం చేయటం

(మత్తయి 15:21-28)

24 యేసు ఆ ప్రాంతం వదిలి తూరు[a] ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒకరి యింటికి వెళ్ళాడు. తనక్కడ ఉన్నట్లు ఎవ్వరికి తెలియరాదని ఆయన ఉద్దేశ్యం. కాని దాన్ని రహస్యంగా ఉంచలేకపోయాడు. 25 ఒక స్త్రీ వెంటనే యేసును గురించి విన్నది. ఆమె కూతురుకు దయ్యం పట్టివుంది. ఆమె అక్కడికి వచ్చి యేసు కాళ్ళపై పడింది. 26 ఆమె గ్రీసు దేశస్తురాలు. జన్మస్థానం సిరియ దేశంలోని ఫొనీషియా. తన కూతురు నుండి ఆ దయ్యాన్ని వదిలించమని ఆమె యేసును వేడుకొంది.

27 ఆయన ఆమెతో, “మొదట చిన్నపిల్లల్ని వాళ్ళకు కావలసినవి తిననివ్వాలి. ఎందుకంటే చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకొని కుక్కలకు వేయటం సమంజసం కాదు”[b] అని అన్నాడు.

28 “ఔను! ప్రభూ! కాని, బల్లక్రిందవున్న కుక్కలు కూడా చిన్నపిల్లలు వదిలివేసిన ముక్కల్ని తింటాయి కదా!” అని ఆమె సమాధానం చెప్పింది.

29 అప్పుడు యేసు ఆమెతో, “అలాంటి సమాధానం చెప్పావు కనుక వెళ్ళు. దయ్యం నీ కూతుర్ని వదిలి వెళ్ళింది” అని అన్నాడు.

30 ఆమె యింటికి వెళ్ళి తన కూతురు పడకపై పడుకొని ఉండటం చూసింది. దయ్యం నిజంగా ఆమె నుండి వెళ్ళిపోయింది.

చెముడు, నత్తి ఉన్న వానికి నయం చేయటం

31 ఆ తర్వాత యేసు తూరు ప్రాంతం వదిలి, సీదోను వెళ్ళి అక్కడినుండి దెకపొలి ద్వారా గలిలయ సముద్రం చేరుకొన్నాడు. 32 అక్కడ కొందరు చెముడు, నత్తి ఉన్న ఒక మనిషిని యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. అతనిపై తన చేయి పెట్టమని వాళ్ళు యేసును వేడుకొన్నారు.

33 యేసు అతణ్ణి ప్రజలనుండి ప్రక్కకు పిలుచుకు వెళ్ళి తన చేతి వ్రేళ్ళను అతని చెవుల్లో ఉంచాడు. ఉమ్మివేసి ఆ వ్యక్తి యొక్క నాలుక తాకాడు. 34 ఆకాశం వైపుచూసి నిట్టూర్చి, “ఎఫ్ఫతా” అని అన్నాడు. (ఎఫ్ఫతా అంటే “తెరుచుకో” అని అర్థం.) 35 వెంటనే అతని చెవులు తెరుచుకొన్నాయి. అతని నాలుక వదులైంది. అతడు స్పష్టంగా మాట్లాడటం మొదలు పెట్టాడు.

36 యేసు దీన్ని ఎవ్వరికీ చెప్పవద్దని ఆజ్ఞాపించాడు. కాని ఆయన చెప్పినకొద్దీ వాళ్ళు దాన్ని గురించి యింకా ఎక్కువగా చెప్పారు. 37 ప్రజల ఆశ్చర్యానికి అంతులేక పోయింది. వాళ్ళు, “ఈయన అన్నీ బాగా చేస్తాడు. పైగా చెవిటివాడు వినేటట్లు, నత్తివాడు మాట్లాడేటట్లు కూడా చేస్తున్నాడు” అని అన్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International