New Testament in a Year
యేసు తన స్వగ్రామానికి వెళ్ళటం
(మత్తయి 13:53-58; లూకా 4:16-30)
6 యేసు అక్కడినుండి తన శిష్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్ళాడు. 2 విశ్రాంతి రోజు రాగానే సమాజమందిరంలో బోధించటం మొదలుపెట్టాడు. చాలామంది ఆయన చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు పరస్పరం ఈ విధంగా మాట్లాడుకొన్నారు. “ఈయన కింత జ్ఞానం ఏవిధంగా లభించింది? ఈ జ్ఞానం ఎలాంటిది? ఈయన మహత్యాలు ఎట్లా చేస్తున్నాడు. 3 ఈయన వడ్రంగి కదా! మరియ కుమారుడు కదూ! యాకోబు, యోసేపు, యూదా, సీమోనుల సోదరుడే యితడు. ఇతని చెల్లెండ్లు యిక్కడ మనతోనే ఉన్నారు కదూ!” అని అంటూ వాళ్ళు ఆయన్ని తృణీకరించారు.
4 యేసు వాళ్ళతో, “ప్రవక్తకు స్వగ్రామంలో, తన బంధువుల్లో, తన యింట్లో తప్ప అన్నిచోట్లా గౌరవం లభిస్తుంది” అని అన్నాడు. 5 యేసు కొందరు వ్యాధిగ్రస్తుల మీద తన చేతులుంచి, వాళ్ళకు నయం చేయటం తప్ప మరే మహత్యాలు అక్కడ చేయలేక పోయాడు. 6 వాళ్ళలో విశ్వాసం లేక పోవటం చూసి ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత యేసు, గ్రామ గ్రామానికి వెళ్ళి బోధించాడు.
యేసు అపోస్తలులను పంపటం
(మత్తయి 10:1, 5-15; లూకా 9:1-6)
7 ఆయన పన్నెండుగురిని పిలిచి వాళ్ళకు దయ్యాలపై అధికారమిచ్చాడు. ఇద్దరిద్దరి చొప్పున పంపుతూ, 8 వాళ్ళకు ఈ విధంగా ఉపదేశించాడు: “ప్రయాణం చేసేటప్పుడు చేతి కర్రను తప్ప మరేది తీసుకు వెళ్ళకండి. ఆహారము, సంచీ, దట్టీలో డబ్బు, తీసుకువెళ్ళకండి. 9 చెప్పులు వేసుకోండి. కాని మారు దుస్తులు తీసుకు వెళ్ళకండి. 10 ఒకరి యింటికి వెళ్ళాక ఆ గ్రామం వదిలి వెళ్ళేదాకా ఆ యింట్లోనే ఉండండి. 11 ఒక గ్రామం వాళ్ళు మీకు స్వాగతమివ్వక పోతే, లేక మీ బోధనల్ని వినకపోతే మీరా గ్రామం వదిలేముందు వాళ్ళ వ్యతిరేకతకు గుర్తుగా మీ కాలికంటిన వాళ్ళ ధూళిని దులపండి.”[a]
12 వాళ్ళు వెళ్ళి ప్రజలకు మారుమనస్సు పొందమని బోధించారు. 13 ఎన్నో దయ్యాలను వదిలించారు. చాలామంది వ్యాధిగ్రస్తులకు నూనెరాచి నయం చేసారు.
హెరోదు యేసును స్నానికుడైన యోహానని తలంచటం
(మత్తయి 14:1-12; లూకా 9:7-9)
14 యేసుకు పేరు ప్రఖ్యాతులు రావడంతో హేరోదు రాజుకు వీటిని గురించి తెలిసింది. బాప్తిస్మము[b] నిచ్చే యోహాను బ్రతికివచ్చాడని, కనుకనే మహత్వపూర్వకమైన కార్యాలు చేసేశక్తి అతనిలో ఉన్నదని అన్నాడు.
15 “ఆయన ఏలియా” అని కొందరన్నారు.
“ఆయన ప్రవక్త, పూర్వకాలపు ప్రవక్తల్లాంటివాడు” అని మరికొందరన్నారు.
16 కాని హేరోదు వీటిని గురించి విని, “నేను తల నరికించిన యోహాను బ్రతికి వచ్చాడు” అని అన్నాడు.
బాప్తిస్మము నిచ్చే యోహాను మరణం
17 క్రితంలో హేరోదు, స్వయంగా యోహానును బంధించి కారాగారంలో వేయమని ఆజ్ఞాపించాడు. తాను వివాహం చేసుకొన్న హేరోదియ కారణంగా ఈ పని చేయవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య. 18 పైగా యోహాను హేరోదుతో, “నీ సహోదరుని భార్యను చేసుకోవటం అన్యాయం” అంటూ ఉండేవాడు. 19 అందువల్ల హేరోదియకు యోహాను అంటే యిష్టం వుండేదికాదు. అంతేకాక, ఆమె అతణ్ణి చంపి వేయాలని ఆశించింది. కాని యోహాను అంటే హేరోదు భయపడేవాడు. కనుక అలాచెయ్య లేక పొయ్యాడు. 20 పైగా యోహాను నీతిమంతుడని, పవిత్రమైనవాడని హేరోదుకు తెలుసు. కనుక అతణ్ణి కాపాడుతూ వుండేవాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవరం చెందేవాడు, అయినా అతని మాటలు వినటానికి యిష్టపడేవాడు.
21 చివరకు హేరోదియకు అవకాశం లభించింది. హేరోదు తన రాజ్యంలోని ప్రముఖ అధికారులను, సైన్యాధిపతులను గలిలయలోని ప్రముఖులను పిలిచి తన పుట్టినరోజు పండుగ చేసాడు. 22 హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసింది. ఆమె హేరోదును, అతని అతిథుల్ని మెప్పించింది.
హేరోదు ఆమెతో, “నీకు కావలసింది ఏదైనా కోరుకో! యిస్తాను!” అని అన్నాడు. 23 “నీవేదడిగినా యిస్తాను, అర్ధ రాజ్యాన్నైనా సరే!” అని ప్రమాణం చేసాడు.
24 ఆమె వెళ్ళి తన తల్లితో, “నన్నేమి కోరుకోమంటావు?” అని అడిగింది.
“బాప్తిస్మము నిచ్చే యోహాను తల కోరుకో!” అని ఆమె సమాధానం చెప్పింది.
25 వెంటనే ఆమె రాజు దగ్గరకు పరుగెత్తి, “బాప్తిస్మము నిచ్చే యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి తక్షణమే యిప్పించమని మిమ్మల్ని వేడుకొంటున్నాను” అని అన్నది.
26 రాజుకు చాలా దుఃఖం కలిగింది. కాని తాను ప్రమాణం చేసాడు. పైగా అతిథులక్కడే ఉన్నారు. కనుక ఆమె కోరికను నిరాకరించ దలచుకోలేదు. 27 అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తూ ఒక భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్ళి యోహాను తలను కారాగారంలోనే నరికి వేసి, 28 దాన్ని ఒక పళ్ళెంలో పెట్టి తీసుకు వచ్చి ఆమెకు బహూకరించాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది. 29 యోహాను శిష్యులు ఇది విని అక్కడికి వెళ్ళి అతని దేహాన్ని తీసుకువెళ్ళి సమాధిచేసారు.
© 1997 Bible League International