New Testament in a Year
యేసుని శక్తి దేవునినుండి వచ్చినది
(మత్తయి 12:22-32; లూకా 11:14-23; 12:10)
20 ఆ తర్వాత యేసు యింటికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజలు సమావేశమయ్యారు. దీనితో ఆయనకు, ఆయన శిష్యులకు తినటానికి కూడా సమయం దొరకలేదు. 21 ప్రజలు “ఆయనకు మతిపోయింది” అని అంటూ ఉండటంవల్ల ఆయన బంధువులు ఆయన భారం వహించటానికి వచ్చారు.
22 యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, “అతనికి బయల్జెబూలు దయ్యం పట్టింది. దయ్యాల రాజు సహాయంతో అతడు దయ్యాలను వదిలిస్తున్నాడు” అని అన్నారు.
23 అందువల్ల యేసు వాళ్ళను గురించి, ఉపమానాలు ఉపయోగించి వారితో ఈ విధంగా అన్నాడు: “సైతాను తనను తాను ఏవిధంగా పారద్రోలుతాడు? 24 ఏ రాజ్యంలో చీలికలు వస్తాయో ఆ రాజ్యం నిలువదు. 25 కుటుంబంలో చీలికలు వస్తే ఆ కుటుంబం నిలువదు. 26 సైతాను తనకు తాను విరోధి అయి తన అధికారంతో చీలికలు తెచ్చుకొంటే ఆ సైతాను నిలవడు. వాని అధికారం అంతమౌతుంది.
27 “నిజానికి బలవంతుని యింట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని దోచుకోవాలనుకొంటే మొదట ఆ బలవంతుణ్ణి కట్టివేయవలసి వస్తుంది. అప్పుడే ఆ యింటిని దోచుకోగల్గుతాడు.
28 “నేను నిజం చెబుతున్నాను. మానవులు చేసిన అన్ని పాపాలను, వాళ్ళ దూషణలను, దేవుడు క్షమిస్తాడు. 29 కాని పవిత్రాత్మను దూషించిన వాణ్ణి దేవుడు ఎప్పటికి క్షమించడు. అతణ్ణి శాశ్వతమైన పాపం చేసిన వానిగా పరిగణిస్తాడు.”
30 ధర్మశాస్త్ర పండితులు తనలో దురాత్మ ఉందని అనటం వలన ఆయన పై విధంగా అన్నాడు.
యేసుని శిష్యులు ఆయన నిజమైన బంధువులు
(మత్తయి 12:46-50; లూకా 8:19-21)
31 యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి వచ్చారు. బయటే నిలుచుని యేసును పిలవమని ఒకణ్ణి లోపలికి పంపారు. 32 యేసు చుట్టూ జనసమూహం ఉంది. వాళ్ళు ఆయనతో, “మీ తల్లి, సోదరులు మీకోసం అడుగుతూ బయట నిలుచున్నారు” అని అన్నారు.
33 “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అని అంటూ 34 చుట్టూ కూర్చున్న వాళ్ళవైపు చూసి, “వీరే నా తల్లి, నా సోదరులు. 35 దైవేచ్చానుసారం నడుచుకొనే వాళ్ళు నా సోదరులు, నా అక్కచెల్లెండ్లు, నా తల్లి” అని అన్నాడు.
© 1997 Bible League International