New Testament in a Year
51 అదే క్షణంలో దేవాలయంలోని తెర పైనుండి క్రింది దాకా చినిగి పోయింది. భూకంపం వచ్చి బండలు పగిలి పొయ్యాయి. 52 సమాధులు తెరుచుకొన్నాయి. దేవుడు చనిపోయిన పరిశుద్ధులను అనేకుల్ని బ్రతికించాడు. 53 వాళ్ళు సమాధులనుండి వెలుపలికి వచ్చారు. యేసు బ్రతికి వచ్చాక వాళ్ళు పవిత్ర నగరాన్ని ప్రవేశించి చాలా మందికి కనిపించారు.
54 యేసును కాపలా కాస్తున్న శతాధిపతి, సైనికులు భూకంపాన్ని, జరిగిన మిగతా సంఘటల్ని చూసి చాలా భయపడిపోయి, “ఈయన నిజంగా దేవుని కుమారుడే!” అని అన్నారు.
55 చాలా మంది స్త్రీలు కొంత దూరం నుండి చూస్తూ ఉన్నారు. వీళ్ళు యేసుకు ఉపచారాలు చెయ్యటానికి గలిలయ నుండి ఆయన్ని అనుసరిస్తూ వచ్చినవాళ్ళు. 56 వాళ్ళలో మగ్దలేనే గ్రామస్తురాలైన మరియ, యాకోబు, యోసేపు అనువారి తల్లి మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు.
యేసును సమాధి చేయటం
(మార్కు 15:42-47; లూకా 23:50-56; యోహాను 19:38-42)
57 సాయంత్రం అయ్యింది. యోసేపు అనే ధనవంతుడు అరిమతయియ గ్రామం నుండి వచ్చాడు. యోసేపు కూడా యేసు శిష్యుల్లో ఒకడు. 58 అతడు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని యివ్వమని కోరాడు. పిలాతు యివ్వమని ఆజ్ఞాపించాడు. 59 యోసేపు ఆ దేహాన్ని తీసుకొని ఒక క్రొత్త గుడ్డలో చుట్టాడు. 60 ఒక పెద్ద రాయిని తొలిచి తన కోసం నిర్మించుకొన్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచాడు. ఒక రాయిని ఆ సమాధి ద్వారానికి అడ్డంగా దొర్లించి వెళ్ళిపొయాడు. 61 మగ్దలేనే మరియ, యింకొక మరియ ఆ సమాధికి ఎదురుగా అక్కడే కూర్చొని ఉన్నారు.
సమాధిని కాపలా కాయటం
62 అది విశ్రాంతికి సిద్ధమయ్యే రోజు. మరుసటి రోజు పరిసయ్యులు పిలాతు సమక్షంలో సమావేశమయ్యారు, 63 “అయ్యా! ఆ మోసగాడు బ్రతికి ఉండగా ‘మూడు రోజుల్లో నేను తిరిగి బ్రతికి వస్తాను’ అని అనటం మాకు జ్ఞాపకం ఉంది. 64 అందువల్ల మూడవ రోజు వరకు ఆ సమాధిని జాగ్రత్తగా కాపలా కాయమని ఆజ్ఞాపించండి. అలా చెయ్యకపోతే అతని శిష్యులు వచ్చి అతని దేహాన్ని దొంగిలించి, ‘అతడు బ్రతికాడు’ అని ప్రజలతో చెప్పవచ్చు. ఈ చివరి మోసం మొదటి మోసం కన్నా ఘోరంగా ఉంటుంది” అని అన్నారు.
65 పిలాతు, “భటుల్ని తీసుకు వెళ్ళండి. వాళ్ళు సమాధిని జాగ్రత్తగా కాపలా కాయటం మీ బాధ్యత” అని చెప్పాడు. 66 వాళ్ళు వెళ్ళి రాతికి ముద్రవేసి భటుల్ని ఆ సమాధికి కాపలా ఉంచి దాన్ని భద్రం చేసారు.
© 1997 Bible League International