New Testament in a Year
29 “ఆ కష్టకాలం గడిచిన వెంటనే,
‘దేవుడు సూర్యుణ్ణి చీకటిగా చేస్తాడు.
చంద్రుడు వెలుగునివ్వడు
నక్షత్రాలు ఆకాశంనుండి రాలిపోతాయి
ఆకాశంలోని శక్తులు కదలిపోతాయి.’[a]
30 “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూమ్మీద ఉన్న దేశాలన్నీ దుఃఖిస్తాయి. మనుష్యకుమారుడు శక్తితో, గొప్ప తేజస్సుతో ఆకాశంలోని మేఘాలపై రావటం వాళ్ళు చూస్తారు. 31 అప్పుడు దేవుడు తన దూతల్ని గొప్ప బూరధ్వనితో పంపుతాడు. ఆ దూతలు నలువైపుల నుండి అంటే, ఆ చివరి నుండి ఈ చివరిదాకా గాలించి దేవుడెన్నుకొన్న వాళ్ళను ప్రోగు చేస్తారు.
32 “ఇక ఇప్పుడు అంజూరపు చెట్టు ఉపమానాన్ని గురించి నేర్చుకొండి. వాటి రెమ్మలు మృదువై ఆకులు చిగురించగానే, ఎండకాలం దగ్గరకు వచ్చిందని మీకు తెలిసి పోతుంది. 33 అదే విధంగా నేను చెప్పినవన్నీ చూసిన వెంటనే ఆయన దగ్గరలోనే ఉన్నాడని అంటే మీ తలుపు ముందే ఉన్నాడని తెలుసుకొంటారు. 34 ఇది సత్యం. ఇవన్నీ జరిగేదాకా ఈ తరం వాళ్ళు జీవించే ఉంటారు. 35 భూమి, ఆకాశము నశించి పోతాయి కాని నా మాటలు శాశ్వతంగా నిలిచి పోతాయి!
ఆ దినం కాని, ఆ ఘడియ కాని ఎవ్వరికీ తెలియదు
(మార్కు 13:32-37; లూకా 17:26-30, 34-36)
36 “ఆ రోజును గురించి లేక ఆ ఘడియను గురించి పరలోకంలోని దేవ దూతలకు గాని, కుమారునికి గాని ఎవ్వరికి తెలియదు. తండ్రికి మాత్రం తెలుసు.
37 “నోవహు కాలంలో ఏ విధంగా ఉందో మనుష్యకుమారుడు వచ్చినప్పుడు కూడా అదే విధంగా వుంటుంది. 38 నోవహు తన నావలో ప్రవేశించేదాకా, ప్రళయానికి ముందు రోజుల్లో ప్రజలు తింటూ, త్రాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకొంటూ, పెళ్ళిళ్ళు చేస్తూ జీవించారు. 39 ప్రళయం వచ్చి వాళ్ళందరూ కొట్టుకొని పోయేదాకా ఆ విధంగా జరుగుతుందని వాళ్ళకు తెలియదు.
“మనుష్యకుమారుడు కూడా అదే విధంగా అకస్మాత్తుగా వస్తాడు. 40 ఆ రోజు ఇద్దరు వ్యక్తులు పొలంలో పని చేస్తూవుంటే ఒకడు ఆయన వెంట తీసుకు పోబడతాడు. రెండవ వాడు వదిలి వేయబడతాడు. 41 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే ఒక స్త్రీని తన వెంట తీసుకువెళ్తాడు. రెండవ స్త్రీని వదిలి వేస్తాడు.
42 “మీ ప్రభువు ఏ రోజు రానున్నాడో మీకు తెలియదు కనుక సిద్ధముగా ఉండండి. 43 కాని ఈ విషయం తెలుసుకొండి. ఇంటి యజమానికి దొంగ ఎప్పుడు వస్తాడో తెలిసి ఉంటే, తన యింట్లోకి దొంగను రానీయకుండా కాపలాకాస్తాడు. 44 మనుష్య కుమారుడు కూడా మీరు అనుకోని ఘడియలో వస్తాడు. కనుక మీరు కూడా అదే విధంగా సిద్ధంగా ఉండాలి.
మంచి దాసుడు, చెడ్డ దాసుడు
(లూకా 12:41-48)
45 “విశ్వాసము, తెలివిగల ఒక సేవకుణ్ణి ఉదాహరణగా తీసుకోండి. అతని యజమాని అతణ్ణి తన యింట్లో పనిచేసే వాళ్ళకు సరియైన సమయంలో భోజనం పెట్టడానికి నియమించాడు. 46 యజమాని వచ్చినప్పుడు ఆ సేవకుడు తన యజమాని చెప్పినట్లు చేస్తూవుంటే ధన్యుడు. 47 నేను మీకు నిజం చెబుతున్నాను: యజమాని ఆ నౌకరును తనకున్న ఆస్తి అంతటిపై అధికారిగా నియమిస్తాడు.
48 “ఒక వేళ ఆ సేవకుడు దుర్మార్గుడైతే తనలో తాను ‘నా యజమాని త్వరలో రాడు’ అని అనుకొని 49 తన తోటి పని వాళ్ళను కొట్టడం మొదలు పెడ్తాడు. అంతేకాక త్రాగుబోతులతో కలసి తిని, త్రాగుతాడు. 50 యజమాని తన సేవకుడు ఎదురు చూడని రోజు, అతనికి తెలియని ఘడియలో వచ్చి, 51 అతణ్ణి చంపించి పాపులతో సహా నరకంలో పడవేస్తాడు. ఆ నరకంలో వాళ్ళంతా ఏడుస్తూ పండ్లు కొరుకుతూ బాధననుభవిస్తారు.
© 1997 Bible League International