Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
మత్తయి 14:1-21

హెరోదు యేసును స్నానికుడైన యోహానని తలంచటం

(మార్కు 6:14-29; లూకా 9:7-9)

14 ఆ కాలంలో గలిలయకు అధిపతియైన హేరోదు యేసును గురించి విన్నాడు. అతడు తన పరిచారకులతో, “ఇతడు బాప్తిస్మమునిచ్చే యోహాను అని నా నమ్మకం. అతడు బ్రతికి వచ్చాడు. కనుకనే అద్భుతాలు చేసే శక్తి ఆయనలోవుంది” అని అన్నాడు.

యోహాను తల నరకటం

అలా ఎందుకన్నాడంటే కొంతకాలానికి ముందు హేరోదు యోహానును బంధించి కారాగారంలో వేసాడు. ఇలా జరగటానికి కారణం హేరోదియ. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పుకు భార్య. పైగా యోహాను హేరోదుతో, “నీవామెతో కలసి జీవించటం న్యాయం కాదు!” అని అనేవాడు. ఈ కారణంగా హేరోదు యోహానును చంపాలనుకున్నాడు. కాని ప్రజలు యోహానును ఒక ప్రవక్తగా పరిగణించేవారు కనుక హేరోదు వాళ్ళను చూసి భయపడి పోయాడు.

హేరోదు పుట్టిన రోజు పండుగ జరిగింది. ఆరోజు హేరోదియ కుమార్తె సభలో నాట్యం చేసి హేరోదును మెప్పించింది. అందువల్ల అతడు ఆమె అడిగింది యిస్తానని వాగ్దానం చేసాడు. ఆమె తన తల్లి ప్రోద్బలంతో, “బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి నాకివ్వండి” అని అడిగింది.

ఇది విన్న రాజుకు దుఃఖం కలిగింది. కాని వాగ్దానం చేయటం వల్ల, అతిథులు అక్కడే ఉండటంవల్ల ఆమె కోరిక తీర్చమని ఆజ్ఞాపించాడు. 10 వెంటనే భటుణ్ణి పంపి కారాగారంలో ఉన్న యోహాను తల నరికి వేయించాడు. 11 ఒక భటుడు యోహాను తలను ఒక పళ్ళెంలో తీసుకు వచ్చి ఆమెకిచ్చాడు. ఆమె దాన్ని తన తల్లి దగ్గరకు తీసుకు వెళ్ళింది. 12 యోహాను శిష్యులు వచ్చి అతని దేహాన్ని తీసుకు వెళ్ళి సమాధి చేసారు. ఆ తర్వాత వెళ్ళి యేసుతో చెప్పారు.

అయిదువేల మందికి భోజనం

(మార్కు 6:30-44; లూకా 9:10-17; యోహాను 6:1-14)

13 జరిగింది విని యేసు పడవనెక్కి ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన సమాచారం విని ప్రజలు గుంపులు గుంపులుగా పట్టణాలనుండి వచ్చి కాలినడకన ఆయన్ని అనుసరించారు. 14 యేసు పడవనుండి దిగి ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడ ఉండటం చూసాడు. ఆయనకు జాలి వేసింది. వాళ్ళలో రోగాలున్న వాళ్ళను ఆయన బాగు చేసాడు.

15 సాయంకాలం కాగానే శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఈ ప్రదేశం ఏమూలో ఉంది, పైగా ఇప్పటికే చాలా ప్రొద్దుపోయింది. వీళ్ళను పంపి వేయండి. గ్రామాల్లోకి వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారు” అని అన్నారు.

16 యేసు, “వాళ్ళు వెళ్ళనక్కరలేదు. తినటానికి మీరే ఏదైనా యివ్వండి.” అని వాళ్ళతో అన్నాడు.

17 “మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

18 “వాటిని ఇక్కడకు తీసుకు రండి” అని యేసు అన్నాడు. 19 ఆ తర్వాత ప్రజల్ని అక్కడున్న పచ్చిక బయళ్ళలో కూర్చోమని అన్నాడు. ఆ అయిదు రొట్టెల్ని, రెండు చేపల్ని తీసికొని ఆకాశం వైపు చూసి దేవునికి స్తోత్రం చెల్లించాడు. ఆ రొట్టెను విరచి తన శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు పంచారు. 20 అందరూ కడుపు నిండా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపారు. 21 స్త్రీలు, పిల్లలే కాకుండా అయిదువేల మంది దాకా పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International