Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
మత్తయి 6:19-34

నీవు ఇద్దరు యజమానులను సేవించలేవు

(లూకా 12:33-34; 11:34-36; 16:13)

19 “మీకోసం ఈ ప్రపంచంలో ధనాన్ని కూడబెట్టుకోకండి. ఇక్కడ ఆ ధనానికి చెదలు పడుతుంది. తుప్పు ఆ ధనాన్ని తినివేస్తుంది. దొంగలు పడి దోచుకొంటారు. 20 మీ ధనాన్ని పరలోకంలో కూడబెట్టుకొండి. అక్కడ చెదలు పట్టవు, తుప్పు తినివేయదు. దొంగలు పడి దోచుకోరు. 21 మీ సంపద ఎక్కడ ఉంటే మీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది.

22 “కన్ను శరీరానికి ఒక దీపంలాంటిది. మీ కళ్ళు బాగుంటే మీ శరీరమంతా వెలుగుగా ఉంటుంది. 23 మీ కళ్ళు బాగుండకపోతే మీ శరీరమంతా చీకటైపోతుంది. మీలో ఉన్న వెలుగే చీకటై పోతే ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో కదా.

24 “ఒకే వ్యక్తి యిద్దరు యజమానులకు సేవ చేయలేడు. అలా చేస్తే అతడు ఒకణ్ణి ప్రేమించి, యింకొకణ్ణి ద్వేషిస్తూ ఉంటాడు. లేదా ఒకనికి అతిశ్రద్ధతో సేవ చేసి, యింకొకణ్ణి అశ్రద్ధ చేస్తాడు. మీరు దేవునికి, డబ్బుకు సేవకునిగా ఉండటమనేది అసంభవం.

మొదట దేవుని రాజ్యం

(లూకా 12:22-34)

25 “అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీ జీవితాలకు కావలసిన ఆహారాన్ని గురించి కాని, మీ దేహాలకు కావలసిన దుస్తుల్ని గురించి కాని చింతించకండి. జీవితం ఆహారం కన్నా, దేహం దుస్తులకన్నా, ముఖ్యమైనవి కావా? 26 ఆకాశంలో ఎగిరే పక్షుల్ని గమనించండి. అవి విత్తనం విత్తి పంటను పండించవు. ధాన్యాన్ని ధాన్యపు కొట్టులో దాచివుంచవు. అయినా పరలోకంలోవున్న మీ తండ్రి వాటికి ఆహారాన్ని యిస్తాడు. మీరు వాటికన్నా విలువైన వాళ్ళు కారా! 27 చింతించి తన జీవితకాలాన్ని ఒక్క ఘడియ పొడిగించగలవాడు మీలో ఎవరైనా ఉన్నారా?

28 “మీరు దుస్తుల్ని గురించి ఎందుకు చింతిస్తున్నారు? గడ్డిమీద పెరిగే పువ్వుల్ని గమనించండి. అవి పని చేసి దారాన్ని వడకవు. 29 అయినా, నేను చెప్పేదేమిటంటే గొప్ప వైభవమున్న సొలొమోను రాజుకూడా అలంకరణలో ఈ పువ్వుల్లోని ఒక్క పువ్వుతో కూడా సరితూగలేడు. 30 ఈనాడు ఉండి రేపు మంటల్లో పారవేయబడే ఈ గడ్డిని దేవుడంత అందంగా అలంకరిస్తే మిమ్మల్ని యింకెంత అందంగా అలంకరిస్తాడో కదా! మీలో దృఢ విశ్వాసం లేదు.

31 “‘ఏమి తినాలి? ఏమి త్రాగాలి? ఏ దుస్తుల్ని వేసుకోవాలి?’ అని చింతించకండి. 32 యూదులు కానివాళ్ళు వాటివైపు పరుగెత్తుతూ ఉంటారు. పరలోకంలో ఉన్న మీ తండ్రికి యివన్నీ మీకవసరమని తెలుసు. 33 కాని మొదట ఆయన రాజ్యం కొఱకు, నీతి కొఱకు ప్రయాస పడండి; అప్పుడు అవన్నీ దేవుడు మీకిస్తాడు. 34 రేపటిని గురించి చింతించకండి. రేపటి చింత రేపటిదే. ఏరోజుకు తగ్గ కష్టాలు ఆరోజుకు ఉన్నాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International