New Testament in a Year
ఇశ్రాయేలు చరిత్ర నుండి హెచ్చరికలు
10 సోదరులారా! ఈ సత్యమును గ్రహించకుండా యుండుట నాకిష్టం లేదు. మన పూర్వికులు మేఘం క్రింద యుండిరి. సముద్రాన్ని చీల్చి ఏర్పరచబడిన దారి మీద వాళ్ళు నడిచి వెళ్ళారు. 2 వాళ్ళు మేఘంలో, సముద్రంలో బాప్తిస్మము పొందాక, మోషేలోనికి ఐక్యత పొందారు. 3 అందరూ ఒకే ఆత్మీయ ఆహారం తిన్నారు. 4 అందరూ ఒకే విధమైన ఆత్మీయ నీటిని త్రాగారు. ఈ నీటిని వాళ్ళ వెంటనున్న ఆత్మీయమైన బండ యిచ్చింది. ఆ బండ క్రీస్తే. 5 అయినా వాళ్ళలో కొందరు మాత్రమే దేవునికి నచ్చిన విధంగా జీవించారు. మిగతావాళ్ళు ఎడారిలో చనిపొయ్యారు.
6 వాళ్ళలా మనం చెడు చేయరాదని వారించటానికి ఇవి దృష్టాంతాలు. 7 కొందరు పూజించినట్లు మీరు విగ్రహాలను పూజించకండి. ధర్మశాస్త్రంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ప్రజలు తిని, త్రాగటానికి కూర్చొన్నారు. లేచి నృత్యం చేసారు.”(A) 8 మనం వాళ్ళు చేసినట్లు వ్యభిచారం చేయరాదు. వ్యభిచారం చెయ్యటం వల్ల ఒక్క రోజులో వాళ్ళలో ఇరవై మూడు వేలమంది మరణించారు. 9 వాళ్ళు ప్రభువును శోధించిన విధంగా మనం శోధించరాదు. పరీక్షించిన వాళ్ళను పాములు చంపివేసాయి. 10 వాళ్ళవలె సణగకండి. సణగిన వాళ్ళను మరణదూత చంపివేశాడు.
11 మనకు దృష్టాంతముగా ఉండాలని వాళ్ళకు ఇవి సంభవించాయి. మనల్ని హెచ్చరించాలని అవి ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డాయి. ఈ యుగాంతములో బ్రతుకుతున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడ్డాయి. 12 కనుక గట్టిగా నిలుచున్నానని భావిస్తున్నవాడు క్రింద పడకుండా జాగ్రత్త పడాలి. 13 మానవులకు సహజంగా సంభవించే పరీక్షలు తప్ప మీకు వేరే పరీక్షలు కలుగలేదు. దేవుడు నమ్మకస్థుడు. భరించగల పరీక్షలకన్నా, పెద్ద పరీక్షలు మీకు ఆయన కలుగనీయడు. అంతేకాక, పరీక్షా సమయం వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని జయం పొందే మార్గం కూడా దేవుడు చూపుతాడు.
14 కనుక నా ప్రియ మిత్రులారా! మీరు విగ్రహారాధనకు దూరంగా ఉండండి. 15 మీరు తెలివిగలవాళ్ళు కనుక ఇలా మాట్లాడుతున్నాను. నేను చెపుతున్న వాటిని గురించి మీరే నిర్ణయించండి 16 మనము కృతజ్ఞతతో దీవెన పాత్రనుండి త్రాగటం క్రీస్తు రక్తాన్ని పంచుకోవటము కదా? మనము విరిచిన రొట్టెను పంచుకోవటము క్రీస్తు శరీరాన్ని పంచుకోవటము కదా? 17 రొట్టె ఒకటే గనుక ఆ ఒకే రొట్టెలో పాలుపొందే మనం అనేకులమైనప్పటికిని ఒకే శరీరమైయున్నాము.
18 ఇశ్రాయేలు ప్రజల్ని చూడండి. బలి ఇచ్చినదాన్ని తినేవాళ్ళు బలిపీఠానికి భాగస్వాములు కారా?
© 1997 Bible League International