New Testament in a Year
ఎఫెసులో పౌలు
19 అపొల్లో యింకా కొరింథులోనే ఉన్నాడు. పౌలు భూమార్గం ద్వారా ప్రయాణం చేసి ఎఫెసు చేరుకున్నాడు. అక్కడ కొంత మంది శిష్యుల్ని కలుసుకొని 2 వాళ్ళతో, “మీరు విశ్వసించిన పిదప పవిత్రాత్మను పొందారా?” అని అడిగాడు.
వాళ్ళు, “లేదు! పవిత్రాత్మ ఉన్నాడనేది కూడా మేము వినలేదు” అని సమాధానం చెప్పారు.
3 పౌలు, “మీరు ఎలాంటి బాప్తిస్మం పొందారు?” అని అడిగాడు.
“యోహాను బాప్తిస్మం” అని వాళ్ళు చెప్పారు.
4 పౌలు, “యోహాను మారుమనస్సుకు సంబంధించిన బాప్తిస్మము నిచ్చాడు. అతడు, తన తర్వాత రానున్నవాణ్ణి, అంటే యేసును నమ్మమని ప్రజలకు బోధించాడు కదా!” అని అన్నాడు.
5 ఇది విన్నాక వాళ్ళు యేసు ప్రభువు పేరిట బాప్తిస్మము పొందారు. 6 పౌలు తన చేతుల్ని వాళ్ళ తలలపై ఉంచగానే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదికి వచ్చాడు. వాళ్ళంతా తమకు రాని భాషల్లో మాట్లాడారు. దేవుడు ప్రేరేపించిన సత్యాలు ప్రకటించారు. 7 అక్కడ మొత్తం పన్నెండు మంది ఉన్నారు.
8 పౌలు యూదుల సమాజమందిరానికి మూడు నెలలు వెళ్ళాడు. దేవుని రాజ్యాన్ని గురించి ధైర్యంగా వాదించి వాళ్ళను ఒప్పించటానికి ప్రయత్నించాడు. 9 కాని కొందరు నమ్మలేదు. తమ పట్టు వదులుకోలేదు. పైగా ప్రభువు చూపిన మార్గాన్ని బహిరంగంగా దూషించారు. అందువల్ల పౌలు వాళ్ళను వదిలి, శిష్యుల్ని తన వెంట పిలుచుకు వెళ్ళాడు. అతడు, తురన్ను ఉపన్యాస శాలలో ప్రతి రోజూ తర్కించేవాడు. 10 ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి. ఫలితంగా ఆసియ ప్రాంతాల్లో నివసిస్తున్న యూదులు, గ్రీకులు అందరూ ప్రభువు సందేశాన్ని విన్నారు.
స్కెవ కుమారులు
11 దేవుడు పౌలు ద్వారా ఎన్నో మహత్కార్యాలు చేసాడు. 12 ప్రజలు అతడు తాకిన జేబు రుమాళ్ళను, తుండు గుడ్డల్ని తీసుకొని జబ్బుతో ఉన్నవాళ్ళ దగ్గరకు వెళ్ళేవాళ్ళు. వాటితో వాళ్ళ జబ్బులు నయమయ్యేవి. పట్టిన దయ్యాలు వదిలిపొయ్యేవి.
13 చుట్టూ ఉన్న ప్రాంతాలలో తిరిగి దయ్యాల్ని వదిలిస్తున్న కొందరు యూదులు యేసు ప్రభువు పేరునుపయోగించి దయ్యాలు పట్టినవాళ్ళకు నయం చెయ్యటానికి ప్రయత్నించారు. వాళ్ళు, “పౌలు ప్రకటిస్తున్న యేసు పేరిట ఆజ్ఞాపిస్తున్నాము. బయటకు రా!” అని అనేవాళ్ళు. 14 స్కెవ అనే యూదుల ప్రధానయాజకుడు, అతని ఏడుగురు కుమారులు యిలా చేసేవాళ్ళు.
15 ఒకసారి ఆ దయ్యం, “యేసు ఎవరో నాకు తెలుసు. పౌలు ఎవరో నాకు తెలుసు. కాని మీరెవరు?” అని అడిగింది.
16 ఆ దయ్యం పట్టిన వాడు వాళ్ళ మీద పడి వాళ్ళను బాగా కొట్టాడు. వాళ్ళు రక్తం కార్చుకొంటూ ఆ యిల్లు వదిలి దిగంబరంగా పారిపోయారు.
17 ఎఫెసులో నివసిస్తున్న యూదులకు, గ్రీకులకు ఈ విషయం తెలిసింది. వాళ్ళందరూ భయపడి యేసు ప్రభువు నామాన్ని చాలా గౌరవించటం మొదలు పెట్టారు. 18 ఇది జరిగాక చాలా మంది తాము చేసిన వాటిని బహిరంగంగా ఒప్పుకోవటం మొదలు పెట్టారు. 19 మంత్ర విద్య నేర్చిన కొందరు తమ గ్రంథాల్ని తెచ్చి అందరి సమక్షంలో వాటిని కాల్చి వేసారు. ఆ తదుపరి వాళ్ళు తాము కాల్చిన గ్రంథాల వెలగట్టి వాటి వెల సుమారు యాభై వేల ద్రాక్మాలని[a] నిర్ణయించారు. 20 ఈ విధంగా ప్రభువు సందేశం బాగా వ్యాపించింది. దాని ప్రభావం అభివృద్ధి చెందుతూ వచ్చింది.
© 1997 Bible League International