New Testament in a Year
యూదులుకాని భక్తులకు లేఖ
22 అపొస్తలులు, పెద్దలు, సంఘసభ్యులు, అంతా కలిసి సంఘంనుండి కొందర్ని ఎన్నుకొని పౌలు, బర్నబాతో సహా వాళ్ళను అంతియొకయకు పంపారు. సోదరుల్లో ముఖ్యులైన బర్సబ్బా అని పిలువబడే యూదాను, సీలను ఎన్నుకొని 23 వాళ్ళ వెంట ఈ లేఖను పంపారు:
మీ సోదరులైన అపొస్తలులనుండి, పెద్దలనుండి,
అంతియొకయ, సిరియ, కిలికియ పట్టణాల్లోని యూదులుకాని సోదరులకు, శుభం!
ప్రియ సహోదరులారా!
24 మా అనుమతి లేకుండా మాలో కొందరు అక్కడికి వచ్చి తమ మాటల్తో మీలో అశాంతి కలిగించి మీ మనస్సుల్ని పాడుచేసారని విన్నాము. 25 మా ప్రియమిత్రులైన బర్నబాతో, పౌలుతో కొందర్ని మీ వద్దకు పంపాలని మేమంతా కలిసి నిర్ణయించాము. 26 వీళ్ళు మన యేసు క్రీస్తు ప్రభువు కోసం తమ ప్రాణాల్ని తెగించినవాళ్ళు. 27 అందువల్ల, మేము వ్రాస్తున్నవి తమ నోటి ద్వారా మీకు తెలపాలని యూదాను, సీలను పంపుతున్నాము. 28 ఈ నియమాల్ని తప్ప మిగతా నియమాల్ని మీపై మోపటం భావ్యంకాదని పవిత్రాత్మకు, మాకు అనిపించింది:
29 విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారాన్ని,
గొంతు నులిమి చంపిన జంతువుల మాంసాన్ని, జంతువుల రక్తాన్ని ముట్టకండి.
లైంగిక పాపము చేయకండి.
ఇలా వీటికి దూరంగా ఉండటంవల్ల మీలో సత్ప్రవర్తన కలుగుతుంది.
వీడ్కోలు.
30 వాళ్ళు సెలవు తీసుకొని అంతియొకయకు వెళ్ళారు. యేసు భక్తులందర్ని పిలిచి వాళ్ళకీ లేఖనిచ్చారు. 31 ప్రోత్సాహపరిచే ఈ లేఖను చదివి ప్రజలు చాలా ఆనందించారు. 32 యూదా, సీల కూడా ప్రవక్తలు కాబట్టి ఆ ఊరి సోదరులతో చాలా సేపు మాట్లాడి వాళ్ళను ప్రోత్సాహపరిచి ఆధ్యాత్మికంగా బలపరిచారు. 33 వాళ్ళక్కడ కొద్ది రోజులు గడిపారు. ఆ తదుపరి అక్కడి సోదరులు, “శాంతి కలుగుగాక” అని కోరుతూ వాళ్ళకు వీడ్కోలు చెప్పారు. వీళ్ళు తమను పంపిన వాళ్ళ దగ్గరకు తిరిగి వెళ్ళిపోయారు. 34 “కాని సీల అక్కడే ఉండిపోవాలనుకొన్నాడు.”[a]
35 పౌలు, బర్నబా అంతియొకయలో కొద్ది రోజులు గడిపారు. వీళ్ళు, యింకా అనేకులు కలిసి ప్రభువు సందేశాన్ని ఉపదేశించి బోధించారు.
పౌలు, బర్నబా విడిపోవటం
36 కొంతకాలం తర్వాత పౌలు బర్నబాతో, “ప్రభువు సందేశాన్ని ఉపదేశించిన ప్రతి పట్టణానికి, మనం మళ్ళీ వెళ్దాం. అక్కడి సోదరుల్ని కలుసుకొని వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో చూసి వద్దాం” అని అన్నాడు.
37 బర్నబా, మార్కు అని పిలివబడే యోహానును కూడా తమ వెంట పిలుచుకు వెళ్దామనుకొన్నాడు. 38 కాని తమతో పని చెయ్యకుండా తమను పంఫూలియలో వదిలి వేసాడు కాబట్టి పౌలు అతణ్ణి పిలుచుకు వెళ్ళటం మంచిది కాదనుకొన్నాడు. 39 బర్నబా, పౌలు మధ్య తీవ్రమైన వివాదము కలగటం వల్ల వాళ్ళు విడిపోయారు. బర్నబా మార్కును తన వెంట పిలుచుకొని ఓడలో సైప్రసుకు వెళ్ళాడు.
40 పౌలు, సీలను తన వెంట పిలుచుకొని వెళ్ళాడు. అక్కడున్న సోదరులు అతనికి ప్రభువు అనుగ్రహం కలగాలని దీవించి ప్రభువుకు అప్పగించారు. 41 అతడు సిరియ, కిలికియ పట్టణాల ద్వారా ప్రయాణం చేసి అక్కడి సంఘాలను ఆధ్యాత్మికంగా బలపరిచాడు.
© 1997 Bible League International