Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లూకా 8:26-56

యేసు ఒక మనుష్యుని దయ్యాలనుండి విడిపించటం

(మత్తయి 8:28-34; మార్కు 5:1-20)

26 యేసు మరియు ఆయన శిష్యులు గెరాసేనులు అనే ప్రజలు నివసించే ప్రాంతాన్ని చేరుకున్నారు. ఆ ప్రాంతం గలిలయ సముద్రానికి అవతలి వైపున ఉంటుంది. 27 యేసు ఒడ్డు చేరగానే దయ్యం పట్టిన ఆ ఊరి వాడొకడు యేసు దగ్గరకు వచ్చాడు. చాలాకాలం నుండి అతడు బట్టలు వేసుకొనేవాడు కాదు. ఇంట్లో నివసించే వాడు కాదు. స్మశానాల్లో నివసించేవాడు.

28 ఆ దయ్యం పట్టినవాడు యేసును చూడగానే పెద్ద గొంతుతో, “యేసూ! దేవుని కుమారుడా! నాతో నీకేం పని? నన్ను హింసించవద్దని వేడుకొంటున్నాను” అని బిగ్గరగా అంటూ ఆయన కాళ్ళ మీద పడ్డాడు. 29 యేసు ఆ దయ్యాన్ని అతని నుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఈ దయ్యం అతణ్ణి చాలాసార్లు ఆవరించింది. అతని కాళ్ళు చేతులు గొలుసులతో కట్టేసి కాపలాలోవుంచేవాళ్ళు. అయినా అతడు ఆ గొలసులను తెంపుకొనేవాడు. ఆ దయ్యం అతణ్ణి నిర్మానుష్య స్థలాలకు లాక్కొని వెళ్ళేది.

30 యేసు, “నీ పేరేమిటి?” అని అడిగాడు.

అతడు, “సేన” అని సమాధానం చెప్పాడు. ఎన్నో దయ్యాలు వానిలో ఉండటం వల్ల ఈ విధంగా సమాధానం చెప్పాడు. 31 ఆ దయ్యాలు తమను పాతాళం లోకి పడవేయ వద్దని ఎంతో ప్రాధేయ పడ్డాయి. 32 అక్కడ కొండ మీద ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. ఆ దయ్యాలు, తాము ఆ పందుల్లోకి వెళ్ళేటట్లు అనుమతి యివ్వుమని యేసును వేడుకున్నాయి. ఆయన అనుమతినిచ్చాడు. 33 ఆ దయ్యాలు ఆ మనిషి నుండి బయటకు వచ్చి పందుల్లోకి జొరబడ్డాయి. ఆ తర్వాత అవి ఆ కొండనుండి క్రిందికి పరుగెత్తి సముద్రంలో పడి మునిగి పొయ్యాయి.

34 పందులు కాస్తున్న వాళ్ళు జరిగింది చూసి పరుగెత్తి వెళ్ళి గ్రామంలో ఉన్న వాళ్ళకు, పొలాల్లో ఉన్న వాళ్ళకు చెప్పారు. 35 ప్రజలు ఏమి జరిగిందో చూడాలని అక్కడికి వెళ్ళారు. అంతా యేసు దగ్గరకు వచ్చారు. అక్కడ దయ్యాలు వదిలింపబడ్డవాడు యేసు కాళ్ళ దగ్గరవుండటం వాళ్ళు చూశారు. అతని ఒంటిపై దుస్తులువున్నాయి. అతని ప్రవర్తన సహజంగా ఉంది. ఇది గమనించి వాళ్ళకు భయం వేసింది. 36 జరిగింది చూసిన వాళ్ళు ఆ దయ్యం పట్టినవానికి ఏ విధంగా నయమైపోయిందో వచ్చిన వాళ్ళకు చెప్పారు. 37 గెరాసేను ప్రజలందరికి చాలా భయం వేయటంవల్ల తమ ప్రాంతం వదిలి వెళ్ళమని వాళ్ళు యేసుతో అన్నారు.

అందువల్ల ఆయన పడవనెక్కి వెళ్ళిపోయాడు. 38 దయ్యాలు వదిలింపబడ్డ వాడు వెంటవస్తానని యేసును బ్రతిమిలాడాడు. 39 యేసు అతనితో, “నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు చేసిన మేలు అందరికి చెప్పు” అని అతణ్ణి పంపివేసాడు.

అందువల్ల అతడు వెళ్ళి యేసు తనకు చేసిన మేలు తన గ్రామంలో ఉన్న వాళ్ళందరికి చెప్పాడు.

యేసు బాలికను బ్రతికించటం, ఒక స్త్రీని నయం చేయటం

(మత్తయి 9:18-26; మార్కు 5:21-43)

40 ప్రజలందరూ యేసు కోసం వేచి ఉన్నారు. ఆయన రాగానే వాళ్ళు ఆయనకు స్వాగతమిచ్చారు. 41 అదే సమయానికి సమాజ మందిరానికి అధికారిగా ఉన్న యాయీరు అన్న వ్యక్తి ఒకడు వచ్చి యేసు కాళ్ళ మీద పడ్డాడు. 42 తన పన్నెండేండ్ల కుమార్తె కూతురు చనిపోతుందని, తనకు ఒకే కూతురని, తన యింటికి వచ్చి ఆమెకు నయం చేయమని వేడుకున్నాడు.

యేసు అతని ఇంటికి వెళ్తుండగా, ప్రజలు త్రోసుకొంటూ ఆయన చుట్టూ ఉన్నారు. 43 ఆ గుంపులో పన్నెండేండ్లనుండి రక్తస్రావంతో బాధపడ్తున్న ఒక స్త్రీ ఉంది. ఆమె తన దగ్గరున్న ధనమంతా ఖర్చు పెట్టినా ఏ వైద్యుడూ ఆమె రోగాన్ని నయం చేయలేక పోయాడు 44 ఆమె యేసు వెనుకనుండి వచ్చి ఆయన అంగీ యొక్క కొనను తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. 45 ఆయన, “నన్నెవరు తాకారు?” అని అడిగాడు.

అంతా తాము కాదన్నారు. అప్పుడు పేతురు, “ప్రభూ! ప్రజలు త్రోసుకొంటూ మీ మీద పడ్తున్నారు కదా! ఎవరని చెప్పగలము?” అని అన్నాడు.

46 యేసు, “కాని ఎవరోనన్ను తాకారు. నా నుండి శక్తి వెళ్ళటం గమనించాను” అని అన్నాడు. 47 అప్పుడా స్త్రీ తనను గమనించకుండా ఉండరని గ్రహించి, వణకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడింది. తాను ఆయన్ని ఎందుకు తాకిందో, తనకు ఎలా వెంటనే నయమైందో అందరి సమక్షంలో చెప్పింది. 48 అప్పుడు యేసు ఆమెతో, “అమ్మా! నీ విశ్వాసం నీకు నయం చేసింది. శాంతంగా వెళ్ళు” అని అన్నాడు.

49 యేసు యింకా మాట్లాడుతుండగా ఆ సమాజ మందిరపు అధికారి ఇంటినుండి ఒకడు వచ్చి అతనితో, “మీ కూతురు చనిపోయింది. ప్రభువును కష్టపెట్టనవసరం లేదు” అని అన్నాడు.

50 ఇది విని యేసు యాయీరుతో, “భయపడకు, విశ్వాసం ఉంచుకో, ఆమెకు నయమైపోతుంది” అని అన్నాడు.

51 యేసు యాయీరు యింటికి వచ్చాడు. పేతురు, యోహాను, యాకోబు ఆ అమ్మాయి తల్లి తండ్రుల్ని తప్ప మరెవ్వరిని తన వెంట రానివ్వలేదు. 52 వాళ్ళంతా ఆమె కోసం శోకిస్తూ ఉన్నారు. యేసు, “మీ శోకాలు ఆపండి. ఆమె చనిపోలేదు, నిద్రపోతూ ఉంది అంతే” అని అన్నాడు.

53 ఆమె చనిపోయిందని వాళ్ళకు తెలుసు కనుక వాళ్ళు ఆయన్ని హేళన చేసారు. 54 యేసు ఆమె చేతులు పట్టుకొని, “లే అమ్మాయి!” అని అన్నాడు. 55 ఆమె ఆత్మ తిరిగి ఆమెలో చేరింది. ఆమె వెంటనే లేచి కూర్చొంది. యేసు వాళ్ళతో, “ఆమెకు ఏదైనా తినటానికి యివ్వండి” అని అన్నాడు. 56 ఆమె తల్లి తండ్రులు దిగ్భ్రాంతి చెందారు. కాని యేసు జరిగిన దాన్ని గురించి ఎవ్వరికి చెప్పవద్దని ఆజ్ఞాపించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International